పుస్తకం.నెట్ సైట్‌లో ఒక కవిత్వసమీక్ష "కాలం కంపనలో కొన్ని క్షణాలు, శ్రీకాంత్ తో" చదివిన తరువాత నాస్పందన ఇది.
అక్కడ ఒక బాక్స్ కట్టి మరీ ప్రచురించిన ఒక కవితను చూడండి:
“వంటలో నిమగ్నమై హటాత్తుగా తల ఎత్తి
మసి అంటిన అరచేతితో
తన ముఖాన్ని తుడుచుకుంటూ
నీవైపు చూసి అప్రయత్నంగా నవ్వుతుంది తను
మరి
ఇక ఆ తరవాతా, ఆ రాత్రి అంతా
మండుతూనే ఉండింది
ఆ కట్టెల పొయ్యి అప్రతిహతంగా ఉజ్వలంగా –“
నిజానికి అదంతా ఒక వాక్యం. చూడండి తిన్నగా వ్రాస్తే అది ఇలా ఉంటుంది.
"వంటలో నిమగ్నమై హటాత్తుగా తల ఎత్తి మసి అంటిన అరచేతితో తన ముఖాన్ని తుడుచుకుంటూ నీవైపు చూసి అప్రయత్నంగా
నవ్వుతుంది తను. మరి ఇక ఆ తరవాతా, ఆ రాత్రి అంతా మండుతూనే ఉండింది ఆ
కట్టెల పొయ్యి అప్రతిహతంగా ఉజ్వలంగా"
ఏమిటండీ ఈ వ్యవహారం?
ఓహో. తెలుగు వాక్యాన్ని
ముక్కలుముక్కలుగా విరిచి, ఆముక్కల్ని నిలువుగా పేర్చి వ్రాస్తే అది
ఆటోమేటిగ్గా (వచన)కవిత్వం ఐపోతుంది! ఎంత సులువూ కవి కావటమూ కవిత్వం
బరికేయటమూను!!
ఇన్నాళ్ళూ ఎంత అమాయకత్వం ఎంత అజ్ఞానంలో ఉన్నాం మనం
అంతానూ. కవి కావాలంటే గొప్ప భావాలు కలగాలీ గొప్ప వ్యక్తీకరణ ఉండాలీ గొప్ప
భాషాపటిమ ఉండాలీ అదుండాలీ ఇదుండాలీ అని.
అవేమీ అక్కరలేదూ ఎలాగో కాస్త పేరూ పలుకుబడీ వంటివి ఉండాలీ అని జ్ఞానోదయం అయింది.
ధన్యవాదాలు.
పైగా ఆ సమీక్షకు ముక్తాయింపు వాక్యం ఇలా ఉంది:
"శ్రీకాంత్ కవిత్వం కూడా పాఠకుడికి ఇంత జీవధాతువుని ప్రసాదిస్తుంది."
జీవధాతువు అంటే ఏమిటో మరి!
ఈరోజుల్లో తెలుగు కవిత్వం అంటే ఇలాగే ఉంటుందీ, ఇలా ఉంటేనే జనం ఆదరిస్తున్నారూ అనకండి. కవిత్వసంకలనాలు ఇలా సాటి కవులూ రచయితలూ మెచ్చి వ్యాసాలు వ్రాయటం వరకే తప్ప అవి జనాదరణ పొందటం లేదు.
మరొక పార్శ్వమూ ఉంది. కొన్నికొన్ని తమాషాల కారణంగా పద్యకవులూ ఇబ్బడిముబ్బడిగా పెరిగారు. శతకాలూ వగైరా జోరైనాయి. అవి కొనేవాళ్ళు కూడా ఎవరూ లేరు లెండి.
కొత్త రకం కవిత్వం పుస్తకాలైనా పాతధోరణి కవిత్వం పుస్తకాలైనా చివరకు సభల్లో పంచుతున్నరు దారిలేక పాపం వాటిని వ్రాసినవారు. చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే వారి సాటి కవులూ వగైరా బిరుదులున్న వారు కూడా వాటిని అక్కడే కుర్చీల్లో వదిలేసి వెళ్ళిపోతున్నారు!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.