10, సెప్టెంబర్ 2021, శుక్రవారం

రామా నీదయ రానీరా

రామా నీదయ రానీ‌రా యిం
కేమియు వలదుర యిదిచాలు

ఒప్పుల కేమియు కుప్పను కానుర
తప్పులు చేసితి తరచుగను
తప్పులు కాల్చగ నిప్పుల వలెను
తిప్పలు పెక్కాయె దేవా నిజము

నిను వీడి పుడమికి నేను వచ్చుట తప్పు
వెనుదిరుగ నది పెదతప్పు
వెనుకకు రమ్మని పిలిచెడు నీమాట
వినక నే చెడితి నేమని చెప్పుదును

భవబంధమ్ముల పాలై యెంతో
వివశుడ నైతిర వేడుదురా
రవికులపతి నీ రక్షణ గోరుదు
చివరిపుట్టువిది చేయవయా