18, సెప్టెంబర్ 2022, ఆదివారం

రామచంద్ర నిను రక్షణ కోరితి

రామచంద్ర నిను రక్షణ కోరితి

స్వామీ నీవే శరణమయా


దేవదేవ నిను తెలియగ లేరట

దేవతలైనను తెల్లంబుగ నిక

భావజజనక వాతాత్మజనుత

భావింపగ నెవ్వాడనయా


పరిపరి విధముల నరిషడ్వర్గము

దురితములకు నను ద్రోయగను

మరల బుట్టుచును మరల జచ్చుచును

కర మలసితిరా ఘనశ్యామా


దివికిని భువికిని త్రిప్పకు మయ్యా

చివరి జన్మమిది చేయగదయ్యా

భవతాపము నోర్వగజాలనయా

రవికులనాయక రామయ్యా