13, జనవరి 2026, మంగళవారం

ఇతరులతో నేమి పనో

ఇతరులతో నేమి పనో యీరాముడు లేడా
ప్రతిమారును పిలువగనే పలుకుటయే లేదా

ఎవరెవరో వరములిచ్చి యేదో యుధ్ధరింతు రని
యవివేకము తోడ గొలిచి యలమటించ నేలా
భువనేశ్వరు డైన రామభూమిపాలు డొక్కని
సవినయముగ సేవించిన సర్వ మబ్బు చుండగా

వచ్చిన దీభూమికి రఘువరుడు పంపినందులకు
ముచ్చటగా హరికార్యము ముగియించుకు పోవలెను
పిచ్చిపిచ్చి యాశలతో వెంగళులై చెడనేటికి
యచ్చమైన సంపద శ్రీహరిదయ మనకుండగా

శ్రీరాముల కన్న దైవశిఖామణి వేరెవ్వరు
శ్రీరాముల పాదపద్మసేవ మోక్షదాయకమని
శ్రీరాముల కీర్తి వ్యాప్తి చేయుటయే మనకార్యము
వారివీరి గొప్ప లెంతవైనను మనకెందుకయా


1 కామెంట్‌:

  1. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. రాముడు దొరికితే సమస్యే లేదుగా! కొనసాగండి. 👍

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.