4, సెప్టెంబర్ 2021, శనివారం

మునిమానసమోహనుని కనులజూడరే

మునిమానసమోహనుని కనులజూడరే
మనసిజమోహనుని నేడు కనులజూడరే

కనులాజూడరే కమలాయతాక్షుని
జననాథుని మన జనకజాపతిని
దనుజసంహారిని మునిమఖరక్షకుని
వినయసంపన్నుని వీరరాఘవుని
 
కనులజూడరే ఘననీలదేహుని
వినుతసుశీలుని వేదవేద్యుని
వినతాసుతవాహుని కెనయైన వానిని
తనివారజూడరే ధర్మరక్షకుని

హరిని జూడరే సురుచిరాకారుని
వరభక్తరక్షకుని పరంధాముని
పరమయోగీంద్రహృపద్మంబు లందుడు
పరమపురుషుని వీని పరమాత్ముని