8, జులై 2016, శుక్రవారం

రెండు పద్యకంఠీరవాలు!



వరంగల్లులో అష్టావధానం అంటూ శంకరాభరణం బ్లాగులో కంది శంకరయ్య గారు ఒక టపా ప్రచురించారు. ఆ టపాలో సదరు సభకు పిలిచే ఆహ్వానపత్రాన్ని ఫోటోతీసి వేసారు. అందులో ముఖ్య అతిధి గారు సహస్రపద్యకంఠీరవ బిరుదాంకితులు. శంకరయ్యగారిని సహస్రపద్యకంఠీరవ అంటే ఏమిటో బోధపడలే దండీ అని ప్రశ్నిస్తే ఆయన నాకు ఇచ్చిన జవాబును ఇక్కడ ప్రచురిస్తున్నాను.

శ్యామల రావు గారూ, వారికి ఎక్కడ, ఎప్పుడు, ఎవరు ఆ బిరుద మిచ్చారో నాకు తెలియదు. ఈరోజు ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి డా. ఇందారపు కిషన్ రావు (ప్రసిద్ధ అష్టావధాని) గారి ఇంటికి వెళ్లినప్పుడు వా రన్నారు "ఈ సహస్ర పద్య కంఠీరవ ఏమిటి? ఆయనను ఏకధాటిగా వేయి పద్యాలు అప్పగించే సామర్థ్యం ఉంది. అందుకు సహస్ర పద్య పఠన కంఠీరవ అనో సహస్ర పద్య ధారణా కంఠీరవ అనో అనాలి. కాని సహస్ర పద్య కంఠీరవ అనడం తప్పు" అన్నారు.

ఈ జవాబులో ఏకధాటిగా పద్యాలు అప్పగించే సామర్థ్యం గురించిన ప్రస్తావన చదవగానే నాకు నా చిన్నతనంలో జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది.

మా నాన్నగారు కీ.శే. తాడిగడప వేంకట సత్యనారాయణగారు 60ల్లో తూర్పు గోదావరిజిల్లా గెద్దనాపల్లెలో ప్రాథమికోన్నతపాఠశాలకు ప్రథానోపాధ్యాయుగా ఉండేవారు. పాఠశాలా విద్యార్థులకు మా పాఠశాల వార్షికోత్సవం వచ్చిన సందర్భంలో రకరకాల పోటీలు పెట్టేవారు. వార్షికోత్సవాలు చాలా సందడిగా జరిగేవి.

ఒకసారి పద్యాలను అప్పగించటం పైన పోటీ నిర్వహించారు.

ఆ సంవత్సరం నాతోపాటు మా బేబీపిన్ని కూడా చదువుకొన్నది ఆ పాఠశాలలో.

ఇద్దరం కంటికి కనబడ్డ ప్రతిపద్యాన్నీ బట్టీ పట్టటం మొదలు పెట్టాము.

ఈ పోటీ జరిగే విధానంలో ఒక మెలిక పెట్టారు. మొదటగా ప్రతి అభ్యర్థీ వేదికమీదకు రాగానే వచ్చిన పద్యాల లిష్టును జడ్జీలకు అందించాలి. వాటిలోనుండి జడ్జీలు చదవమని అడిగిన ప్రతి పద్యాన్నితప్పుల్లేకుండా చదవాలి. అంతేనా అనకండి. జడ్జీలు అడిగితే పద్యం అర్థాన్నీ వివరించాలి మరి. అదీ మెలిక.

పాఠ్యపుస్తకంలోని పద్యాలు అన్నీ పిడి వేసేసాం. నా కంటే మా పిన్ని ఒక క్లాసు పెద్ద. ఐనా నా పుస్తకంలోనివీ తన పుస్తకంలోనివీ అన్నీ పట్టేసాం. అప్పట్లో ఆంధ్రప్రభ సచిత్రవారపత్రికలో కూడా పద్యాలు వచ్చేవి. ఇంట్లో అవి బోలెడున్నాయి. అవన్నీ బట్టీ ఐపోయాయి.

కొన్ని శతకాలు కూడా ఉన్నాయి మా యింట్లో. వాటిల్లోనుండీ వీలైనన్ని భట్టీయం వేసాం

పద్యం దొరకగానే బట్టీ పట్టటం. ఒకరి కొకరు అప్పచెప్పుకోవటమూ మొదటి ఘట్టం.

ఆతరువాత మా నాన్నగారి దగ్గరకు పరిగెత్తి ఆ పద్యం అర్థం చెప్పమని ఒకటే పోరు పెట్టటం.

ఇలా వందలమీద పద్యాలను కంఠగతం చేసుకున్నాం.

ఇద్దరమూ చెరొక నాలుగువందల పద్యాలూ లిష్టులు వేసి ఇచ్చాం.  పాపం మిగతా పిల్లలంతా పదిపరకపద్యాల లిష్టులే సమర్పించా రనుకుంటాను.

నన్నొక ఇరవయ్యో పాతికో పద్యాలను అడిగారు ఒకటి అప్పగించగానే మరొకటి చొప్పున. చాలా వాటికి అర్థాలు కూడా అడిగారు.

మా పిన్నినీ అలాగే అడిగారు.

ఇద్దరం సమఉజ్జీగానే చెప్పాం.

ఒక్క చోట కాబోలు తాను అర్థం వివరించటంలో కొంచెం తడబడిందనో లేదా తనకంటే నేనొక యేడాది చిన్నవాడిని కదా అనో నాకు మొదటిస్థానమూ ఆమెకు రెండవస్థానమూ ఇచ్చారు. మరీ చిన్నపిల్లలం కదా అని బహుమతులే ఇచ్చారు కాని న్యాయంగా పద్యధారణాకంఠీరవ అన్న బిరుదం కూడా ఇస్తే ఎంత బాగుండేదీ అని!

తదనంతర కాలంలో ఆమె భాషాప్రవీణ పట్టా పుచ్చుకొని నిడదవోలులో తెలుగు ఉపాధ్యాయురాలిగా పని చేసింది.

నాకైతే ఆ రోజుల్లో మా నాన్నగారు ఇచ్చిన ప్రోత్సాహం తెలుగుభాషపైన నాకు కొంచెం పట్టు సంపాదించుకుందుకూ, మాతృభాషపైన అభిమానం పెరిగేందుకూ బాగా తోడ్పడింది.

అన్నట్లు నేను పద్యాలను వ్రాయటం మొదలు పెట్టిన కొత్తలో మా నాన్నగారు బాగా ప్రోత్సహించటానికి గాను ఆయన స్వయంగా నాతో పాటు పద్యాలను అల్లుతూ ఉండేవారు. 

6 కామెంట్‌లు:

  1. అప్పటికింకా చిన్నపిల్లలు కాబట్టి పద్యధారణాకిశోరం అనుండచ్చు :). పెద్దవాళ్ళయ్యాక ఇప్పుడు ఎలాగూ మీ పిన్ని గారు, మీరూ తెలుగులో కంఠీరవులు అయ్యారుగా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విన్నకోటవారూ కనీసం ఆ బిరుదైనా ఇచ్చారా అబ్బే, లేదే. కాని ఏమాటకామాట చెప్పుకోవాలి. ఎప్పుడు బహుమతులన్నా అవి మంచిపుస్తకాలే. అదే మంచిదయ్యుంది కదా!

      ఒక్కసారంటే ఒక్కసారి నాకు మూడవబహుమతి ఇచ్చారు - అప్పుడు జైమినీభారతం (వచనం) పుస్తకం ఇచ్చారు వార్షికోత్సవ సభావేదికమీద. కార్యక్రమంలో మిగతా వ్యవహారం చూడలేదు నేను. ఆపుస్తకం చదువుతూ కూర్చున్నాను!

      తొలగించండి
    2. ఒక్కమాట చెప్పాలి. ఉహుఁ. మీరే చదవండి వివరంగా మా పిన్నికోసం శ్రీకృష్ణా యదుభూషణా టపాను.

      తొలగించండి
  2. బ్లాగుల్లో శ్యామలరావు మాస్టరొస్తున్నారని భయపడతారండీ! నేనూ మీ శిష్యుడనే!! చాలా విషయాలు నేర్చున్నా, తెనుగు గురించి, రాయడంలో, వ్యవహారికమే ఐనా!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వ్యావహారికంలో‌ వ్రాయటం కూడా మహాకష్టమేనండీ. అందరికీ అందమైన వచనం‌ సులభంగా పట్టుబడుతుందా? అదీ గొప్ప విద్యయేను. గోపీచందుగారి పండితపరమేశ్వరశాస్త్రి వీలునామా చదివితే ఈ‌ సంగతి మనకి బాగా అవగాహన అవుతుంది.

      తొలగించండి
  3. ధన్యవాదాలు శ్యామలరావు గారూ. మీరిచ్చిన లింకులోని టపా ఇప్పుడే చదివాను. చాలా ఆర్ద్రతతో వ్రాశారు. మీరు బ్లాగులో చెబుతున్న దాన్ని బట్టి అంచనా వేస్తే మీ పినతల్లిగారు చాలా చిన్న వయసులోనే గతించినట్లు తోస్తోంది. అంతటి పండితురాలు అంత పిన్నవయసులో పోవడం చాలా విచారకరం. అందులోనూ మీకు చిన్నప్పట్నుంచీ చాలా ఆప్తురాలు కాబట్టి మీకు మరింత బాధగా ఉంటుంది. పైగా మీరిద్దరూ పోటాపోటీగా పద్యాలు భట్టీయం వేసినవారు కూడానూ. మీ టపా మీ పిన్ని గారికి తగిన నివాళి.
    అవునండీ ఆ రోజుల్లో స్కూల్ వారు పుస్తకాలే బహుమతులుగా ఇచ్చేవారు. ఎంతో ఉపయోగపడేవి. నాకు కూడా అటువంటి బహుమతులు వచ్చాయి స్కూల్లో.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.