7, నవంబర్ 2017, మంగళవారం

మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాట 1975లో పుట్టిందట!


ఆంధ్రభూమి పత్రికలో ఒక వ్యాసం వచ్చింది  తెలుగు మహాసభల చుట్టూ తెలుగు భాష! అన్న శీర్షికతో.

అందులో ఒక వింత విషయం ఉన్నది.

వ్యాసకర్త మాటలు చూడండి.

"మొదటి మహాసభల సందర్భంగా వెంగళ్‌రావు ప్రభుత్వం 40 లక్షలకుపైగా ఖర్చుచేయడం వృధా ప్రయాస అనేది నాటి ఆలోచనాపరుల నిరసనకు కారణం కాగా, నిధులు దుర్వినియోగం కావడం తెలిసిందే! ఈ సభల సందర్భంగానే ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ..’ అనే రాష్ట్రీయ గీతాన్ని శంకరంబాడి సుందరాచార్యతో రాయించడం జరిగింది. దీన్ని ఆలపించడానికై నాటి నటి, గాయకురాలు అయిన టంగుటూరి సూర్యకుమారిని లండన్ నుంచి రప్పించడం జరిగింది."

వ్యాసకర్త అభిప్రాయం ప్రకారం

-బహుళప్రచారంలో ఉన్న మా తెలుగుతల్లికి మల్లెపూదండ అన్న గీతాన్ని శంకరంబాడి సుందరాచార్యులు గారు మొదటి ప్రపంచ తెలుగు మహాసభల కోసం వ్రాసారు.

-సభానిర్వాహకులు శంకరంబాడి వారిని ఈ పాట వ్రాయటానికి పురికొల్పారు!!

-దాన్ని సభలో ఆలపించటం కోసం టంగుటూరి సూర్యకుమారి గారిని లండన్ నుండి ప్రత్యేకంగా రప్పించారు.

ఈ  ఉటంకింపులన్నీ తప్పులే.

వ్యాసకర్త ఏమాత్రమూ పరిశోధన చేయకుండా అలా అవాస్తవమైన విషయం ఎందుకు వ్రాసినదీ బోధపడదు. ఒకవేళ ఆయన కావాలని వ్రాసారేమో తెలియదు.

నిజాలు ఏమిటంటే,

ఈ మాతెలుగు తల్లికి మల్లెపూదండ గీతాన్ని దీనబంధు అనే సినిమా కోసం శంకరంబాడి వారు 1942లో రచించారు. కొన్ని కారణాలవలన ఆ గీతం సినిమాలో చోటు చేసుకోలేదు. కాని సూర్యకుమారి గారు తమ ప్రైవేట్ ఆల్బమ్ లో ఆ పాటను చేర్చితే అది జనంలోనికి చొచ్చుకొని పోయింది.

అనంతరకాలంలో సూర్యకుమారి గారు లండన్ నగరంలో స్థిరపడ్డారు. 1975లో మొదటి ప్రపంచ తెలుగుమహా సభలు జరిగాయి,

సూర్యకుమారి గారు ప్రఖ్యాత గాయకురాలు. ముఖ్యంగా ఈ మాతెలుగుతల్లికి పాట ఆమెకి గొప్ప కీర్తిని తెచ్చిపెట్టింది. ఆవిడనూ ఎలాగూ సభలకు ఆహ్వానించుతారు కదా? ఆవిడ ఆ గీతాన్ని ఆలపిస్తారు కదా? ఇక్కడ ఈ పాటకోసం లండన్ నుండి రప్పించా రనటం పొరపాటు. అసలు పాట ఎప్పుడు రచించబడిందన్నదే వ్యాసకర్త పొరపాటుగా పేర్కొన్నారు. ఇది ఆ పొరపాటుకు కొనసాగింపు అన్నమాట.

ఈ పొరపాట్లు నిజంగా పొరపాట్లేనా? ఈ తరం వాళ్ళకు ఏమీ తెలియదులే అన్న దిలాసాతో జనాన్ని బోల్తావేయటం కోసం చెప్పారా యీ మాటలను వ్యాసకర్త?

ఎన్నో విషయాలను సేకరించిన వ్యాసకర్తకు ఈ పాటగురించిన సమాచారం అలభ్యం ఐనది అనుకోలేను. అది నేడు అంతర్జాలంలోనే లభిస్తున్నది.  [ ఏమాటకు ఆమాట చెప్పుకోవాలి. అంతర్జాలంలో లభించినదంతా సరైనది అనుకోరాదు. శంకరంబాడి వారి గురించి ఒక సైటులో ఉన్న అమూల్య వాక్యాలు చూడండి. "ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి.. కూడా తేటగీతిలో రాసిందే. ఈ పద్యం ఆయన రచనలలో మణిపూస వంటిది."  ఇది తేటగీతిఛందస్సులో ఉన్నదన్న మాట తప్పు! అసలు ఇది పద్యం కాదు. ఒక గీతం. ]

ఒక దృక్పథంతో ఏదైనా వ్రాయదలచుకొన్నప్పుడు నిజాలను కప్పిపెట్టటమూ, వక్రీకరించటమూ వంటివి కొందరు చేస్తారు. ఇది ఆధునికమైన పోకడల్లో ఒకటి. అందుచేత వ్యాసకర్త ఉద్దేశాన్ని అనుమానించ తప్పటం లేదు.

శ్రీశ్రీ గారికి తెలుగు మహాసభలు జరగటం నచ్చలేదు. ఐతే ఏంటట? ఆయన మాటలు శిలాక్షరాలా? నిజాలకు ఋజువులా?

ఇదే శ్రీశ్రీ గారు

ప్రధాని కాగోరు టాగోరు
అయ్యాడు కొందరికి ఐసోరు

అని కూడా ఒక హాస్యాస్పదమైన కవిత్వం చెప్పి, అదేంటయ్యా అని జనం నిలదీస్తే, అబ్బే ఉట్టినే సరదాకి అలా అన్నానంతే అన్నదీ మనం మర్చిపోలేదు.

అయ్యా పత్రికా సంపాదకమహాశయులారా! కాస్త పరిశీలించి మరీ ప్రచురించండయ్యా!! ఏదిపడితే అది అచ్చొత్తేయటమేనా?

చివరిమాట. వ్యాసకర్త తమ ఫోన్ నెంబరు ఇచ్చారు. కాని ఆయన మాటలను ఫోన్ చేసి సరిచేయటం అసంగతం అవుతుందని అనిపించింది. ఆయన బహిరంగంగా తప్పుడు సమాచారం ఇచ్చినపుడు దానిని ఒక ప్రైవేట్ సంభాషణలో సరిచేస్తే ఆ సరిచేసిన సంగతి కాని సరైన సమాచారం కాని జనబాహుళ్యానికి ఎలా చేరుతుంది? సదరు వ్యాసకర్త స్వయంగా సరిచేసిన సమాచారాన్ని ప్రచురిస్తారని ఆశించలేకపోతున్నాను. ఒకవేళ ఆయన అలా చేసినా ఆంధ్రభూమి వారు ఇలా సవరణ ఒకదాన్ని ప్రకటించి వ్యాసం మొదట తప్పులు చెప్పిందని ఒప్పుకుంటారా అన్నదీ నాకు సందేహమే. అంత శ్రధ్ధ కాని బాధ్యత కాని ఉన్నవారైతే మొదటే వ్యాసంలోని పై తప్పుల్ని ఎత్తి చూపగలిగే వారు వ్యాసకర్తకు.  ఈ నేపధ్యంలో ఇలా టపా రూపంలో ఆ వ్యాసంలోని తప్పుల్ని ఎత్తి చూపక తప్పలేదు. వ్యాసంలో మరి కొన్ని తప్పులూ ఉండవచ్చును కాని వాటిని ప్రస్తుతం పరిశీలించే తీరిక లేదు.

బోనస్.  మా తెలుగుతల్లికి పాట సినిమాలోనే లేదు కాబట్టి అది వినబడదు కాని ఈ దీనబంధు సినిమాలోని కొన్నిపాటలు వినండి. 

9 కామెంట్‌లు: 1. జిలేబీ యేమన్నా రాసిందేమో ఆ ఆర్టికల్ :)

  రిప్లయితొలగించండి
 2. ఎవరండీ ఈ లచ్చయ్య గారు ? తల తిరిగిపోయింది చదివాకా !! ఈ తప్పుని వెంటనే టపా రూపంలో పెట్టగలిగారు. మీకు _/\_

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ధన్యవాదాలండీ. నిజానికి మరీ అంత వెంటనే టపాద్వారా ఎత్తిచూపలేకపోయాను. మా శ్రీమతి హాస్పిటల్ బెడ్ మీద ఉండటం కారణంగా. ఇలాంటి తప్పులు ఆధునికమేతావి వర్గం ధారాళంగా చేస్తూపోతుంటే చూస్తూ ఊరుకోవటం ఇబ్బందే మరి.

   తొలగించండి
  2. మీ శ్రీమతిగారు అనారోగ్యాన్నుంచి తొందరలో కోలుకోవాలని ఆకాంక్ష.

   తొలగించండి
 3. పాపం శంకరంబాడి గారు 🙁. పాపం సూర్యకుమారి గారు 🙁.

  మీ శ్రీమతి గారికి త్వరగా స్వస్ధత చేకూరాలని ఆశిస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 4. దీనబంధు చిత్రంలో ఈ పాట లేకపోయినా, 1976లో విడుదలైన అల్లుడొచ్చాడు అనే చిత్రంలో సుశీల పాడగా చిత్రీకరించారు.
  https://www.youtube.com/watch?v=OSfBPJAZV0E

  రిప్లయితొలగించండి
 5. చరిత్ర తిరగ రాయడం అంటే ఇలా కూడా ఉంటుందని తెలిసిందండి. నెనరులు.🙏

  రిప్లయితొలగించండి
 6. మీ శ్రీమతిగారు సత్వరం కోలుకోవాలని కోరుకుంటూ, వారికి శుభాకాంక్షలు.🙏

  రిప్లయితొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.