13, నవంబర్ 2021, శనివారం

ధనమదము కలవారికి దైవము మోక్షమీయడే

ధనమదము కలవారికి దైవము మోక్షమీయడే
మనసా శ్రీరామనామము మాత్రము మరువకే

దండిగాను సంపాదించి ధనము చాల వెచ్చించి
కొండమీద గుడికడితే గొప్పయేమిటే
ఉండుండి యుత్సవాలు నూరేగింపులను చేసి
పండగలు చేయ దేవుడు పడిపోతాడా

కులుకుచు బంగారుపూలు కొనివచ్చి పదిమంది
తిలకించగ పూజచేయు తీటదేనికే
వలచేనా రాముడు నీ ప్రదర్శనాటోపములు
తులలేని వరములను దోచిపెట్టేనా

ధనము రామపరముగా తనువు రామపరముగా
జనుడు మసలెనేని హరి సంతోషించునే
మనసు రామమయముగా మాట రామపరముగా
కనవచ్చిన రాముడు మోక్షము నొసంగునే


4 కామెంట్‌లు:

  1. పడిపో తా డా ఆ చోట kanika ristada
    అని ఉంటే ఎలా ఉంటుందో చూడండి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఏదో ఫ్లోలో అంటారే అలా ఆ మాట పడిపోయిందండీ.
      కాని అవసరం అనుకుంటే మార్చవచ్చును. (సాధారణంగా మార్చటం నా విధానం కాదు)
      ఇక్కడ మీరన్నట్లు మార్పు చేయలేనండీ. యతిమైత్రి స్థానంలో ఉంది ఆ మార్పు కాబట్టి అక్కద 'ప'కు యతిమైత్రి ఉన్నమాట మొదలవ్వాలి! కనికరిస్తాడా అనలేం. చూదాం ఏమన్నా మార్పు వస్తుందేమో అక్కడికి.

      తొలగించండి
    2. పడిపోవడం అనేది బాగానే ఉందిగా!సాధారణంగా అక్కడ భక్తవేషధారులు చేసేదాన్ని గవర్నమెంటు ఆఫీసుల్లోనూ ప్రైవేట్ అంపెనీల్లోనూ చ్జేస్తే "వెన్న పుయ్యడం,కాకా పట్టడం" అంటారు.అదే పనిని చేసేవాళ్ళందరికీ జనరలైజ్ చేసి చెప్పడానిక్ బుట్టలో వెయ్యడం అనే మాట వాడతారు."ఉండుండి యుత్సవాలు నూరేగింపులను చేసి పండగలు చేయగ మీ బుట్టలో పడిపోతాడా!" అనే అర్ధం వస్తుంది.ఇందులో దోషం ఏముంది?"బుట్ట" అనేది అక్కడ లేకపోయినా ఆ పనికి బుట్టలో వెయ్యడం అనే జాతీయం ఖరారై ఉన్నప్పుడు పనిగట్టుకుని ఇరికించాల్ద్సిన అవసరం లేదు, అందులోనూ ఛందస్సూ యతులూ పాటిస్తున్నప్పుదు అసలు ఆ రెండు పదాల మధ్యన బుట్టని చేర్చడం కుదరదు కదా!

      తొలగించండి
    3. మీ విశ్లేషణకు ధన్యవాదాలు హరిబాబు గారూ.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.