25, జులై 2013, గురువారం

వేదండము నెక్కి మైధిలితో గూడి

వేదండము నెక్కి మైథిలితో గూడి 
  కోదండపండితు డూరేగె
వేదవేద్యుని కీర్తి వేదపండితులెల్ల 
  వేనోళ్ళ పొగడగ నూరేగె

వారిజాక్షిసీత వామాంకమున నొప్ప
    వైభవమొప్పగ నూరేగె 
చేరి మిద్దెలమీద పేరంటాండ్రందరు
   సేసలు జల్లగ నూరేగె
హారతు లెత్తుచు నన్ని ముంగిళుల
   నతివలు పాడగ నూరేగె
కారుణ్యమూర్తుల గనవచ్చు జనులతో
    గడబిడ చెలరేగ నూరేగె  ॥వేదండము నెక్కి॥

పరమశివునివిల్లు పట్టివిరిచిన జోదు
     వరుసగ పురవీధు లూరేగె
సురవైరి మదమెల్ల చూర్ణంబు జేసిన
     శుభ్రయశోరాశి యూరేగె 
సురనాథుడాదిగ సురలంబరము నిండి
     చూడగ చక్కగ నూరేగె
తెరపిలేక నన్ని దిక్కుల జయఘోష
     పరగంగ భగవాను డూరేగె  ॥వేదండము నెక్కి॥

అతివ సీతకు యూరి యందంబు లెఱిగించి
      యానందమును గూర్చ నూరేగె
అతులిత సంపద లందించు తన చూడ్కి
      నందర కందించ నూరేగె
పతితపావను డెల్ల వారికి దర్శన
     భాగ్యంబు కలిగించ నూరేగె
అతనుకోటి  సుందరాకారు డీవేళ
     హాయిగ మనమధ్య నూరేగె ॥వేదండము నెక్కి॥

(జూలై 2013)