7, నవంబర్ 2017, మంగళవారం

జైమిని మహర్షికి దైవభక్తి లేదట!


ప్రముఖ బ్లాగు తెలుగుతూలికలో ఒక వ్యాఖ్య కనిపించింది,

మాలతిగారి ఆ  వ్యాఖ్య ఇలా ఉంది.

రమణారావుగారూ, వివియస్. శర్మగారు ఇచ్చిన సమాచారం ఇది –
వ్యాసుడు కేవలం 8 వేల శ్లోకాల జయం వ్రాసాడు. జైమిని అశ్వమేధ పర్వమే 4 వేల శ్లోకాలు. వైశంపాయనుడు జనమేజయునికి, చెప్పిన తరువాత సూతుడు నైమిశారణ్యంలో చెప్పాడు అప్పటికి లక్ష శ్లోకాలయింది. అందులో అశ్వమేధ పర్వం 3వేల శ్లోకాలే. వైశంపాయనునికి యజుర్వేదం, జైమినికి సామవేదం ఇచ్చాడు జైమిని పూర్వ మీమాంస అనే దర్శన సూత్రం గ్రంథానికి ఆద్యుడు. వ్యాసుడు భక్తి ప్రధానమైన పురాణాలు వ్రాయగా జైమినికి దైవ భక్తిలేదు. ఆయన కర్మకాండకె ప్రాధాన్యం ఇచ్చాడు . వారి భేదాభిప్రాయాలు భారత రచన పై కూడా పడినవి అంటారు. జైమినికి అర్జునుడంటే గొప్ప అభిప్రాయంలేదు. జైమిని వ్యాస భారతాలకి చాలా తేడాలున్నాయి.

ఈ వ్యాఖ్యను మాలతిగారికి పంపినది వివియస్.శర్మగారు. ఆయన అభిప్రాయం ప్రకారం జైమిని మహర్షికి దైవభక్తి లేదు!

ఋషులలో నాస్తికులు ఉండకూడదా? రామాయణంలో జాబాలి అలాంటి వాడు కాదా? స్వర్గం నరకం అనేవి పిచ్చి మాటలు - అవున్నాయో లేదో ఎవడు చూడవచ్చాడూ? సుఖం అనేది ఈ భూమిమీదనే ఈ శరీరంతోనే అన్నట్లుగా మాటలాడలేదా అని పాఠకులలో కొందరు అనుకోవచ్చును. కాని శ్రీమద్రామాయణంలోనే అదే ఘట్టం చివరన తాను రాముడి హృదయం తెలుసుకుందుకే అలా మాట్లాడానని జాబాలి చెప్పటమూ ఉంది మరి. కాబట్టి వేదఋషుల్లో నాస్తికులు ఉండరన్న విషయం స్పష్టంగా అర్థం అవుతున్నది.

జైమిని మహర్షి కృతమైన జ్యోతిషవిధానం ఒకటి బహుళప్రాచుర్యంలో ఉన్నది. ఆయన దేవుడూ లేడు దెయ్యమూ లేదనే నాస్తికుడే ఐన పక్షంలో జ్యోతిశ్శాస్త్ర సూత్రాలు ఎందుకు విరచిస్తాడు?

జైమిని మహర్షి పూర్వమీమాంసా శాస్త్రకారుడు. కర్మసిధ్ధాంతాన్ని వివరించినవాడు. నాస్తికుడైతే కర్మసిధ్ధాంతాన్ని ఎందుకు బోధిస్తాడు?

వేదవ్యాసులవారు వేదరాసిని నాలుగుగా విభజించిన సందర్భంలో ఆయా భాగాలలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఋషిని ప్రథానబోధకుడిగా నియమించారు. ఋగ్వేదాన్ని పైలుడికీ, యజుర్వేదాన్నివైశంపాయనుడికీ, సామవేదాన్ని జైమినికీ, అథర్వవేదాన్ని సుమంతునికీ ఆధ్యబోధకులను చేసారు. జైమిని దైవభక్తి లేని వాడైతే సామవేదాన్ని ఎలా వేదవ్యాసుడినుండి పొందాడు? అంతదాకా ఎందుకు, సాక్షాన్నారాయణావతారమని పేరువడ్డ వేదవ్యాసమౌని నాస్తికుడైన జైమినిని శిష్యునిగా స్వీకరించటం జరిగేదా?

పాఠకులలో కొందరకైనా ఈ శ్యామలీయం బ్లాగులో లోగడ ప్రచురితమైన వేదపాదస్తోత్రం గుర్తుకు వచ్చి ఉండే అవకాశం ఉంది. ఈ వేదపాదస్తోత్రం శివస్తుతిగా శ్రీ జైమిని మహర్షి చెప్పినదే. మరి ఆ మహర్షికి దైవభక్తి లేదన్న మాట వింతగా అనిపిస్తోంది. నాస్తికుడు శివస్తుతి చేస్తాడా?

అలాగే మూర్తిగారి వ్యాఖ్యలో గురుశిష్యులైన జైమిని వ్యాసులమధ్య భేదాభిప్రాయాలున్నాయన్న మాట ఉంది. అదికూడా సత్యం అనుకోను.  వ్యాసమహర్షి జయం వ్రాయటంలోని ఉద్దేశం వేరు. అది మొత్తం కురువంశచరిత్ర - వారి ఉత్పత్తివృధ్ధిక్షయాలు కూలంకషంగా ధర్మధృష్టితో విస్తారంగా చెప్పారు వ్యాసులు. జైమిని మహర్షి అశ్వమేథపర్వం కథను మాత్రం వివరంగా చెప్పారు - అది ఒక కావ్యదృష్టి కావచ్చును. అంతమాత్రంచేత వ్యాసజైమినుల మధ్య పొరపొచ్చాలున్నాయనటం మన  ఆధునికుల హ్రస్వధృష్టి వినా మరేమీ కాదు.

ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను.

వ్యాసభారతంలో భగవద్గీతల ప్రాముఖ్యతను గూర్చి వివరించనక్కర లేదు కదా.

భగవద్గీతలలో ఒక చోట "బలవానింద్రియగ్రామో విద్వాంసమపకర్షతి" అన్న ప్రస్తావన వస్తుంది. ఆ సందర్భంలో జైమినికి ఒక సందేహం కలిగిందట. ఆయన గురుదేవా, బలవానింద్రియగ్రామో విద్వాంసం నాపపకర్షతి అనికదా ఉండాలి అని అడిగాడు. అంటే బలవంతమైన ఇంద్రియాలు విద్వాంసులను కూడా ఆకర్షించి వేస్తాయి అని ఉండటం బదులు ఎంత బలవంతమైనవైనా ఇంద్రియాలు విద్వాంసులను మాత్రం ఆకర్షించలేవు అని ఉండాలి కదా అన్నది శిష్యపరమాణువు సందేహం.

అప్పుడు వ్యాసులవారు నవ్వి నాయనా నేను భగవంతుడైన కృష్ణుడు ఎలా చెప్పాడో అలాగే యథాతధంగా వ్రాసానయ్యా అని సెలవిచ్చారు. శిష్యుడికి సమాధానం దొరికినా, ఏమూలో కించిత్తు అనుమానం. ఒకవేళ గురువుగారు కొంచెం పొరబడ్డారేమో  సరిగా భగవద్వాక్యం వినలేదేమో అని!

కొంతకాలం గడిచాక, ఒకనాడు జైమిని మహర్షి ఒక అమ్మాయిని నదీతీరారణ్యంలో చూసి మోహపరవశుడై పెళ్ళాడబోయాడు. ఆ పడుచు అంది కదా, వరించిన వాడు అమ్మాయిని బుజాలమీద మోసుకొని వెళ్ళి మా కులపెద్ద అనుమతి తీసుకొని పెళ్ళిచేసుకోవాలయ్యా అని. జైమిని దానికి సిధ్ధపడి అలాగే చేసాడు.

కొంతదూరం అమ్మాయిని మోసుకొని వెళ్ళాక మీదినుండి బలవానింద్రియగ్రామో విద్వాంసం నాపపకర్షతి అంటూ కూని రాగం వినిపించటం మొదలయ్యింది.

జైమినికి విషయం అర్థమయ్యింది. గురువుగారిని బుజంమీదనుండి దించి సాష్టాంగపడ్డాడు.

ఇది వట్టి కథ.సభారంజకంగా హరికథల్లోనూ బుర్రకథల్లోనూ ఇరికించి లేదా ఈ నాటి ప్రవచనకారులైతే తమతమ వ్యాఖ్యానధోరణిలో ఇరికించి జనాన్ని ఆహ్లాదపరచటానికి మాత్రం పనికి వచ్చే తమాషా. ఒకప్రమాదం మాత్రం పొంచి ఉంది ఈ కథవలన. ఆధునికులు ఎవరైనా దీన్ని ఉదహరించి ఏమైనా చిత్రవిచిత్రవ్యాఖ్యానాలు చేయవచ్చును.