14, నవంబర్ 2017, మంగళవారం

దూతవంటె నీవేలే తోకరాయడా


దూతవంటె నీవేలే తోకరాయడా నీ
చేతలన్ని ఘనములే తోకరాయడా

రవిసుతుని దూతవై తోకరాయడా శ్రీ
రవికులపతి నరసినావు తోకరాయడా
రవికులేశు మైత్రి గూర్చి తోకరాయడా నీవు
ప్లవగేంద్రుని కాచినావు తోకరాయడా

శ్రీరాముని దూతవై తోకరాయడా పెద్ద
వారాసిని దుముకినావు తోకరాయడా
వారిజాక్షి సీత నరసి తోకరాయడా లంక
బీరమెల్ల కాల్చినావు తోకరాయడా

రామభక్తజనుల కెల్ల తోకరాయడా నిన్ను
కామధేను వందురయ్య తోకరాయడా
రామాజ్ఞను గొని రమ్ము తోకరాయడా నన్ను
స్వామికడకు కొనిపొమ్ము తోకరాయడా