9, సెప్టెంబర్ 2021, గురువారం

హరి హరి హరి యనవే

హరి హరి హరి యనవే
మరువక ఓమనసా

ఊరకనే నిత్యము నీ వూరెల్ల తిరుగచు
ధారాళముగ పలుకు దబ్బరల ఫలమేమే
నారకవాసంబును నానాబాధలు గాక
నారాయణ నామమే నోరారా పలుకవే

వెంటరాని ధనములకు వెఱ్ఱిమోహంబుతో
తుంటరివై చేసినట్టి దుడుకులకు ఫలమేమే
మంటలలో యముడు నిను మాడ్చుటయే  గాక
కుంటిసాకులు చాలు గోవిందా యనవే

నారాయణ భక్తులకు నరకభయ ముండదే
తారకనామము జేసి తరియించరాదటే
శ్రీరామ యనువాడు చెందునే మోక్షమే
మారుమాటలాడక శ్రీరామా యనవే