2, సెప్టెంబర్ 2022, శుక్రవారం

రక్తి ముక్తి దాయకము రామనామము

రక్తి ముక్తి దాయకము రామనామము కనుక
శక్తి కొలది రామనామజపము చేయుడు

వెన్నునివి నామాలు వేనవే లన్నిటిలో
తిన్నగా సదాశివు డెన్నుకొన్న నామము
జన్నము లొనరించిన పున్నెమే దక్కును
అన్నా శ్రీరామ యన నపవర్గ మబ్బును

గొప్పవే కావచ్చును కోట్లాది మంత్రాలు
తప్పకుండగ నేర్వదగినవే కావచ్చును 
చెప్పు డం దెన్నున్నవి జీవులకు మోక్షమును
తప్పకుండగ నీయ నొప్పారు ప్రేమతో

ఒక్క రామనామమే యుర్వి నట్టి దున్నది
ఒక్క రామనామమే యుర్వి నేలుచున్నది
ఒక్క రామనామమే యుగములుగా భక్తుల
చక్కగా  పోషించుచు సాగిపోవుచున్నది