10, నవంబర్ 2021, బుధవారం

జానక్యాః . . . . . శ్లోకం గురించి


ఈ రోజున వాత్సల్య గారు పంపిన వ్యాఖ్య ఆలోచనీయంగా ఉంది.

శ్యామలీయం గారూ,
నిష్కర్షగా నేను-నా రాముడు అని చెప్పడం చాలా బాగుందండీ.
జానక్యాః శ్లోకం ఇంటర్నెట్లో ఒకొక్కచోట ఒకొక్కలాగ ఉంది.మీకు వీలయితే సరి అయిన శ్లోకాన్ని ఇక్కడ జవాబు ద్వారా వ్రాయగలరా?

చలామణీలో ఉన్న ఈ శ్లోకంలో ఉన్న తప్పులని ఎత్తిచూపుతూ ఎవరైనా వ్రాయకపోయి ఉంటారేమో, ఇంటర్నెట్లో వెతకాలి అనుకున్నప్పుడు నాకు గుర్తు వచ్చినది మీ బ్లాగు, శర్మగారి బ్లాగే. 

ఈ జానక్యాః .. శ్లోకం శ్రీరామకర్ణామృతం లోనిది.

జానక్యాః కమలామలాంజలిపుటే యాః పద్మరాగాయితా 
న్యస్తా రాఘవమస్తకే తు విలసత్కుంద ప్రసూనాయితాః  
స్రస్తాః శ్యామలకాయకాంతికలితాః యా ఇంద్రనీలాయితాః 
ముక్తా స్తా శ్శుభదా భవంతు భవతాం శ్రీరామవైవాహికాః ॥ 1-82॥
 
ఇప్పుడు నేను పైన చూపిన పాఠం వావిళ్ళవారు 1972లో ప్రచురించిన ప్రతిలోనిది. ఈప్రతి ఒక నాదగ్గర జీర్ణావస్థలో ఉంది! వావిళ్ళవారి ప్రచురణలు ప్రమాణంగా గ్రహించటం అన్నది పరిపాటి. దానికి కారణం ప్రచురణకర్తలు స్వయంగా మహాపండితులు కావటం.

ఒక ఐతిహ్యం ఉన్నది. వావిళ్ళవారు ప్రచురించే పుస్తకాలకు సంబంధించిన ప్రతులకు తప్పొప్పులను సరిచూడటానికి పండితులకు ఒక గొప్ప అవకాశం ఉండేదట. అచ్చులోనికి వెళ్ళక ముందు వావిళ్ళవారి పరిష్కర్తల బృందం సరిచూడటం జరిగిన తరువాత ఆ అవకాశం ప్రెస్సుకు వచ్చే కవిపండితులకు తప్పకుండా ఉండేదట. ఏవన్నా తప్పులు కనుక ఎత్తి చూపటం ఎవరన్నా చేస్తే వారికి తప్పుకు ఒక అణా చొప్పున పారితోషికం కూడా వావిళ్ళవారు ఇచ్చేవారట.

అందుచేత నా బాల్యం నుండి గమనిస్తున్నాను, సాహిత్య చర్చల్లో వావిళ్ళవారి పాఠం అంటే అదొక ప్రమాణంగా పరిగణించబడుతూ ఉండటం.

ఈశ్లోకం తెలుగునాట బహుళ ప్రచారం పొందినది. ముఖ్యంగా పెళ్ళిశుభలేఖల్లో ముపాతికమువ్వీసం లేఖలు ఈశ్లోకంతో ప్రారంభం అయ్యేవి. స్వయంగా నేనే చాలా సార్లు పెళ్ళిశుభలేఖల్లో ఈ శ్లోకం ప్రతి సరిదిద్దటం జరిగింది.

అంతర్జాలంలో ఈశ్లోకం చాలాచోట్ల తప్పులతో కనిపిస్తున్నమాట నిజమే.
సాక్షిపత్రిక వారి వ్యాసంలో ఈ శ్లోకంలో "రాఘవ మస్తకే చ" అనీ "ముక్తా తా" అనీ పొరపాటు ముద్రణ ఉంది.
సుజనరంజని పత్రిక వారి వ్యాసంలో కూడా ఈశ్లోకంలో "రాఘవ మస్తకేచ" అని ఉంది.
చాగంటి సత్సంగ్ వారి పేస్‌బుక్ పేజీలోనూ "రాఘవ మస్తకేచ" అని ఉంది.
తెలుగుపద్యం బ్లాగు పేజీలో కూడా ఇలాగే "రాఘవ మస్తకేచ" అని ఉంది.
ఇలా "రాఘవ మస్తకేచ" అని చాలా ప్రచురంగా కనిపిస్తోంది.
 
ఇంకా అనేక చోట్ల రకరకాల తప్పులతోనే కనిపిస్తోంది. ఒకచోట "ముక్తాః శుభదాః భవంతు" అనిఉంది  
 
వావిళ్లవారి పాఠం ఇచ్చాను కదా, దీనిలో "పద్మరాగాయితా" అని విసర్గరహితంగా ఉంది. కాని దాదాపు అందరూ "పద్మరాగాయితాః" అని అంటున్నారు. అంతర్జాలం నిండా ఈపాఠమే ఉంది. మరి వావిళ్ళవారు విసర్గను వదలటం పొరపాటున చేసారా అన్నది నా సందేహం. ఈవిషయంలో పెద్దలను సంప్రదించాలి.

ఇకపోతే, ఈశ్లోకానికి వివరణ ఇవ్వమని మిత్రులు శర్మగారు ఆదేశించారు. అవశ్యం అలా చేయవలసినదే.

ఈశ్లోకం అంతా ముక్తాః అని ఇందులో ఒక ముక్క ఉంది చూడండి, దాని చుట్టూ తిరుగుతుంది. మరి ముక్తాః అంటే ముత్యాలు. మౌక్తికం అంటే సంస్కృతంలో ముత్యం అని అర్ధం. ముక్త అన్నా ముత్యమే. శ్లోకంలో ముక్తా అని విసర్గ లేంకుడా ఉందనుకోకండి. విసర్గ ఉంది కాని సంధికార్యం జరిగి కనబడకుండా పోయింది ముక్తాః తాః అన్నది ముక్తాస్తా అయ్యిందన్నమాట. ఇవి మామూలు ముత్యాలు కావండోయ్. ముత్యాల తలంబ్రాలు. సీతారాముల పెండ్లిలోని ముత్యాల తలంబ్రాలు. ఆ తలంబ్రాల ఘట్టంలో కొట్టొచ్చినట్లు కనిపించిన ఒక సంగతి గురించి ఈశ్లోకం మనకు చెప్తోంది.
 
తలంబ్రాలు అన్న మాటలో‌ తల అన్నది తెలుస్తోంది. కదా జాగ్రతగా చూడండి, చివర్న ప్రాలు అన్నది మరొక మాట కనిపిస్తోంది కదా, ఆ ప్రాలు అంటే ఏమిటీ? ఏమిటంటే బియ్యం. మరి బియ్యం ఎలాగుంటాయీ తెల్లగా కదా. సరే మన యిళ్ళల్లో పెళ్ళిళ్ళైతే బియ్యంతో తలంబ్రాలు పోసుకుంటారు వధూవరులు.
 
కాని రాముడూ‌ సీతా అంటే మనలాంటి సామాన్యులా ఏమిటీ? రాములవారేమో దశరథుడనే‌ మహారాజు గారి కొడుకైతే సీతమ్మ యేమో జనకుల వారనే మరొక మహారాజు గారి కూతురు. ఒక యువరాజూ ఒక యువరాణీ‌ పెండ్లాడుతుంటే మనలాగా మామూలు బియ్యంతో తలంబ్రాలు పోసుకోవటమేం! ఇంచక్కా మంచి ముత్యాలతోనే తలంబ్రాలు పోసుకుంటారు. అవును కదా.

ఆ మంచి ముత్యాలేమో అందంగా తెల్లగా ఉంటాయి. అదీ నిజమే‌ కదా. కాని అక్కడట అవి సీతమ్మ దోసిటలో  ఉన్నప్పుడు  ఎఱ్ఱగా మంచి పద్మరాగాల్లాగా ఉన్నాయట. పద్మరాగాలు అంటే మాణిక్యాలు. అవి చాలా ఎఱ్ఱగా ఉంటాయి కదా. వీటిల్ని రూబీలు అంటార్లెండి ఇంగ్గీషులో.
 
అవునండీ, సీతమ్మవారి దోసిటలో అవి ఎఱ్ఱగా ఉండక తప్పదు కదా, ఆ తల్లి అరచేతులు చక్కగా ఎఱ్ఱగా ఉండటం వలన. శ్లోకంలో కమలామలాంజలిపుట అన్నారు. మామూలు కమలాలు అనగా తామరలు కావు కెందామరలు అంటే ఎఱ్ఱతామరలు. ఈ సమాసంలో ఉన్న అంజలి అంటే దోసిలి అని అర్ధం.

అమ్మ ఆ మంచిముత్యాలని తన ఎఱ్ఱని దోసిటిలో పట్టి రామయ్య శిరస్సు మీదకు వదలింది. అంటే తిన్నగా నెత్తికి చేయి తాకించి కాక కొంచెం పైనుండి పోసిందన్నమాట తలంబ్రాలు. అప్పుడవి చక్కగ కుందప్రసూనాల వలె అనగా మల్లెపూల వలె
స్వఛ్చమైన తెలుపుతో ప్రకాశించాయట.

 ఆ మంచిముత్యాలే రామయ్య నెత్తి మీద నుండి క్రిందికి జారుతున్నప్పుడు ఇంద్రనీలమణుల్లా ఉన్నాయట. ఇంద్రనీల మణుల్ని మనం నీలమణి అంటాం సాధారణంగా. ఇంగ్లీషులో సఫైర్ అంటారు లెండి. అలా ఎందుకైనవండీ అని అనవచ్చును మీరు. సమాధానం సుళువే‌ సుమా. రామయ్య నీలమేఘఛ్చాయ కలవాడు కదా. అందుకే ఆయన శిరస్సుమీద నుండి ఆయన వంటి మీదిగా క్రిందికి జారుతున్నప్పుడు అవే‌ మంచి ముత్యాలు తమాషాగా నీలమణుల్లాగా నల్లగా ఐపోయాయట ఆయన కాయకాంతి అంటే శరీరవర్ణం పొందటం వలన.

ఈశ్లోకంలో మంగళాశాసనం చేస్తూ అటువంటి అద్భుతమైన ఆ సీతారాముల పెండ్లివేడుకలోని ముత్యాల తలంబ్రాలు మీకు శుభాలను ప్రసాదించు కాక అంటున్నారు.

ఈశ్లోకంలో ఈసంగతులు చెప్పటానికి పద్మరాగాయితా, కుందప్రసూనాయితా, ఇంద్రనీలాయితా అంంటూ‌ ఆయితా అన్న శబ్దంతో చెప్పారు కదా, ఈ ఆయితా అంటే ఏమిటీ అంటే సంస్కృతంలో సిధ్ధంగా ఉండటం తయారుగా ఉండటం అన్నమాట. పద్మరాగాయితా అంటే‌ పద్మరాగాలుగా తయారైనవి అని అర్ధం. అంటే మారిపోయినవి అని మన అన్వయం చేసుకోవాలి.
 
పెండ్లిలో ముత్యాల తలంబ్రాలు ఎందుకూ అంటే మనం కారణం ఇప్పటికే చెప్పుకున్నాం మహారాజుల బిడ్దల పెండ్లి కదా అని. అంతే కాదు ఎంతో కొంత మొత్తంలో తలంబ్రాలలో ముత్యాలను కలపటం మంచిది. ముత్యం అనేది అందరికీ మంచిని చేసే గుణం కల రత్నవిశేషం. అందుచేత సామాన్యులమైనా మన యిండ్లల్లో పెండ్లివేడుకలోనూ తలంబ్రాలలో కొన్ని ముత్యాలు కలపటం మంచి ఆచారం.

ఈరోజుల్లో ఐతే నానా చెత్తనూ రంగురంగుల ప్లాస్టిక్ పూసలతో సహా తలంబ్రాలలో కలిపి వాటిని అపవిత్రం చేస్తున్నారు. అందులో చాలావరకూ రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ అని చెప్పనవసరం లేదుగా. రీసైకిల్ అంటే ఆ ప్లాస్టిక్ పూర్వం ఏ తాగిపాడేసిన ప్లాస్టిక్ స్ట్రాలనుండో తినిపారేసిన టిఫిన్ సంచీలనుండో మరే కశ్మలం నుండో చెప్పలేం - అదంతా పెళ్ళికొడుకూ‌ పెళ్ళికూతురూ తలంబ్రాల్లో కలిపి నెత్తిన పోసుకోవట మేమిటీ దరిద్రం‌ కాకపోతే.

పవిత్రమైన మంచి ముత్యాలనే వాడండి తలంబ్రాల్లో కలిపేందుకు. ఆ ముత్యాలు రాములవారి పెండ్లి తలంబ్రాలు అనుకొని ఈశ్లోకాన్ని అనుసంధానం చేసుకోండి. ఆ ముత్యాలు శుభం కలిగించు కాక అని కోరుకోండి.

ఈశ్లోకం ఈపాటికి చక్కగా మీ అందరికీ బోధపడిందని అనుకుంటున్నాను. మరలా మరలా శ్లోకాన్ని మననంచేసుకొని ఆస్వాదించండి దానిలోని సారస్యాన్ని.

శుభం.