15, సెప్టెంబర్ 2022, గురువారం

ధనధనేతరముల వలన

ధనధనేతరమురముల వలన తప్పక సుఖ మున్నదా

మనసిజగురుసేవ లోన మనకు సుఖం బున్నదా


పేరాశను బొంది నరులు వెదకివెదకి సంపదలను

ధారుణి గాలించి తమకు దక్కినంత సాధించి

ఆరాటపడుచు బొక్కుచు నధిక మన్వేషించుచును

వారు పొందు సుఖ మంతయు వట్టిభ్రాంంతియే కదా


స్మరవిరోధి యుపదేశము చక్కగాను గ్రహియించి

హరినామము లందు శ్రేష్ఠమైన రామనామము గొని

నిరంతరము జపముచేయు నిర్మలాత్ములైన యట్టి

హరిభక్తులు పొందుసుఖం బంతులేనిది కదా


వెంటరాని ధనాదులకు వెంపరలాడుటలు మాని

కంటగించి మోహాదివికారములను తెగగోసి

బంటులగుచు రామచంద్ర ప్రభువును సేవించుచు

నంటకాగి యుండు వారి దసలుసిసలు సఖము


2 కామెంట్‌లు:

 1. మనకు కావలసిన దానికన్న అధికం కోరుకుని అందుకోసం ఇతర్లని పీడించటాన్ని నిరసించవచ్చును గానీ శ్రీస్వరూపమైన ధనాన్ని మొత్తానికి తిరస్కరించవచ్చునా?

  ఆనందవల్లి సూక్తం "సైషానందస్య మీమాంసా భవతి,యువా స్యాత్సాధు యువాధ్యాయకః - ఆశిష్ఠో దృటిష్ఠో బలిష్ఠః తస్యేయం పృధివీ సర్వా సర్వా విత్తస్య పూర్ణా స్యాత్,స ఏకో మానుష ఆనందః:కూలంకష పరిశీలన చేసి ఆనందం గురించి ఇలా సూత్రీకరించవచ్చు - విద్యావంతుడైన ఒక మంచి కుర్రాడు గనక దృఢ శరీరం గలవాడైతే భూమి సమస్తమూ అతనికి ఐశ్వర్యాన్ని ఇచ్చి ఆనందాన్ని కలిగిస్తుంది.ఇది ఒక మానవపురుషతత్వం యొక్క ఆనందానికి కొలత." అంటున్నప్పుడు మీరిలా "ధనధనేతరమురముల వలన తప్పక సుఖ మున్నదా" అని ప్రశ్నలు వేస్తున్నారేల?కొంచెం గందరగోళం అనిపిస్తున్నది మాస్టారూ!

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. పేరాశతో వెంపరలాడటాన్నే నిరసించటం ముఖ్యంగా జరిగింది ఈకీర్తనలో. ధనము అవసరమే కావచ్చును కాని అదే సుఖపరమావధి కాదని తాత్పర్యం

   తొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.