9, సెప్టెంబర్ 2022, శుక్రవారం

కేసీఆర్ గారు ప్రధానమంత్రి ఐతే?


కేసీఆర్ గారు ప్రధానమంత్రి ఐతే? 
 
కాకూడదని రూలు ఏమన్నా ఉందా? 
 
ఊరకే‌ తమాషాకు ఈవిషయంలో కొంచెం ఆలోచన చేదాం.
 
ఆయన కూడా భారతదేశంలో ఒక ప్రఖ్యాత రాజకీయ నాయకుడు. ఆయన పార్టీకి విదేశాల్లో కూడా అదరణ ఉన్నది. కొన్ని దేశాల్లో పార్టీశాఖలు కూడా ఉన్నాయని తెలుస్తున్నది. ఆయన ఒక రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తి. అంతే కాదు మూడవసారి కూడా ఆయన ఆ తెలంగాణా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అది జరుగకూడదనే కేంద్రంలో ఉన్న అధికారపార్టీతో సహా అనేక పార్టీలు కాళ్లాచేతులా ఆయనను అడ్డుకోవాలని నానాతంటాలూ పడుతున్నాయి.

జాతీయపార్టీని స్థాపించి దేశోధ్ధరణచేసే ఉద్దేశాన్ని ఆయన ఎన్నడో బయటపెట్టారు. అది జరిగేది కాదులే అన్నట్లు మిగిలిన జాతీయ పార్టీలు కొంచెం తేలిగ్గా  తీసుకున్నట్లు అనిపిస్తోంది. కాని ఇటీవలి పరిణామాలను చూస్తే ఆయన జాతీయరాజకీయరంగంలో చక్రం తిప్పటానికే కాదు అధికారాన్ని హస్తగతం చేసుకుందుకూ ఉవ్విళ్ళూరుతున్నారని స్పష్టం అవుతోంది.

అందుచేత ముందుముందు ఆయన ప్రధాని అయ్యే అవకాశాలను ఏపార్టీ కాని తేలిగ్గా తీసుకోవటం కుదరదు.

ఇంతకూ ఆయన ప్రధాని అవ్వాలని కోరుకోవటం వెనుక కారణాలు ఏమిటీ అని ఆలోచిస్తే తోచే జవాబులు ఇవి:
  • భారతీయ జనతా పార్టీ తాను కేంద్రంలో అధికారంలో ఉండటమే‌ కాక ఇతరరాష్ట్రాలలో కూడా అధికారాన్ని హస్తగతం చేసుకుందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అవసరం అనుకుంటే అడ్డదారుల్లో కూడా ఇతరపార్టీల ప్రభుత్వాలను కూల్చి మరీ అధికారాన్ని లాక్కుంటోంది. అది నైతికం కాదు.
  • ఏవో‌ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఏమి తంటాలు పడితే నేమీ? అది తెలంగాణాలోకూడా అధికారంలోనికి రావాలని ఎత్తులు వేస్తోంది. అదెలా సహించటం? తెలంగాణాపై తమ తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీకి తప్ప మరెవరికీ హక్కు లేదే? ఉండరాదే? ఉండనివ్వమే! ఎలా ఊరుకోవటం? దీనికి విరుగుడుగా భారతీయ జనతా పార్టీని జాతీయ స్థాయిలో దెబ్బకొట్టటమే మందు కదా.
  • దేశంలో కాంగ్రెసు పార్టీ‌ కూడా ఒకప్పటి పెద్దపార్టీ కాని నేడు అది దీనావస్థలో ఉంది. అది కోల్పోతున్న ఓట్లబ్యాంకులను భారతీయ జనతా పార్టీ కొల్లగొడుతోంది. ఆ పని తామే చేయవచ్చు కదా తమ జాతీయ పార్టీతో? భారతీయ జనతా పార్టీ వారిని ఇంకా బలపడ నీయటం ప్రమాదం కదా?
  • బంగారు తెలంగాణాని సాధించటం అనే‌కర్తవ్యం పూర్తి అయింది. దాన్ని పరిపాలించే బాధ్యతను తమ తెలంగాణా రాష్ట్రసమితి స్వీకరించి దిగ్విజయంగా నడిపిస్తోంది. ఆ పంథాలో కొనసాగటానికి తన వారసులు ఉంటే చాలు. తనకు జాతీయ రాజకీయాల్లో కూడా విజయపతాకం ఎగురవేసే అవకాశం ఉన్నప్పుడు చూస్తూ కూర్చోవటం ఎందుకు?
  • కేంద్రం తెలంగాణానూ ఆంధ్రానూ సమానంగానే చూస్తున్నాం అంటోంది. అదెలా ఒప్పుకోవటం. తెలంగాణానే‌ కదా ఎవరైనా పెద్దగా చూడవలసింది. 
  • కేంద్రం నుండి తాము అడుగుతున్నవి అరకొర గానే అందుతున్నాయి. అదే, కేంద్రంలోనూ తమదే అధికారం ఐతే తమకు కావలసిన వాటిని హాయిగా ఏ ఇబ్బందులూ లేకుండానే‌ పొందవచ్చును కదా. ఎన్నో‌ కొత్త ప్రాజెక్టులని ఏ‌ఆడ్దంకీ లేకుండా కట్టుకోవచ్చును. ఇతర రాష్ట్రాల - ముఖ్యంగా ఆంద్రా వారి - ప్రాజెక్టులను సులభంగా అడ్డుకోవచ్చును.
  • ఆంద్రతో వైరం ఉందంటే ఉంది. లేదంటే లేదు. అక్కడ తమ ఆశీర్వాదంతో ఏర్పడ్డ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తోంది. కాని ఎంతైనా రాష్ట్రప్రయోజనాలు అంటూ తరచూ అడ్డుపడుతూనే ఉంది. ముందుముందు వచ్చే‌ ప్రభుత్వాలు అంధ్రాకు కాని మరింతగా సహాయపడవచ్చును. అప్పుడు తెలంగాణాలో తమ పట్ల నిరసనలు రావచ్చును కదా. అందుచేత ఆంద్రావారికి చెక్ పెట్టేందుకు సరైన దారి, కేంద్రంలో తామే అధికారాన్ని అందుకోవటం.
  • తమ వారికి ఎంత కాలం రాష్ట్రంలో చిన్నా చితకా పదవులు ఇస్తూ సంతోషపెట్టటం? కేంద్రంలో అధికారాన్ని పొందితే అప్పుడు తాను ప్రధాని, తన వాళ్ళను అనేక పెద్దపదవుల్లో పెట్టవచ్చును. ఉదాహరణకు కేటీఆర్ గారికి తెలంగాణాను అప్పచెప్పవచ్చు. హరీష్ రావును ఎక్కడికన్నా గవర్నర్ హోదాలో పంపవచ్చును. కవితను కేంద్రంలో హోం వంటి ముఖ్యశాఖకు మంత్రిని చేయవచ్చును. ఇంకా సంతోష్ వగైరాలున్నారు - వాళ్లకూ మంచిపదవులే ఇవ్వచ్చు, రాష్ట్రంలో ఉన్న అధికారంతో ఎంతమందికని మంచిస్థాయి కల్పించటం కుదురుతుంది?

ఇలాంటివే మరొక కొన్ని కారణాలు ఉండవచ్చును నాకు ఇంకా తట్టనివి.

ఏదైతేనేం కేసీఆర్ గారు కేంద్రంలో అధికారం కోసం ప్రయత్నం మొదలు పెట్టారు. శుభం.

ఒకవేళ కేసీఆర్ గారు కాని ప్రధాని ఐతే అప్పుడు జరిగే పరిణామాలు కొన్ని పైన సూచించన దాన్ని బట్టి తెలుస్తూనే ఉన్నా మరికొంతగా బేరీజు వేదాం.

  • ఎప్పటిలాగే దేశపరిపాలన ఐనా సరే హైదరాబాదులోని కేసీఆర్ గారి ప్రగతిభవన్ నుండే‌ జరుగుతుంది. ఒకవేళ ఆ భవనం చాలదూ అనుకుంటే మరొక కొత్త భవనం వెలుస్తుంది ఆయన ఫార్మ్‌హౌస్‌లో. అంతే కాని ఆయన ఢిల్లీలో కూర్చుని పనిచేయరు.
  • చిన్న చితకా పార్టీలన్నీ కేసీఆర్ గారు ఏర్పరచి అధికారంలోని తెచ్చిన పార్టీలో విలీనం అవుతాయి.
  • కాంగ్రెసు పార్టీ కూడా కేసీఆర్ గారు ఏర్పరచి అధికారంలోని తెచ్చిన పార్టీలో విలీనం కాక తప్పదు - కొంచెం మొరాయించినా.
  • భారతీయ జనతా పార్టీ అక్రమాల మీద విచారణ మొదలవుతుంది. 
  • వైకాపా వారు కేంద్రంలో అధికారం పంచుకుందుకు అంగీకరిస్తారు.
  • మజ్లిస్ పార్టీ వారు కేంద్రంలో అధికారంలొ ముఖ్య భాగస్వామ్యం వహిస్తారు.
  • కేసీఆర్ గారితో చేతులు కలిపి భారతీయ జనతా పార్టీని మట్టికరిపించిన ఇతర పార్టీలలో కొన్నింటికి సహాయ మంత్రుల వంటి చిన్నచితకా పదవులు దక్కుతాయి. కొన్నింటిని కేసేఆర్ గారు చెత్తబుట్టలో వేసేస్తారు.
  • మరిన్ని పరిశ్రమలు తెలంగాణాకు వస్తాయి. తెలంగాణా వారు వద్దన్నవి మాత్రమే యితరరాష్ట్రాలకు దక్కుతాయి.
  • భారతదేశ చరిత్రను కాంగ్రెసు వారు కంగాళీ‌ చేసారని ఆరోపించిన భారతీయ జనతా పార్టీ మొదలు పెట్టింది చరిత్రను పునర్లిఖించే ఉద్యమాన్ని. అది కొనసాగుతుంది. అతే మరో కోణంలో. అందులో కాంగ్రెసు చేర్చిన కహానీలూ భాజపా చేరుస్తున్న కహానీలూ అన్నీ ఎగిరిపోతాయి. కొత్త చరిత్రను - తెలంగాణా ఎలా భారతస్వాతంత్రాన్ని తెచ్చిందీ అన్న కోణంలో ముందు ముందు చదువుతాము.
  • సర్దార్ వల్లభాయి పటేల్ దుర్మార్గుడు అని ఋజువు చేసే కార్యక్రమం మొదలౌతుంది. ఆయన హైదరాబాదు మీద్ చేసిన దురాక్రమణను గురించిన కథనాలు జాతీయమీడియాలో ప్రముఖంగా చర్చిస్తారు.
  • నిజాం దొరల కీర్తిని చాటటం కోసం అనేక కార్యక్రమాలు మొదలౌతాయి. 
  • స్వాతంత్రోద్యమంలో కేసేఆర్ పూర్వీకులు చేసిన త్యాగాల కథలు వెలుగులోనికి వస్తాయి.
  • హరీష్ రావో‌ మరొక కేసీఆర్ దగ్గర బంధువో ఆంధ్రాకు గవర్నర్ అవుతారు.
  • పార్లమెంట్ సమావేశాలు అప్పుడప్పుడూ‌ కొద్ది రోజుల పాటు జరుగుతాయి. ఊరికే‌ ఎక్కువ రోజులు సాగతీసి ప్రజాధనం దుర్వినియోగం చేయరు.
  • ఒకటి రెండు దఫాలు కేసేఆర్ గారు ఎన్నిక చేసిన వ్యక్తులు రాష్ట్రపతులూ ఉపరాష్ట్రపతులూ అవుతారు. దరిమిలా అధికారం కేటీఆర్ గారికి ఒప్పచెప్పి కేసీఆర్ గారే రాష్ట్రపతి పదవిని అలంకరించి దానికి వన్నె తెస్తారు.
  • కేసేఆర్ భజన సంఘాల నాయకులు మేధావులుగా గుర్తింపు పొంది అనేక కీలక మైన పదవుల్లో జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతారు.
  • మళ్ళా భారతదేశానికి అమెరికా లాగా  అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యమే‌ మంచిది అన్న చర్చ మెల్లగా మొదలౌతుంది. 

ఇంకా చాలా జరుగవచ్చును.  వేచి చూడండి!