11, సెప్టెంబర్ 2021, శనివారం

హరినామములే‌ పలికెదను - అరిషడ్వర్గము నణచెదను

హరినామములే‌ పలికెదను - అరిషడ్వర్గము నణచెదను
హరేరామ యని హరేకృష్ణ యని ఆనందముతో పాడెదను

హరిహరి యంటే కామవికారము లంతరించునని వింటిని
హరిహరి యంటే క్రోధము నాలో సురిగిపోవునని వింటిని
తరచగు కామక్రోధంబులనిక విడచి సుఖముగా నుందును 
మరువను మరువను హరిస్మరణంబును మరియికపై నే నెన్నడును
 
హరిహరి యంటే లోభమునాలో నణగిపోవునని వింటిని
హరిహరి యంటే మోహమునాలో నదృశ్యమౌనని వింటిని
విరచెద లోభము విరచెద మోహము వేడుకతో నేనుందును
మరువను మరువను హరిస్మరణంబును మరియికపై నే నెన్నడును

హరిహరి యంటే మదమంతయును విరిగిపోవునని వింటిని
హరిహరి యంటే మత్సరమిక నన్నంటనేరదని వింటిని
సరగున మదమత్సరముల నణచెద నానందముగా నుందును
మరువను మరువను హరిస్మరణంబును మరియికపై నే నెన్నడును