16, జనవరి 2026, శుక్రవారం

రామ నీనిర్ణయము

రామ నీనిర్ణయము చెప్పరా రాజీవనయన
కామితము నాకిచ్చువాడవొ కాదో చెప్పరా

స్వామి నీనిర్ణయము మేరకు 
  భూమి మీదకు చేరుకొంటిని
రామచంద్రా నీదు కీర్తిని 
  ప్రేమతో నే చాటుచుంటిని
నీమముగ నీనామ జపమును 
  నిత్యమును నే చేయుచుంటిని
శ్యామసుందర తొంటిపదమున 
  చక్కగా నను నిలుపుటెపుడు

ఎన్నడును వేరొకరి నెన్నక 
  నిన్ను నిత్యము తలచుచుంటిని
నిన్ను మించిన వాడు లేడని 
  నిన్ను పొగడుచు పాడుచుంటిని 
నిన్ను చేరుట యెన్నడో యని 
  నిన్నువేడుచు నడుగుచుంటిని 
సన్నుతాంగా తొంటిపదమున 
  చక్కగా నను నిలుపుటెపుడు

చాలురా యీ యిలను చుట్టుట 
  చాలురా సంసార మీదుట
చాలురా తనువులను దాల్చుచు 
  సర్వకష్టము లనుభవించుట
చాలురా స్వస్థానమునకు 
  చాల దూరముగా వసించుట 
చాల ప్రేమగ తొంటిపదమున 
  చక్కగా నను నిలుపుటెపుడు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.