18, జనవరి 2022, మంగళవారం

చింతామణి నాటకాన్ని ఆంధ్రా ప్రభుత్వం నిషేధించటం సముచితమా? అలా ఐతే‌ వారు కన్యాశుల్కం నాటకాన్నీ‌ నిషేధీంచాలి.


కొద్ది సేపటి క్రిందట టివీలో వార్తలను వీక్షిస్తున్నప్పుడు ఈనిషేధం గురించిన సంగతి తెలియవచ్చింది. దరిమిలా ఈ‌వార్తను ఆంధ్రజ్యోతిలో కూడా గమనించాను.

నిజానికి చింతామణి చాలా మంచినాటకం. అసక్తి కలవారు ఈచింతామణి నాటకాన్ని ఆర్కీవ్ సైట్ నుండి దిగుమతి చేసుకొని చదువుకొనవచ్చును.

ఈనాటకాన్ని వ్రాసింది మహానుభావులు మహాకవి కాళ్ళకూరి నారాయణరావు గారు. ఈనాటకం ముఖ్యంగా వేశ్యావృత్తికి వ్యతిరేకంగా వ్రాయబడింది. వేశ్యాలంపటులై జనులు ఎలా సర్వనాశనం అవుతారో తెలియజేయటానికి కాళ్ళకూరి వారు లీలాశుకుడి వృత్తాంతాన్ని స్వీకరించి నాటకంగా మలిచారు.

కాని ఒక ఉదాత్తమైన ఆశయంతో వ్రాయబడిన గొప్పనాటకాన్ని నిషేధించేముందుగా ఆంధ్రాప్రభుత్వం వారు చక్కగా పూర్వాపరాలు విచారించినట్లుగా నాకు అనిపించటం లేదు.

నా చిన్నతనం, టీనేజీతో సహా తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట గ్రామంలో గడిచింది. అప్పట్లో వినాయకచవితి వచ్చిందంటే ఊర్లో కనీసం అరడజను చోట్ల పెద్దపెద్ద పందిళ్ళూ వెలిసేవి, తొమ్మిదిరోజులూ‌ నాటకాలూ నడిచేవి. తప్పనిసరిగా ప్రదర్శనకు వచ్చే‌ నాటకాలంటే సత్యహరిశ్చంద్ర,  కురుక్షేత్రం, చింతామణి అనే చెప్పాలి. తమాషాగా ఒకరేజున ఒకటికంటే ఎక్కువ పందిళ్ళల్లో ఒకేనాటకం ప్రదర్శించటమూ జరిగేది తరచుగా. 

అలా పందిరినాటకాలు చూడటం మొదలు పెట్టిని కొత్తలోనే అనుకుంటాను చింతామణి నాటకం చూడటం‌ జరిగింది. ఆనాటకంలో విరుచుకు పడిన దరిద్రపు సంభాషణలకు తట్టుకోలేక కొద్ది సేపటిలోనే లేచి వెళ్ళిపోయాను. మరలా ఎప్పుడూ ఆనాటకాన్ని చూసే సాహసం చేయలేదు.

ఐతే ఈ అసభ్యమైన సంభాషణలు కాళ్ళకూరి వారి కలంనుండి వెలువడ్డవి కావు. కాంట్రాక్టు నాటకాల వాళ్ళు జనాకర్షణ కోసం జనం మీదకు పవిత్రమైన రంగస్థలం‌నుండి వదలినవి!

ఈనాడు నాటక కళ అంతరస్తున్నది. ప్రదర్శనలు అపురూపం. ఒకవేళ చింతామణి నాటకాన్ని సవ్యంగా ప్రదర్శించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించటం సమంజసం‌. అంతేకాని చారిత్రక ప్రశస్తి కల నాటకాన్ని తప్పుపట్టి నిషేధించటం సముచితం కాదు. ఏమాత్రం కాదు.

అసలు నేడు తెలుగు సినిమాల్లోనే, కథ డిమాండు చేస్తోందీ, సన్నివేశం డిమాండు చేస్తోందీ, పాత్రను బట్టి డైలాగులు అలాగే ఉండాలీ అంటూ ఇష్టారాజ్యంగా బూతుమాటలు వాడుతూ ఉంటే ఈ‌ప్రభుత్వాలు ఏమీ అనటం లేదు. అందుచేత ఇప్పుడు అసభ్యంగా ఉందని చింతామణి నాటక ప్రదర్శనని నిషేధించలేరు.

ఈనాటకం వేశ్యాలోలత్వం గురించి విస్తృతంగా ప్రస్తావిస్తున్నది కాబట్టి, రంగస్థలంపై వేశ్యల పాత్రలూ, విటుల పాత్రలూ తప్పకుండా ఉంటాయి. అందులో‌ నాటకకర్త చేసిన తప్పిదం ఏమీ లేదు. మరెందుకు నిషేధించినట్లు? అంటే చింతామణి నాటకంలో హాస్యపాత్రను సుబ్బిశెట్టి అనటం ద్వారా వైశ్యకులం‌ మనోభావాలను దెబ్బతీసినందుకట!

నాటకం అన్నాక, అది కేవలం ప్రబోధాత్మకమైన సన్నివేశాలతోనూ సుదీర్థసంభాషణలతోనూ అత్యంత గంభీరమైన నడకతో ఆద్యంతమూ నిర్మించలేరు కదా. అలా చేసిన పక్షంలో జనరంజకంగా ఉండదు. అందుచేత హాస్యం అన్నది కూడా తప్పనిసరిగా నాటకంలో పోషించవలసి ఉంటుంది. 
 
అలా ఒక హాస్యపాత్రకు సుబ్బిశెట్టి అన్నపేరు ఉంచారు నాటకకర్త.
 
ఏ సుబ్బారావో అని పెట్టకుండా సుబ్బిశెట్టి అని పేరు పెట్టి వైశ్యకులాన్ని అవమానించారు అని సాక్షాత్తూ ఒక మంత్రివర్యుల ఆరోపణ. ఇది అంత సమంజసమైన ఆలోచన కాదని నా అభిప్రాయం.
 
శెట్టి అని అన్నందుకే  వైశ్య కులాన్ని అవమానించటం అన్న వాదన సమంజసం అని ఒప్పుకొనే‌ పక్షంలో గురుజాడ అప్పారావు పంతులు గారి జగత్ప్రసిధ్ధమైన కన్యాశుల్కం నాటకంలోని పాత్రల పేర్లు సిధ్ధాంతీ, అగ్నిహోత్రావధానులు, లుబ్ధావధానులూ, రామప్పపంతులూ, సౌజన్యారావు పంతులూ, కరటకశాస్త్రి అంటూ ఇలా ఉన్నాయే, ఇది బ్రాహ్మణ్యాన్ని అవమానించటమే అని తీర్మానం చేసి కన్యాశుల్కం నాటకాన్ని కూడా వెంటనే నిషేధించాలి. నిషేధించి తీరాలి!
 
ఒక్క బ్రాహ్మణ్యమే‌కాదు ఇంకా ఇతరకులాలకూ బాగానే  అవమానపు చురకలు పడ్డాయి కన్యాశుల్కంలో.  ఈ కన్యాశుల్కం నాటకం ప్రతి ఒకటి ఆర్కీవ్‌లో ఉంది.  అందులో 167వ పేజీలో కలెక్టరు మాటలు "బ్రాహ్మల్లో ఉన్నంత ఖంగాళీ‌, మాలకూడూ మరెక్కడా లేదు"‌ అని. చూసారూ ఈ‌ఒక్క ముక్కలో అటు బ్రాహ్మణకులాన్నీ‌, మాలకులాన్నీ కూడా నిందించి వారి మనోభావాలు దెబ్బతీస్తున్నారు మహాబ్రాహ్మణులైన అప్పారావు పంతులు గారు. 
 
అన్నట్లు కన్యాశుల్కం నాటకంలో ఒక ముఖ్యమైన హాస్యపాత్రకు పేరు పోలిశెట్టి అని పేరు పెట్టి వైశ్యకులాన్ని హేళన చేసారుగా పంతులు గారు. మరి కన్యాశుల్కం నాటకాన్ని కూడా అంధ్రాప్రభుత్వం వారు తక్షణం నిషేదించటం బాగుంటుందేమో.
 
అందుకే‌ ప్రభుత్వం వారు బాగా ఆలోచించి మరీ చింతామణిని నిషేధించి ఉండవలసింది!

2 కామెంట్‌లు:

  1. నాటకంలో ఒక పాత్ర పేరిట ఒక వర్గాన్ని హేళన చేయడం జరుగుతున్న చరిత్ర. ఎవరు ఆపగలుగుతున్నారు?ఆపాలంటే ఆర్డర్లు ఎంతపని చేస్తాయి?అసలు అశ్లీలం ఏది? ఎవరు నిర్ణయిస్తారు?అనే వాదనలు, కొంత హాస్యం పుట్టించడం నేరమా? ఇలా వాదనలు జరిగిపోతాయి, ఎంతకి తేలవు.ఆ అవర్గం వారు ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చి నాటకాన్ని నిషేధింప జేసుకున్నారు. మీకు చేతనైతే మీరూ ఆ పని చేయండి.
    అసలు వేశ్యలెక్కడా? ఒకప్పుడు వేశ్యా గృహాలు, వాడలు, ఊళ్ళు ప్రత్యేకంగా ఉండేవి.ఇప్పుడు వేశ్యా వృత్తే లేదే!
    వ్యభిచారం చాలా రూపాలు తీసుకుంది.ఇంకెందుకీ నాటకం?అలాగే బాల్య వివాహాలెప్పుడో అంతరించాయి, ఇంకా కన్యాశుల్కం నాటకం ఎందుకు? నిషేధింపజేయండి.

    రిప్లయితొలగించండి
  2. ప్రభుత్వం ఆలోచించే నిషేధించింది లెండి. మొన్నీ మధ్యన ఆ కులానికి చెందిన సుబ్బారావ్ గుప్తా అని ఒంగోలు లో వాళ్ళ పార్టీ కి చెందిన వ్యక్తిని ఎదో మంచి చెప్పబోతే చితకబాది దాన్ని వీడియో తీసి పంచి, ఆ తరువాత పిచ్చొడి గా ముద్ర వేస్తూ ఓ సందేశం రాష్ట్ర ప్రజలకు పంపిన విషయాన్ని కాంపెన్సేట్ చేస్తూ ఈ నాటకాన్ని నిషేధించారు లెండి. దీన్నే కేరెట్ అండ్ స్టిక్ అంటారు అనుకొంటా.
    ఈ జలగ అండ్ కంపెనీ, కొట్టించి ఇలా బట్టర్ పోస్తే సరిపోతుంది ఈ కోముట్లకు అనుకోవటం మాత్రం హైలైట్.
    p.s. హడావుడి లో టెంగ్లీష్ పదాలు వాడినందుకు క్షమించండి.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.