హరిని భజించరె హరిని భజించరె హరిని భజించరె నరులారా
పరమపురుషుడగు హరిని భజించక మరి యెవరిని గొలిచెదరయ్యా
టక్కుటమారపు విద్యలు చూపే నరుల భజించిన చెడుదురయా
చక్కెరపలుకులు క్షుద్రవిభూతులు తక్క వారికడ నేముండు
మిక్కిలి సేవలు చేయించుకొని మిమ్ము ముంచెదరు నరులారా
చక్కగ శ్రీహరినే సేవించిన దక్కును మోక్షము నిక్కమిది
అరకొర సంపద లిచ్చెడి దేవత లందరి గొలిచిన చెడుదురయా
మరి వారిచ్చెడు విషయభోగములు మంచితీపికల విషములయా
సరిసరి వాటికి లోబడువారలు జన్మచక్రమును దాటరయా
మరువక శ్రీహరినే సేవించిన నరులకు మోక్షము దక్కునయా
కోరిగురువులను చేరిమంత్రములు నేరిచి ఫలితము లేదయ్యా
ఊరక బహుమంత్రములను బడసిన నొరగెడు మేలే మున్నదయా
తారకనామము నోటనుండగ తక్కిన మంత్రము లెందుకయా
శ్రీరామాయని నిత్యము పలికిన సిధ్ధము మోక్షము తెలియుడయా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.