24, సెప్టెంబర్ 2022, శనివారం

కాలి గజ్జెలు ఘల్లుఘల్లన రారా

కాలి గజ్జెలు ఘల్లుఘల్లన రారా కమలదళాక్షా రారా

నందగోపబాల రారా ఆనందతాండవ కృష్ణ రారా
సుందరసుకుమార రారా ఓ సోగకన్నుల పిల్లగాడా
బృందావనానంద రారా నీ విరహమోర్వగలేము రారా
ఎందెందు వెదకేము రారా నీ వెందున్న దయచేసి రారా
 
నీలగగనశ్యామ రారా మేము నీవారమే కద రారా
కాళీయమర్దన రారా మాకన్నుల వెలుగా రారా
వేళాయె వేళాయె రారా ఇదె విచ్చేసె చంద్రుడు రారా
లీలామానుషరూప రారా వనమాలాధరా యింక రారా 

మురళిని వాయించ రారా ఏపొదలోన దాగుంటి వౌరా
నెఱజాణతనమున కృష్ణా నీసరివారు లేరయ్య రారా
హరి నీకు మ్రొక్కేము రారా మమ్మాటపట్టించకు రారా
కరుణతో‌ మమ్మేల రారా మము పరవశింపజేయ రారా