ఈ మధ్య కాలంలో దూరదర్శన్ ఛానెల్ హఠాత్తుగా బాగా ఆదరణలోనికి వచ్చింది. దానికి కారణం దూరదర్శన్ వారు తమ వద్ద నున్న బహుళజనాదరణ పొందిన ఆ రామాయణం ధారావాహికను పునఃప్రసారం చేస్తూ ఉండటమే.
ఇలా పునః ప్రసారం చేయటం వెనుక ఒక గొప్ప కారణం ఉందట. రాముడి తమ్ముళ్ళు ఎందరు అన్న చిన్న ప్రశ్నకు మన భారతీయుల్లో నుండే ఒకటి నుండి వంద వరకూ అన్ని సంఖ్యలూ జవాబులుగా వచ్చాయట. అందుచేత అక్షరాలా జనోధ్ధరణకార్యక్రమంగా మరలా రామాయణం పునఃప్రసారం మొదలైనదట.
అనుమానప్పక్షులు ఉంటారు. వారి కోసం కొంచెం వ్రాయాలి మరి. తెలుగువారిలో తక్కువే కావచ్చును పౌరాణికవాంగ్మయంలో ఓనమాలు తెలియని వారు. ఔత్తరాహుల్లో మాత్రం ఎక్కుఏ అని దశాబ్దుల క్రిందటనే విన్నాను.
నా మిత్రుడు సుబ్రహ్మణ్యేశ్వర రాజు అని ఒకతను హైదరాబాదు వదలి ఉత్తరాదికి వెళ్ళాడు ఉద్యోగం మారి. కొన్నాళ్ళ తరువాత హైదరాబాదుకు అతను వచ్చినప్పుడు కలుసుకున్న సందర్భంలో పిచ్చాపాటీలో ఈ విషయం చెప్పాడు. అతని వాక్యం "వాళ్ళలో ఎక్కువమందికి భీముడూ భీష్ముడూ అనే ఇద్దరున్నారని తెలియదు" అన్నది చదివితే ఆక్కడి జనం సంగతి అర్ధం అవుతుంది కదా.
ఐతే రానురానూ మన తెలుగు వారిలోనూ అటువంటి మహానుభావులు ఎక్కువ అవుతున్నారేమో అనిపిస్తున్నది.
దానికి తోడు అసక్తి లేకపోవటం, తిరస్కారభావం (ఆట్టే ఏమీ తెలియకుండానే!) కలిగి ఉండటం అనే గొప్ప లక్షణాల కారణంగా వీరి సంఖ్య పెరుగుతున్నదని నా విచారం.
నిన్న మే 1 న సాహితీ నందనం బ్లాగులో వచ్చిన ఈవ్యాఖ్యను పరికించండి.
సీతని పోగొట్టుకున్న టైంలో అన్న భార్యపైన, రాజ్యంపైన కన్నేసిన సుగ్రీవుడు లడ్డూలాగా దొరికాడు. అప్పటికి రాముడు 'జీరో'. అందుకే వాలిని చెట్టు చాటునుంచి చంపాడు. వానరసేనని సపాదించాక ఆబలంతో రావణుడితో ముఖాముఖీ యుద్దం చేశాడు. అక్కడ తేడావొస్తుందెలారా బాబూ అనుకునే టైంలో... మళ్ళీ లడ్డూ లాగా విభీషణుడు రేడీ.
అడవుల్లో, కొండల్లో యుధ్ధం చెయ్యడంలో నేర్పరితనంలేని అయొధ్య సైన్యాన్ని వాడుకోకుండా తనసైడు ప్రాణనష్టాన్ని పూర్తిగా తగ్గించాడు.
ఇప్పుడు చదువరులకు నా బాధ అర్దం ఐనదని భావిస్తున్నాను.
చదువరులు నా బాధ మరొకటి కూడా అర్ధం చేసుకోవాలని కోరుతున్నాను.
తెలుగుబ్లాగు ప్రపంచంలో రెండు రకాల వ్యక్తులున్నారు. బ్లాగులు వ్రాసేవారు, అవి చదివే వారు. నిజానికి చదివే వారిలో ముప్పాతిక మువ్వీసం మంది బ్లాగులు వ్రాసే వారే.
వ్రాసే వారిలో కాలక్షేపం కోసం వ్రాసే వారి నుండి నిష్ఠగా ఆథ్యాత్మికవిషయాలు మాత్రమే వ్రాసే వారి దాకా అనేక రకాల వారున్నారు.
చదివే వారిలో దాదాపుగా అందరూ కాలక్షేపం కోసం చదివే వారే.
ఎందరో ఎన్నో విషయాలపైన అమూల్యాభిప్రాయాలు వెలువరిస్తూ ఉంటారు నిత్యమూ. రాజకీయవిషయాలపైన ఐతే నిముషాల వ్యవధిలోనే స్పందనలు పుంఖానుపుంఖాలుగా వస్తూ ఉంటాయి.
కాని ఇంత దారుణంగా రామనింద జరుగుతున్న సందర్భంలో ఒక్కరికి కూడా ఒక్కముక్క మాట్లాడటానికి మనసు రాలేదా?
ఈ దౌర్భాగ్యపు వ్యాఖ్య వ్రాసిన పెద్దమనిషి కనీసం పిల్లల బొమ్మల రామాయంణం పుస్తకం లాంటి దైనా చదివిన వాడు కాదని ఒక్కరికీ తోచలేదా?
అవాకులూ చవాకులూ మాట్లాడరాదని ఇంత గడ్డిపెట్టటానికి ఒక్కరికీ ధైర్యం లేదా?
ఈ సాహితీ నందనం బ్లాగరొకాయన మహా దొడ్డవారు. ఆయన బ్లాగులో ఎవరేమి వ్రాసినా కిమ్మనక ఆమోదించి ప్రచురించి తరిస్తారు. చూసి ఆమోదించి మరీ ప్రచురించటం ఉచితం అని ఆయనకు ఎంత చెప్పినా ప్రయోజనం లేదు.
దైవనింద అంత కమ్మగా ఉన్నదా ప్రజలారా? లేదా అలా నింద చేయరాదు అని చెప్తే వారి మనోభావాలు దెబ్బతింటాయి, రాముడికి దెబ్బతగిలితేనేం ఆయన ఏమీ అనుకోడు ఏమీ చేయడులే అని ఉదాసీనంగా ఉన్నారా?
ఒక్క మాట తెలుసుకోండి అయ్యలారా అమ్మలారా,
ఉ. సారపు ధర్మమున్ విమల సత్యముఁ బాపము చేత బొంకుచేఁ
బారము బొందలేక చెడబాఱినదైన యవస్థ దక్షులె
వ్వార లుపేక్ష చేసిరది వారల చేటగు గాని ధర్మ ని
స్తారకమయ్యు సత్య శుభదాయక మయ్యును దైవ ముండెడున్
మనకెందుకొచ్చిన గొడవలే అని చూస్తూ ఊరకున్న పుణ్యాత్ములూ పాపభారం మోయవలసిందే అని చదువరులను గ్రహించ కోరుతాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.