6, ఆగస్టు 2021, శుక్రవారం

అందగాడ చిఱునగవులు నేడు చిందించుచు

అందగాడ చిఱునగవులు నేడు చిందించుచు నా
డెందమునకు రాకుందు వెందుకో

ముప్పొద్దుల నిను బహువిధములుగా పొగడకుండ నొక
ముద్దయు గొంతున దిగకుండును నీ వెద్ది తలచి యింత
పెద్దతడవు నా మనసున తోచక పెడమో మిడితివిరా
వద్దువద్దు రఘురామ పరాత్పర భావమునకు రారా

చిన్నాచితక తప్పులు తెలియక చేసితి నేమో
అన్నన్నా నీ వంతమాత్రమున నగుపడ ననరాదు
వన్నెకాడ నీ చల్లని చూపుల వెన్నెల బడయక నే
నెన్నడుంటి నా భావంబునకు నికనైను రారా

రామచంద్ర నిను వేడుక మీఱగ రమ్మందునయా
స్వామీ యన్యుల నటు పిలువనని చక్కగ నీకెఱుకే
పామరుడను నా దొసగుల నెంచక భక్తిని గమనించి
నా మనవిని విని నాభావమునకు నయముగ రావయ్యా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.