1, ఆగస్టు 2021, ఆదివారం

కారుణ్యాంబుధివిరా శ్రీరాముడా

కారుణ్యాంబుధివిరా శ్రీరాముడా మన
సార నిన్ను సేవింతుము శ్రీరాముడా

శౌరివే నీవగుటను శ్రీరాముడా తల్లి
శ్రీరమయే సీతకదా శ్రీరాముడా 
ధారుణి కరుదెంచి నీవు శ్రీరాముడా సుర
వైరుల పనిపట్టినావు శ్రీరాముడా

ఓరిమితో నీతిపథము శ్రీరాముడా మాకు
కూరిమితో నేర్పినావు శ్రీరాముడా
దారితెన్ను లేని మాకు శ్రీరాముడా మంచి
దారి చూపినావురా శ్రీరాముడా
 
నీరూప నాముములే శ్రీరాముడా ప్రితి
నారాధించెదము మేము శ్రీరాముడా
వైరిషట్కమును గెల్చి శ్రీరాముడా మేము
వైరాగ్యము నొందెదము శ్రీరాముడా
 
కారణకారణుడవో శ్రీరాముడా నిన్ను
చేరువారు చెడిపోరు శ్రీరాముడా
భూరితేజోమయా శ్రీరాముడా నిన్ను
చేరుటే పరమార్ధము శ్రీరాముడా

కోరి నిన్ను కొలిచెదము శ్రీరాముడా వేగ
కోరికలను వీడెదము శ్రీరాముడా
ఘోరసంసారమును శ్రీరాముడా దాటి
చేరెదము నీ పదము శ్రీరాముడా