కొన్ని కొన్ని సంఘటనలు మనస్సుకు సంతోషాన్ని కలిగిస్తాయి.
కొన్ని కొన్ని సంఘటనలు మనస్సుకు విచారాన్ని కలిగిస్తాయి.
కొన్ని కొన్ని సంఘటనలు మనస్సుకు ఉదాసీనతను కలిగిస్తాయి.
కొన్ని కొన్ని సంఘటనలు మనస్సుకు సంతోషవిచారాలను కలగలుపుగా కలిగిస్తాయి.
ఏ విధంగా చూసినా శ్రీశర్మగారు అగ్రిగేటర్లనుండి తప్పుకోవటం అన్నది తెలుగుబ్లాగులోకానికి తీరని నష్టం. నాకైతే వారి ఈ నిర్ణయం వారికొరకు మంచిది, అవివేకంలో కూరుకొనిపోతున్న తెలుగుబ్లాగులోకానికి చెడ్దది అనిపిస్తున్నది.
ఐతే ఈనష్టం కలగటానికి కారణం ఈతెలుగుబ్లాగులోకం తాలూకు పోకడలే కారణం అంటే అందులో అతిశయోక్తి అణుమాత్రమూ లేదు.
ఒకప్పుడు శ్రీశర్మగారి కష్టేఫలీ బ్లాగు రెండువిధాలుగా అత్యున్నతమైన స్థానంలో ఉండేది. మొదటికారణం, అనేకబ్లాగుల కన్నా హెచ్చు గౌరవాదరాలతో హుందాగా సాగుతూ ఉండటం. సామాజికజీవితంలో అందరికీ ఎంతో ఉపయుక్తమైన విషయాలను ఎవరికీ నొవ్వు కలగని రీతిలో వారు అందమైన నుడికారంతో కూడిన భాషలో అమృతభాండం వంటి తమ బ్లాగులో నిత్యసంతర్పణం చేస్తూ ఉండటం వలన ఆ ఆదరాభిమానాలు. రెండవకారణం, వారి బ్లాగు విలువను గుర్తించిన తెలుగుబ్లాగులోకం వారికి సముచితమైన గౌరవాదరాలను వినయపూర్వకంగా ఇస్తూ ఎంతో మర్యాదాపూర్వకంగా వ్యవహరిస్తూ అవసరమైన సమాచారాన్ని వారిని అడిగి తెలుసుకొని సంతోషిస్తూ ఉండటం.
కాని రానురానూ ఈ తెలుగుబ్లాగులోకానికి కొందరు తెగులు పట్టించారు. అమర్యాదాపూర్వకమైన వ్రాతలతో పెద్దవారి మనస్సును నొప్పించటమే పనిగా కొందరు చెలరేగుతూ ఉన్న బ్లాగులోకాన్ని విసర్జించక తప్పని పరిస్థితిని శ్రీశర్మగారికి కల్పించారు.
స్వయంకృతాపరాధంతో తెలుగుబ్లాగులోకం ఈదుస్థితిని తెచ్చుకున్నందుకు జాలిపడటం మినహా చేయగలిగింది ఏమీ కనిపించటం లేదు.
ఆయన పట్లు అవఙ్ఞను ప్రదర్శించటం చూస్తూ ఊరుకున్నందుకు అనండి, ఊరకుండటం తప్ప మరేమీ పూనుకొని చేయలేక పోయినందుకు అనండి అపరాథఫలితాన్ని ఈ బ్లాగులోకం అనుభవించక తప్పదు.
కొందరు తెలుగు బ్లాగర్లైతే ఇంకా నిస్సిగ్గుగా వారిని కించపరుస్తూ వినోదిస్తూనే ఉన్నారంటే అది అఙ్ఞానం అనుకోవాలా, అహంకారం అనుకోవాలా?
కొద్ది సంవత్సరాల క్రిందటశ్రీశర్మగారి బ్లాగు టపాలను నిర్లజ్జగా కొందరు దొంగతనం చేసారు. ఆ దొంగతనాన్ని వారు బయటపెట్టిన తరువాత నేను గమనించగా మరింత చౌర్యవిన్యాసం కనిపించింది. నిలదీసాను. ఈ సంఘటన మే, 2014సం. లో జరిగింది. ఆ చోరశిఖామణి ఇచ్చిన జవాబు 'just i m sharing good information to my friend about our tradition . if u r giving permission then only i keep this page in my blog now i m removing' అని. ఏమన్నా బాగుందా? శ్రీశర్మగారి అనుమతి తీసుకోవద్దా? అందుకే ఆ సమాధానాన్ని తిరస్కరించి 'I'm sorry to say that your curt reply is hardly satisfactory. Suggest you to apologize to sri Sarma ASAP. Then you can seek his permission. You better immediately delete all posts you copied from other sources without permission. And please don't do such things again ever.' అని మరికొంచెం ఘాటుగా చెప్పాను. మరింత వివరంగా నిరసన తెలుపుతూ అదే రోజున మరొక లేఖ కూడా పంపాను. ఏమీ జవాబు లేదు
పనిలోపనిగా ఆవిడగారు మరొకరి బ్లాగునూ తస్కరిస్తూ ఉండటమూ గమనించి, ఆ బ్లాగరుకు కూడా సమాచారం ఇచ్చాను. వారి ధన్యవాదాలనూ అందుకున్నాను.
తదుపరి కాలంలో ఆ దొరికిన దొంగ చేసినపని ఏమిటీ? తన Facebook పేజీలో 'శర్మగారికి పిచ్చెక్కింది' అంటూ ప్రేలాపనలకు దిగింది!
అలా దొంగతనంగా శర్మగారి టపాలను మరింకెందరు దోపిడీ చేసారో అని తప్పక అనుకోవాలి. కాని వారందరూ తెలుగుబ్లాగులోకం సభ్యులే. మొత్తం బ్లాగులోకం అంతా సరిగా స్పందించి ఉంటే చోరుల ఆట కట్టేదని అనుకుంటాను. అలా జరగలేదు. అందుచేత అపరాథభావాన్ని అందరమూ మోయవలసి ఉంది.
పరిస్థితులు దిగజారుడుగా ఉండటాన్ని సహించలేక బ్లాగులోకంలో నుండి నిష్క్రమించాలనీ శ్రీశర్మగారు ప్రయత్నించారు. అగ్రిగేటర్లకు నా బ్లాగుల్ని మీ లిష్టుల్లోంచి తొలగించండి అని విఙ్ఞప్తి చేసారు. కొన్ని అగ్రిగేటర్లు ఆ విఙ్ఞప్తిని పెడచెవిని పెట్టాయంటే అది ఆయన పట్ల అమర్యాదగా ప్రవర్తించటమే.
ఆవుచేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు ఘనతవహించిన అగ్రిగేటర్లే అలా అమర్యాద చేసినప్పుడు, మన తెలుగుబ్లాగులోకపు వీరులు తక్కువగా అమర్యాద చూపుతారా? కొందరు చెలరేగిపోయారు.
ఒకప్పుడు శ్రీశర్మగారి బ్లాగుకు అఙ్ఞాతల బెడద తక్కువగా ఉండేది. కాని దిగజారుతున్న పరిస్థితులకు దారి తీసిన కాలంతో పాటు ఆ ముచ్చటా తీరుతున్నది.
బ్లాగుటపాలకు వ్యాఖ్యలు పాటించవలసిన కనీసమర్యాదలు కొన్ని ఉన్నాయి. అవి అందరకూ తెలుసు. కాని కొందరు తెలియనట్లు నటిస్తున్నారు. కొందరు తమదే మర్యాదామార్గం అని డబాయించటానికీ ఇక్కడ సిధ్ధంగా ఉన్నారు. అందుకని సమగ్రతకోసం అవేమిటో టూకీగా చెప్పుకుందాం.
- వ్యాఖ్య టపా విషయానికి సంబంధించి ఉండటం.
- వ్యాఖ్యలో భాష విషయంలోనూ, భావం విషయంలోనూ, భావప్రకటనలోనూ, నిడివిలోనూ ఎంతమాత్రమూ ఔచిత్యానికి భంగం కలిగించకుండా ఉండటం.
- ఇతరబ్లాగర్లతో వివాదాలకు తమ వ్యాఖ్యలను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆయుధాలుగా వాడుకోకుండా ఉండటం.
ఇలాంటివన్నీ ఒకరిచేత చెప్పించుకోవలసినంత దుర్గతిలో తెలుగుబ్లాగువీరులు ఉన్నారని నేను అనుకోవటంలేదు. అందరికీ అన్నీ తెలుసును. కాని ఎవ్వరూ సముదాచారాన్ని గౌరవింవటం లేదు ఈ తెలుగుబ్లాగుల్లో అన్న చెడ్డపేరు తెలుగుబ్లాగులోకానికి వచ్చేసిందంటే దానికి కారణం ఈబ్లాగులోకంలో అమర్యాద అన్నది ఎంతగా ప్రబలిపోయిందో అర్థం చేసుకోవచ్చును సులభంగా.
అందరూ ఈ దుస్థితికి కారణం అని అరోపించేంత అవివేకిని కాదు. ఎందరో చక్కగా హుందాతనాన్ని పాటిస్తున్నారు. వారెవరో పేరుపేరునా చెప్పలేం - ఎందుకంటే వారి సంఖ్య ఇంకా చాలా హెచ్చుగానే ఉంది కాబట్టి.
కాని ఈ సంఖ్య వేగంగా పడిపోతోంది అన్నది మనం మర్చిపోకూడదు.
మనస్తాపం చెంది ఎందరు మంచిబ్లాగర్లు తప్పుకుంటే అంతగా ఇక్కడ కాలుష్యసాంద్రత పెరుగుతుందని అర్థం చేసుకోవలసిన తరుణం ఇది.
కెమిష్ట్రీలాబ్‌లో ప్రయోగాలు చేస్తున్నప్పుడు మాకు తరచుగా డిమాన్‌స్ట్రేటర్లు ఒక హెచ్చరిక చేస్తూ ఉండేవారు. ఫలితాల్లో 2శాతం కన్నా ఎకువ తేడా వస్తే అది క్షంతవ్యం కాదు పరీక్ష పోతుందీ అని. మనందరికీ కూడా తెలుసు ఒక గిన్నెడు పాలు విరిగిపోవాలంటే ఏమాత్రం విరోధపదార్థం అవసరం అవుతుందీ అని. ఒక్క చుక్క విషం కలిసినా పాయసం పనికిరాదూ అని తెలుసును. ఇవన్నీ మనకు తెలుసును కదా. అందుచేత ఎంతశాతం మంది బాధ్యతారాహిత్యంతో బ్లాగులోకాన్ని భ్రష్టుపట్టిస్తున్నారూ లాంటి ప్రశ్నలను దయచేసి లేవనెత్తకండి.
కొందరు అనవచ్చును. వ్యాఖ్యలను నియంత్రించ వచ్చును కదా అని. నిజమే. కాని పదేపదే అవి వస్తూంటే పెద్దమొత్తంలో, అవన్నీ జల్లెడ పడుతూ కూర్చునేందుకు ఓపిక ఉండాలి కదా? అంత ఆసక్తి ఉండాలి కదా?
ఆలోచనాతరంగాలు బ్లాగులో అసలు వ్యాఖ్యలకే చోటులేదు. ఆయనెంత విసిగి పోయారో మరి అలా నిక్కచ్చి చేసారంటే. ఇలాంటి బ్లాగులు మరికొన్ని కూడా ఉండవచ్చును.
కాని ఎలా ఎంత నియంత్రించినా అదేదో స్వీయనియంత్రణ అంటారే అది లేని బ్లాగులోకంలో ఏమీ సత్ఫలితాలు రావు. వెఱ్ఱిమొఱ్ఱి వ్యాఖ్యలకు ఒకరు చోటివ్వకపోతేనేం, మరొకరు ఇస్తారు. ఒకరైతే ఎవరికి తోచిన వ్యాఖ్యలను వ్రాసుకోండని ఒకరు ఒక టపా పేజీనే కేటాయించారు! కొంతమందైతే ఒకచోట తమ వ్యాఖ్యకు స్థానం దొరక్కపోతే కోపించి వీలైనన్ని బ్లాగుల్లో ఆగ్రహావేశాలతో అనుచితమైన వ్యాఖ్యలు పుంఖానుపుంఖాలుగా వ్రాస్తున్నారు
అనునిత్యం అనేక టపాలక్రింద టపావిషయాలకు ఆమడదూరంలో వ్యాఖ్యాతలు యుధ్ధాలు చేసుకుంటూ పోతున్నారు. చూస్తూనే ఉన్నాం.
తోచక కొన్నీ తప్పక కొన్నీ బ్లాగుయుధ్ధాలు నిత్యం జరగటం చూస్తూనే ఉన్నాం.
ఈ యుధ్ధాలని చూసి వినోదించే వారూ, ఆ యుధ్ధాలకు ఆయుధాలూ మైదానాలూ సమకూర్చేవారూ కూడా బయలుదేరారు. కొన్నిసార్లు తగినంత యుధ్ధవాతావరణం ఏర్పడకపోతే సముచితమైన దోహదక్రియలకు దిగే మహానుభావుల్నీ నిరాశగా మనం గమనిస్తున్నాం కాని ఏమీ చేయలేకపోతున్నాం.
సముదాచారానికి విలువ లేకుండా పోతూ ఉండటం కాదు, అసలు సముదాచారం ఎందుకు పాటించాలీ అనే బాపతు ప్రజానీకమూ ఇక్కడ కనిపిస్తున్నారు.
కొందరు బ్లాగర్లైతే మా బ్లాగులో ఎవరేమి వ్యాఖ్యలు వ్రాసినా మాకు అభ్యంతరం లేదు, అమర్యాదాపూర్వకంగా ఉన్నాసరే అవిమాకు అమూల్యమే అనేస్తున్నారు. వారి వారి ప్రయోజనాలు వారికి ఉండవచ్చును. కాని ఈబ్లాగులోకం విస్తృతప్రయోజనాన్ని కూడా కాస్త బ్లాగర్లంతా దృష్టిలో ఉంచుకోవటం వారి బాధ్యత కాదా? దానినుండి తప్పించుకుంటా మంటే చివరికి ఇలాంటి పరిస్థితి రాక తప్పదు.
ఒక ప్రముఖబ్లాగరు శర్మగారిని కర్మగారు అంటూ ఎద్దేవా చేస్తారు! పెద్దవారికి ఇదా మన బ్లాగులోకం ఇచ్చే మర్యాద? ఎంతమంది ఇలాంటి మాటలను ఖండించగలిగిందీ ఒక్కసారి ఆలోచించుకోండి. చివరికి ఇలాంటి మాటలనూ ఇలాంటి అవినయాన్నీ వినోదించగల స్థితిలో ఉండటం ఈ తెలుగుబ్లాగులోకానికి ఎటువంటి గౌరవాన్ని ఆపాదిస్తుందన్నది కొంచెం ఆలోచించండి.
ఈ రోజున వచ్చిన ఒక అక్షరాలా పొగరుబోతు అనామకులవారి వ్యాఖ్యను చూడండి. శర్మగారు తన (బ్లాగ్)ఇల్లు మూసేసుకుని ఇతరుల (బ్లాగ్)ఇల్లిళ్ళూ తిరుగుతున్నారన్నమాట! అని. ఇలాంటి మేళం వలనకాదూ ఈ రోజున తెలుగుబ్లాగులోకం శర్మగారిని దూరం చేసుకుంటున్నదీ? ఈమాట వీళ్ళని అడిగి లాభం ఉంటుందా? ఈ శర్మ గారు లేకపోతేనేం అంటారు. వాళ్ళకేమీ నష్టం ఉండకపోవచ్చు. తెలుగుబ్లాగులంటే ఈ దురుసుదనపు కాలక్షేపరాయుళ్ళేనా అన్నది ఆలోచించుకోవాలి.
మరొక్క ప్రముఖ బ్లాగరు ఎవరండీ శర్మగారు......? అంటారు. ఏమీ? వారి వ్యాఖ్య చూపిస్తున్నదిగా శర్మగారి ప్రొఫైల్ లింక్? అక్కడికి పోతే వారెవరో తెలియదా? ఇతరుల టెక్నిక్కులను పట్టి ప్రదర్శించే మన మేధావులకు అదేమన్నా బ్రహ్మవిద్యా? ఇలాంటి అవినయపరుల వలన కాదా ఈ రోజున తెలుగుబ్లాగులోకం శర్మగారిని దూరం చేసుకుంటున్నదీ? పైగా ఆ బ్లాగరు శ్రీశర్మ గారి బ్లాగులో పరంపరగా వ్యాఖ్యలను వ్రాస్తూనే ఉండేవారే కాని వారినీ వారి బ్లాగునూ అస్సలు ఎరుగని వారు కానేకాదే! మరెందుకు నటన? ఎందుకలా వారిని ఎద్దేవా చేయటం?
ఈ తెలుగుబ్లాగులోకం పోకడలనూ, ఈ పోగడలను పట్టించుకోని అగ్రిగేటర్లనూ పక్కన పెట్టి తన వ్రాతలేవో తను వ్రాసుకోవాలని శ్రీశర్మగారు అనుకుంటే అందులో అక్షేపణీయం ఏమీ లేదు. గట్టిగా పట్టించుకుందుకు మాకు పెసులుబాటు లేదూ మేము ఉచితంగా సేవలందిస్తుంటే మాటలంటారా అని అనవచ్చును అగ్రిగేటర్ల వాళ్ళు. కాని వారు కూడా తగుమాత్రం బాధ్యత వహించకుండా ఆ సాకు వెనకాల దాక్కోలేరు.
ఇప్పుడు శ్రీశర్మగారి వ్రాతలను అభిమానంతో చదివేవారికి ఙ్ఞానతృష్ణ కలవారికీ మాత్రం వారి బ్లాగు కనిపిస్తుంది. అదీ వారి ఆహ్వానం మేరకే అనుకుంటాను. శర్మగారికి ఉన్న సౌకర్యం - అనుచితంగా మెలిగే వారిని పాఠకుల్లోనుండి పంపించి వేయటం. యోగ్యులకు అలాంటి దుర్గతి రాదు కాబట్టి, శర్మగారికీ ఆ చదువరులకూ కూడా మనశ్శాంతి. నిజాయితీకల పాఠకులకు అమృతవితరణమూ ఇకమీద నిరాటంకం.
శ్రీశర్మగారి ప్రయత్నం విజయవంతం కావాలని ఆశిస్తున్నాను.
(పనిలో పనిగా, తెలుగుబ్లాగులోకం కాస్త కళ్ళుతెరవాలనీ ఆశిస్తున్నాను.)
[నేను ఇలా వ్రాయటమే గొప్ప దురుసుతనం అనీ నాబోటి వారివల్లనే ఈ తెలుగుబ్లాగులోకం చెడిపోతోందనీ అనేవాళ్ళు కూడా ఉండవచ్చును. అటువంటి వారికొక నమస్కార శతం. వారితో వివాదానికి దిగనని సవినయంగా అందరికీ మనవి చేస్తున్నాను.]
తనకు తెలిసిన అనేక విషయాలను , జీవితం నేర్పిన పాఠాలను శర్మగారు తన బ్లాగు ద్వారా పంచి ఎంతోమందిని ఉన్నతంగా, వివేకులిగా తీర్చిదిద్దారు. ఆయన తన బ్లాగును కొంతమందికే తెరవడం బాధగా ఉన్నా .. ఆ కొంతమందిలో నేనూ ఉన్నందుకు ఆనందపడుతున్నాను.
రిప్లయితొలగించండిఈ పరిణామం విచారకరం. సమయోచితమైన టపా వ్రాశారు శ్యామలరావు గారు. దీంట్లోని ప్రతి మాటా సత్యం.
రిప్లయితొలగించండిచాలా బాగా చెప్పారు శ్యామలీయం గారు. మంచి బ్లాగ్ ను మిస్ అవుతున్నామన్నది సత్యం.
రిప్లయితొలగించండిశుభోదయం .శ్రీ శర్మ గారి బ్లాగు మూసివేత గుండే కోతతో సమానం . కాని వారికది తప్పలేదు.
రిప్లయితొలగించండిచౌర్యం శౌర్యంగా భావిస్తున్న వారి చేష్టలు అసమంజసము . ఎదుటివారి ఆవరణలో ప్రవేశించాలనుకున్నప్పుడు , వారి అనుమతి కోరటం అనాదిగా , తర తరాలుగా , యుగ యుగాలుగా వస్తున్న సత్సాంప్రదాయం . ఆ చౌర్య బ్లాగర్లు తెలుసుకొని మసలుకుంటే ఈ నాడు శ్రీ శర్మ గారికి తన బ్లాగు మూసివేయవలసిన పరిస్థితి కాదు దుస్థితి వచ్చి వుండేది కాదు .
ఎవ్వరిని దూషించాలని గాని , ఎత్తి చూపించాలని గాని ఈ సందేశముద్దేశం కాదని అర్ధం చేసుకొనవలసినదిగా నా సద్విన్నపం .
రమణ గారు కూడా బ్లాగు ప్రయివేటు చేశారు. ఈ రెండు సంఘటనలు చాలా దురదృష్టకరం.
రిప్లయితొలగించండివేరే వారి రచనలను వారి అనుమతి తీసుకుని & రచయిత పేరు స్పష్టంగా చెప్పడం కనీస మర్యాద. అలా చేయకపోవడం దారుణం.
I think sharma garu took the things a tad too seriously. The foolish comments have to be laughed off. If they are really objectionable, delete them. I, for one, feel that the anonymous comments should be allowed. In a blog one can not expect all politically correct comments.
రిప్లయితొలగించండిBy making the blog inaccessible to all, the good content loses the reach of many people.
If someone copies and shares the content written by sharma garu, it is ok. Are we not sharing so many articles in whatsapp. Are we taking permssion for that? The blog is written for sharing only.
Anyways, it is his prerogative. We like the blog posts of experienced bloggers like sarma garu syamaleeyam, bhandaru srinivasa rao sir.
GKK గారూ, మీరు వీలైనంతవరకూ వ్యాఖ్యలను తెలుగులో వ్రాయవలసిందిగా మనవి.
రిప్లయితొలగించండినేను టపాలో చెప్పినట్లుగా బ్లాగర్లు, వ్యాఖ్యాతలూ అందరు మర్యాదాపూర్వకంగా మెలగటం అవసరం. అసమంజసం ఐన వ్యాఖ్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించకూడదు. దాని వలన బ్లాగు గౌరవం పలుచన అవుతుంది. ఆ విషయాన్ని నిర్లక్ష్యం చేసి ఎలాపడితే అలా వ్రాసిన చెత్తచెదారాన్నీ అనుమతించే బ్లాగుల సంఖ్య హెచ్చు ఐన కొద్దీ బ్లాగుప్రపంచ గౌరవం కూడా పలుచన అవుతుంది. మీరన్నట్లు అందరూ మంచి వ్యాఖ్యలను చేస్తారని అశించలేం. కాని మంచిగా లేని వ్యాఖ్యలను నిర్దాక్షిణ్యంగా తొలగించగలం - అలా చేస్తూ ఉండకపోవటం మనలో చాలామంది చేస్తున్న పొరపాటు.
అందరికీ అందుబాటులో ఉంచాలనే శర్మగారైనా మరొకరైనా హృదయపూర్వకంగా భావిస్తారు. కాని ప్రత్యక్షరం పైనా ప్రతిక్షణం వికవికలను సహిస్తూ ఉండటం కన్నా అడిగిన యోగ్యులకే చూపటం మంచిదని నిర్ణయించుకోక తప్పని స్థితికి వస్తున్నారు చాలామంది కొంచెం సున్నితమనస్కులైన బ్లాగర్లు.
మీరు WhatsApp తో బ్లాగులను పోల్చటం సరిగా అనిపించటం లేదు. ఆ రెండింటి పరిధులు వేరువేరు. WhatsApp అనేది తమ అనుభవాలనూ సాహిత్యాది వ్యాసంగాలనూ రికార్డు చేసుకొనే వేదికగా ఎవరూ భావిస్తారనుకోను. ఆ పనికి బ్లాగులు బాగా నప్పుతాయి. బ్లాగు టపాను పదిమంది చదవటం కోసం వ్రాసిన ఒక రచనగా భావించాలి కాబట్టి దాన్ని రచయితకు చెప్పిన పిదపనే తీసుకొనటం మర్యాద. ఒక రచనను WhatsApp లో circulate చేసే ఒక జోక్ స్థాయికి తెచ్చి పోల్చటం సరైనదిగా అనిపించటం లేదు నాకు.
ఒక్కొక్క బ్లాగు ఒక్కొక్క వేదిక. ఒకటి సాహిత్యవేదిక ఐతే మరొకటి సమకాలీన చారిత్రక వేదిక కావచ్చును. వాటివాటి హుందాతనాలను అందరూ సగౌరవంగా గుర్తించి కాపాడటం అవసరం. లేని పక్షంలో బ్లాగుప్రపంచం అస్తవ్యస్తంగా ఉంటుంది. కొందరు బ్లాగర్లు తమ బ్లాగులను సరైన వేదికలుగా నిర్వహించుకోకపోతే అది వారి పొరపాటో గ్రహపాటో అభీష్టమో కాని అన్ని బ్లాగులూ గాలిలో ఎగిరే చిత్తుకాగితాలస్థాయిలో ఉండాలని వారు ఆశించటం పొరపాటు.
వ్యాఖ్య యొక్క ఉద్దేశం టపాయొక్క విషయంపైన నిజాయితీ కల, సభ్యతాయుతమైన అభిప్రాయప్రకటన. ఒకరు తమ అభిప్రాయం చెప్పేటప్పుడు తమ పరిచయం చెప్పుకోవటం అభిలషణీయం. అతి అరుదుగా మాత్రమే పేరును చెప్పుకోకుండా అభిప్రాయం పంపటం ఆమోదయోగ్యం. వెక్కిరింతలూ యుధ్ధోన్మాదాలూ, దూషణలూ, అసభ్యప్రవర్తనా వంటివి టపాల్లోనైనా వ్యాఖ్యల్లోనైనా కనబడటం ఎంతమాత్రమూ సమంజసం కాదు.
ఒక పరిస్థితిని ఊహించండి. కొత్తగా ఒక వ్యక్తి బ్లాగుప్రపంచంలో అడుగుపెట్టి కొన్ని టపాలూ వ్యాఖ్యలూ చదివాడనుకోండి. ఆ వ్యక్తికి విరక్తీ అసహ్యమూ కలిగే స్థితిలో టపాలైనా వ్యాఖ్యలైన ఉండకపోతేనే కదా బ్లాగుప్రపంచం పైన ఆవ్యక్తికి గౌరవం కలిగి మళ్ళా మరొకసారి అడుగుపెట్టేదీ మరొకరికి బ్లాగులను చదవమని చెప్పగలగేదీనూ. ఆలోచించంది దయచేసి.
ముఖ్యంగా ఎవరైనా మీతో 'ఏమిటీ నువ్వు ఒక తెలుగుబ్లాగు రాస్తున్నావా' అనో 'చీ తెలుగుబ్లాగులు చదువుతున్నావా?' అనో అవమానకరంగా మాట్లాడితే తలదించుకోవలసి రావటం అవమానం కదా! ప్రస్తుతం పరిస్థితి అలాగు తయారవుతోందనే మా బాధ.