22, మే 2020, శుక్రవారం

హరేరామ హరేరామ యనవేమే మనసా



హరేరామ హరేరామ యనవేమే మనసా

మరొక జన్మ ముండదే మతిలేని మనసా



ఆమంత్ర మంతటిదని యీమంత్ర మింతటిదని

యేమో ఋజువు లున్నాయని స్వాములోర్లు చెప్పేరని

యేమి తెలిసి నమ్మేవే యెంతమోసపోయేవే

రామ మంత్ర మొక్కటే రక్షించే మంత్రమే



ఏమి నేర్చి లాభమేమి యెంత నేర్చి ఫలమేమి

రామరామ యనెడు దాక రక్షణ యెట నున్నదే

పామరుడగు వాని కైన పండితోత్తమున కైన

రామనామ మంత్రమే రక్షణకవచమే



అయిన దేమొ ఐనదిలే ఆసంగతి వదలవే

నయము కదా నేటి కైన నమ్మకము కుదిరినది

వియచ్చరులు మునులు కూడ వేడుకొను రాముని

రయమున శరణు జొచ్చి రక్షింప వేడవే



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.