1, ఆగస్టు 2021, ఆదివారం

దురవగాహ్యములై తోచు నీలీలలు

దురవగాహ్యములై తోచు నీలీలలు 
హరి మేమవి తెలియునంత వారమె

అన్నిలోకములు నీ వాక్రమించుట యేమి యవి
యన్నియు నీవే యమరించినవే
చిన్నివటువై నీవు చెలగి బలికది తెలియ
పన్నిన నాటకమే వామనరూపము

పగవాడని యా రావణునణచుట యేమి అత
దొగి నీకు బంటుగా నుండు జయుడేగా
తగునని యిక వానికి తగిలిన శాపము దీర్చ
జగదీశ రాముడవై చనుదెంచి నావు

భక్తపరాధీనుడ భావించుటకు మాకు తగు
శక్తి కూడ నీవే చక్కగా నీయవలె
రక్తిమీరగా మేము రామచంద్రా హరి
ముక్తిప్రదుడా నిన్ను మొనసి సేవింతుము

1 కామెంట్‌:

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.