2, సెప్టెంబర్ 2021, గురువారం

నీవే రక్షించవలయును శ్రీరామచంద్ర

నీవే రక్షించవలయును శ్రీరామచంద్ర
భావించ నీవే నావాడవగుట నిక

లోకుల నమ్మి వారు లోభమోహముల చేత 
నాకు ద్రోహముచేయ నాకారణంబున
శోకావేశముల బొంది చొక్కుచున్నది చాలు
నీకు శరణమంటి‌ర నీరేజనయన

శ్రీకర నిన్ము నమ్మి చెడినవారేలేరయ
ఆకరిరాజు నేమి అతివ ద్రోవది నేమి
ఆకపిరాజు నేమి ఆవిభీషణు నేమి
చేకొని బ్రోచినట్టి నీకు శరణంటిర

పాకారిప్రముఖనుత భండనపండిత
లోకైకవీర ఈలోకమునం దీవే
నాకున్న చుట్టమవు నాకున్న మిత్రుడవు
నాకున్న దైవమవు నీవే శరణంటిర