29, సెప్టెంబర్ 2021, బుధవారం

ధారాధరశ్యామ శ్రీరామ రఘురామ

ధారాధరశ్యామ శ్రీరామ రఘురామ 
కారుణ్యధామ నను కటాక్షించరా
 
నీకు తెలియదా హరి నేలను నరజాతికి
శోకమే‌ హెచ్చన్నది సుస్పష్టముగ
శోకాపనయనంబు నీకు సహజగుణమని
నాకెఱుకే నన్నేలు నారాయణా

మరల పుట్టువులేని మంచివర మీయరా
పరమాత్మ యదిచాలు పతితపావనా
హరి నీవు గాక నన్నాదుకొను వారెవరు
కరుణించరా రామ కమలేక్షణా
 
యేడేడు జన్మలుగ వేడుచునే యున్నాను
పాడిగా దాలసింప పరమాత్ముడా
యేడుగడవు నీవు గాకెవ్వరున్నారు నాకు
నేదు రేపనక రార నీరజాక్షుడా