3, నవంబర్ 2017, శుక్రవారం

చిక్కులన్ని తీరునోయి చింతలన్ని తీరునోయి


చిక్కులన్ని తీరునోయి చింతలన్ని తీరునోయి
చక్కగ శ్రీరామసేవ సలుపుచుండ వోయి

దిక్కులేని వారి కేమి దిక్పాలకుల కైన
చక్కనయ్య శ్రీరామచంద్రుడే దైవము
తక్కుంగల దేవతల నిక్కి గొల్చువారి
కెక్కడి దయ్యా శాంతి యెక్కడిది ముక్తి

శ్రీకంఠవాగీశపాకారి వినుతుని
లోకోత్తరుని సకలలోకాధినాథుని
లోకసంసేవ్యుని సాకేతవల్లభుని
శ్రీకరపాదయుగళి సేవించవలయును 

పట్టాభిరాముడే పరమాత్ము డన్న మాట
పట్టని వారి కింక పుట్టగతులే లేవు
చిట్టచివరిదాక శ్రీరామపాదములు
పట్టుకొన్న నింక పుట్టుపనియే లేదు