25, జులై 2013, గురువారం

రావణుడు యుద్ధంలో మరణించ లేదని కూడా పరిశోధించేసి కనుక్కునారట !!!

ఇప్పుడే  రావణుడు యుధ్ధంలో‌ మరణించలేదా?   అన్న టపా చూసాను.  ఈ‌ టపా  జై జై నాయకా   బ్లాగులో ఈ‌ రోజు (జూలై 25, 2013న) ప్రకటించబడింది.  వారు ఈ‌ టపాను వివాదాస్పదం అని వర్గీకరణం చేయటం ముదావహం.  నా వ్యాఖ్య అందుచేత టపాలోని విషయానికే వర్తిస్తుంది కాని బ్లాగరు గారికి నేనేమీ అభిప్రాయాలూ ఎజెండాలూ అంటగట్టటం లేదని ముందుగానే చదువరు లందరికీ తెలియ జేస్తున్నాను.

ఈ విషయంలో నా వ్యాఖ్య మరీ‌ పెద్దదిగా ఉండటం‌ వలన ఒక టపాగా నా శ్యామలీయం‌ బ్లాగులో ప్రకటిస్తున్నాను.

రామాయణగాధ మీద ఈ మాదిరి కథనాలు రావటం ఇదే మొదలు కాదు.  బహుశః ఇదే తుదీ కాదు!

రామాయణకావ్యం వ్రాసిన మొదటి కవి వాల్మీకి.  ఆ తరువాత వచ్చిన రామాయణాలు రెండు రకాలు.  కొన్ని వాల్మీకాన్ని యథాతథంగా తమతమ భాషల్లోనికి అనువదించినవి.  కొన్ని కొన్ని ప్రాంతీయభాషా రామాయణాలు వివిధ స్థాయిల్లో స్వతంత్రించినవి.  కొన్నికొన్ని కల్పనలు మూలరామాయణానికి అంటే యేవిధంగానూ ఔచితీభంగం కానివిధంగా చిన్నాచితకా కల్పనలు జోడించినవి. ఉదాహరణకు భవభూతి మహాకవి ఉత్తరరామాయణం అనే‌ నాటకం. కొత్త కథనాలున్నాయి.  కాని, పాత్రల స్వభావాలూ ఔన్నత్యాలూ చక్కగా మూలానికి అవిరుధ్దంగా జాగ్రత్త వహించారు భవభూతి.  రంగనాథరామాయణం వంటి ప్రాంతీయరామాయణాల్లో బుధ్దారెడ్డి వంటి కవులు జోడించిన కల్పనలు ఆయన ఉద్దేశించక పోయినా అక్కడక్కడా పాత్రౌచితిని దెబ్బతీశాయి.  కొన్ని కొన్ని రామాయణాల్లో, పై రంగనాథరామాయణం తో‌ సహా, కొన్ని కల్పనలకు మూలం‌ జనశ్రుతిలో చేరి ప్రచారం అయిన కథలు కావచ్చును.

జనశ్రుతి యెంతబలమైన దంటే, అలా వ్యాప్తిలోనికి వచ్చిన కొన్ని కథలు, నేటి పండితలోకం ఆమోదాన్ని కూడా ఆనందిస్తున్నాయి.  ఉదాహరణకు, రాముడు అసలు సీతను అగ్నిహోత్రుడి వద్ద దాచి, మాయాసీతను పర్ణశాలలో ఉంచి లేడి వెంట వెళ్ళాడనీ - ఆ మాయాసీతనే రావణుడు అసలు సీత అన్న భ్రమలో అపహరించి , చివరకు యుధ్దంలో‌ రాముడి చేతిలో మరణించాడనీ ఒక కథ.  ప్రసిథ్థ పౌరాణికులు శ్రీ మల్లాదివారు కూడా ఆ కథను నమ్మి చెబుతున్నారు. 

తెలుగులో‌ రావణకాష్టం అన్న ఒక పలుకుబడి ఉంది.  ఇది జనశ్రుతిలోని ఒక రామాయణగాథ ఆథారంగా వచ్చింది.  రావణుడు కూలాక, మందోదరి బ్రహ్మతో మొరపెట్టుకుందట. బ్రహ్మ సరేననటంతో జరిగిన చిత్రం యేమిటంటే రావణుడి చితి మండుతూనే ఉంటుందట యెప్పటికీ!  అందుచేత రావణుడికి అంత్యక్రియలు పూర్తికానేకాక, రావణపత్ని మందోదరి నుదుటి కుంకుమకు ఢోకాలేదట. అలా ఆవిడ వైధవ్యం నుంచి తప్పించుకుందట.


ఎన్నని మనవి చేయమంటారు? ఇలా అనేకం‌ ఉన్నాయి కథలు!  విజ్ఞులు జాగ్రత్తగా గమనించుకోవాలి. తస్మాత్ జాగ్రత!

చాలా రామాయణాలు మటుకు ఆధునికాలూ, అప్రమాణికాలూ, అభూతకల్పనలూ, ప్రాంతీయ, సమకాలీన మతభావనలతో నిండినవీ‌ కావటం వలన ఏ విధమైన పరిశోధనకైనా కేవలం నిష్ప్రయోజనాలు. అలాంటి నిరుపయుక్త రామాయాణాలు పట్టుకుని పరిశోధనలు చేస్తున్నామని దుష్ప్రచారం చేసే వాళ్ళ అవకతవక కథనాలు సామాన్యుల మనస్స్సులను విషపూరితం చేసే కుట్రలూ, అలాంటి పాత కుట్రల కొనసాగింపులూను.

అసలు ఆర్యులూ - ద్రావిడులూ అంటు విభజన చేసే దరిద్రపు సిధ్ధాంతం అవాస్తవమైన కుట్రపూరితమైన విషప్రచారం. ఆర్యులు ఉత్తరఖండం నుంచి వచ్చారనే వాదం‌ ఎప్పుడో చాలా కాలం క్రిదటే చరిత్రకారులు తిరస్కరించారు.  (మీకు దొరికితే చదవండి శ్రీకోట వేంకటాచలంగారు వ్రాసిన "ఆర్యుల ఉత్తరధృవ నివాస ఖండనము" అనే ప్రామాణిక గ్రంథాన్ని.) ఇలాంటి దరిద్రపు ఊహల్ని మన బుర్రల్లోంచి వదిలించుకోవటం మాని అవే మరింత ప్రచారం చేస్తున్నారు ఈ భారతదేశపు అభారతీయ అపరిపక్వ బుద్దుల వాళ్ళు మేధావులమనే ముసుగులో.  అమాయమమైన విద్యార్థుల మనస్సుల్లోకి ఈ‌ విషం చొప్పించటం అనేదే ఆ ప్రచారాల వెనుక
అసలు ఉద్దేశం అన్నమాట  పరమస్పష్టం.

విషపుబాణాలు వాడే సంస్కృతి మనదేశానిది కాదు. దురాక్రమణదారులైన విదేశీయుల యుధ్ధనీతి అది. అంతఃపురకుట్ర వల్ల రావణుడు కూలటం‌ అనేది మొగలాయి రాచకుటుంబాల కుట్రలను రామరావణయుధ్ధానికి ఆపాదించటం‌ కేవల చవకబారు ఆలోచన.  రావణుడు ఎలా కూలాడు అన్నది నిర్థారణగా చెప్పేది మూల గ్రంథమైన వాల్మీకం‌ కాని తదనంతర సవాలక్ష ఇతర రామాయణ సంబంధమైన రచనలు కావు.  


జాగ్రత్తగా అలోచించండి.  రామాయణం చరిత్ర అనుకుంటే మొదటి మరియు ప్రామాణిక చరిత్రకారుడు వాల్మీకి.  కాదూ,  రామాయణం ఒక అందమైన కావ్యం మాత్రమే అనుకుంటే అది వ్రాసిన వాల్మీకి కథనాన్ని కాదనటం అర్థరహితం. ఒక కవి కల్పనను మరొకరు సరిజేయట మేమిటీ?  అర్థరహితం కాదా?

వాల్మీకుల వారి రామాయణంలో రావణుడు లంకానగర శోభా పటిష్టత వంటి వాటి గురించి వివరంగానే ఉంది - చదువుకోండి. ఎవరూ కొత్తగా పరిశోధించ నవసరం లేదు ఈ‌విషయంలో.

విభీషణడు రామపక్షానికి వెళ్లటం కారణంగా రావణుడి వ్యూహాలు రాముడికి తెలిసిపోయాయని కొత్తగా కనిపెట్టారట?  భలే! యెలా తెలుస్తాయీ?  అతను లంక వదలిపోయాడు కదా? అలా వ్యూహాలు బయటకు పొక్కాయనటం అవివేకం కాదా? అది మరొక నోటితో మీరు చెప్పిన రావణుడి పాలనాసామర్థ్యాన్ని మీరే తప్పుబట్టటం‌కాదా చెప్పండీ?


రావణాసురుడితో పోలిస్తే., రాముడి వానరసైన్యం ఏ మాత్రం సరితూగలేని యెలా చెప్పగలరు?  వాల్మీకి రామాయణంలో ఉభయపక్షాల సైన్య బలాబలాల వివరాలు పరిశీలించండి. ఈ‌ రోజుల్లో సగటు విద్యావంతులు ఎవరూ‌ వాల్మీకి రామాయణం చదివే పరిస్థితి ఉండదు సాధారణంగా .. కాబట్టి, అది అవకాశంగా తీసుకుని,  ఎలాంటి కథలైనా అల్లి, మేం గొప్ప పరిశోధన చేసాం అంటే చెల్లుతుందని భావించటం కేవలం టక్కరితనం,  నైచ్యం.

ఏవేవో‌ తమాషాలు చెప్పి మా చారిత్రకపరిశోధనలు వాటిని రుజువు చేసే పనిలో ఉన్నాయనటం హాస్యస్పదం.  అంటే, అసలు రుజువులు లేనట్లేగా ప్రస్తుతం?  నిజానికి, ఋజువులు దొరికాక కదా ఘనతవహించిన ఈ చారిత్రక పరిశోధకులు మాట్లాడాలీ? జనాన్ని ఇలా మోసం చేయటానికి ప్రయత్నించటం సమాజాన్ని తప్పుదారికి ఈడ్వటానికే గాదా?

ప్రముఖ పరిశోధకుడు మిరాండో ఒబెసిక్రి అయినా మరొక ఏబ్రాసికీ అయినా అడ్దమైన వాడు విదేశీయుడు అయితే చాలు వాడు గొప్పవాడూ, గొప్పగొప్ప విషయాలు కనిపెట్టి చెబుతున్నాడూ అనుకోవటం ఇంకా సగటు భారతీయ విద్యావంతులు ఆంగ్లమానసపుత్రులే‌ అన్న వెర్రి నమ్మకాన్ని తెలియజేస్తోంది - ఆ నమ్మకం తప్పు అని నా అభిప్రాయం. అయితే, ఈ కుహనా పరిశోధకులు ఆశిస్తున్నట్లు తగినంత సంఖలో ఈ‌ ఆంగ్లమానసపుత్రులింకా ఇలాంటి ప్రతివాడినీ‌ నెత్తిన బెట్టుకుందుకు సిధ్ధంగానే ఉన్నారన్నది ఒక విషాదకరం అయిన వాస్తవం.


నేటి శ్రీలంకయే రావణలంక అన్న విశ్వాసం ఒకటి ప్రజల్లో ఉంది.  మనదేశంలో ఉంది, అదే విశ్వాసం శ్రీలంకలోనూ‌ బలంగా ఉంది.  అయితే శ్రీలంక మనకు శతయోజనాల దూరంలో లేదు కదా?  శ్రీమద్రామాయణసారోధ్దారము అనే పుస్తకంలో బహుశః ఛాగస్ ద్వీపం రావణ లంక కావచ్చునని ప్రతిపాదించబడింది! గమనించండి.

అనేక దేశాల్లో‌ వారి వారి ప్రాంతీయ రామాయణకథల్లో‌ మూలం అయిన వాల్మీకానికి ఎంత విరుధ్దంగా ఉండేవి అయినా ఉన్నాయి.  ఒకానొక రామాయణంలో (వివరం గుర్తులేదు, మన్నించాలి), రాముడికి సీత సోదరి అట!

ఇందు మూలంగా, విజ్ఞులందరికీ నా విన్నపం యేమిటంటే, ఇలాంటి డాంబిక పరిశోధనల మూలోద్దేశాలను జాగ్రత్తగా గమనించి జాగ్రతవహించ వలసిందని.

స్వస్తి.

10 కామెంట్‌లు:

  1. >> ఒకానొక రామాయణంలో (వివరం గుర్తులేదు, మన్నించాలి), రాముడికి సీత సోదరి అట!

    వీళ్ళతో ఉన్న ప్రోబ్లెం ఏమిటంటే, త్రేతాయుగం లో ఉన్న రాముడు ఆ తర్వాత రాముడి పేరు పెట్టుకున్న రాజులందరూ ఒకటే. బౌద్ధమతంలో ఒక రాముడున్నాడు(ట) ఆయనకి ఒక చెల్లెలు ఉండేదిట, సీత పేరుతో. అది చదవగానే చొక్కా విప్పేసి, నాలుగు బస్కీలు తీసి 'అదరహో' ఇప్పుడు చూస్కోండి, "రాముడెవడయ్యా, సీతనే పేరున్న చెల్లెల్ని అనుభవించి కడుపుతో ఉన్నదాన్ని అడివికి పంపించినోడేనా? అయితే వాడు రాజా? రంకుమొగుడా?" అని మొదలు పెడతారు. పేరు సరిపోయిందిగానీ, ఆ రాముడు వేరు, ఆ యుగం వేరు అనేవి ఇంకేమీ గుర్తుకురావు అప్పుడు. ఎందువల్ల? దానికి సమాధానం మీరే చెప్పారు కదా?

    కం. తోయంబులలో చేపకు
    తోయంబుల కవలి జగము తోచని పగిదిన్
    మాయాంబుధిమగ్నుకున్
    మాయకు మించినది తెలియు మాట గలుగునే

    ఓక విష వృక్షం మొదలు పెట్టగానే దానికి బాజాలు భజంత్రీలు వాయించేవాళ్ళు మనకి తక్కువా? వాళ్ళు రాముడి కాలంలోనూ ఉన్నారు, తర్వాతా ఉన్నారు. ఇప్పుడూ ఉన్నారు, మనం పోయేక కూడా ఉంటూనే ఉంటారు.

    నేను ఆ బ్లాగులో కామెంట్ పెట్టాను. కానీ ఆయనకి/ఆవిడకి కామెంట్ నచ్చాలి కదా అది అప్రూవ్ చేయడానికి. కాకరకాయ పెడితే తినేవాళ్ళు ఎంతమందీ? అయినా నాకేల, కందకి లేని దురద?

    శుభమస్తు నిత్యం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా వ్యాఖ్య యే టపాలోని విషయం మీదనో, ఆ టపా వ్రాసిన బ్లాగరుగారు కేవలం తన ఎరుకలోనికి వచ్చిన విషయం ప్రస్తావించారే గాని ఒక stand తీసుకోలేదు కదా!

      పళ్ళున్న చెట్టు పైనే రాళ్ళు పడటం లోకసహజం. కాబట్టి రామాయణాన్ని అభాసుపాలు చేయాలనే‌ ప్రయత్నాలు సాధారణమే.

      మీ రన్నట్లు తోయంబులలో చేపకు... పద్యం చక్కగా అతికింది ఇక్కడ.

      తొలగించండి
  2. నేను తిన్న వంట రుచి పక్కవాడు చెప్పినంత అసంబద్ధంగా ఉంటుంది ఈ పరిశోధనల అంతరార్థం.. జీవితంలో ఒక్కసారి వాల్మీకి రామాయణం చదవరు కనీసం పుస్తకం మొహం చూడరు.. విషయం తెలియని వీళ్ళందరూ కామెంటేటర్లే.. పరిశోధనా శాస్త్రజ్ఞులే!

    రిప్లయితొలగించండి
  3. ఎవరేం చెప్పినా ఒక జర్నలిస్టుగా KN Murthy ఆయన బ్లాగులో చెప్పాస్తారట నిజాయితీగా! చాలా అభినందనీయం! వివాదాస్పదమైన డావిన్సి కోడ్ లాంటి పుస్తాకలు, తస్లీమ నస్రీన్ పుస్తకాల సారమూ పెట్టలేదెందుకనో?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కోప్పడకండి. సనాతనధర్మానికి సంబంధించిన విషయాలను స్పృశించే వాటినే‌ జైజైనాయకా బ్లాగువారు పరామర్శించి ఉండవచ్చు గదా. వారి స్వాభిప్రాయాన్ని వారు ప్రస్తావించినట్లు అనుకోనక్కర లేదేమో!

      తొలగించండి
  4. సూటిగా ఒక క్రమ పద్దతిలో మీరు విష్లేషించిన పద్దతి చాలా బాగుంది. "రంకు చరిత్రలు" రక్త చరిత్రలు అంటే మోజు పడే వారికి, అసలు రామాయణం లో ఎం ఉందో అనవసరం. వారికి కావాల్సింది రామాయణం రంకు, భారతం బొంకు అనే "బొంకు పరిశోదనా సాహిత్యం" ,అది కూడా విదేసియుడు అయితే ఇక ఒంటి కాలు మీద లేసి దండోరా వెయ్యడమే వారికి తెలిసినది.

    మంచి విశ్లేషణ చేసిన శ్యామలీయం గారికి అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. చెప్పు తినెడి కుక్క చెరకు తీపెరుగునా ... అన్నారు . నిజమే కదా !!

    శ్యామలీయం గారికి అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. swamy think about today problems, who is bothered wheter ravana was dead or alive. LIve in present

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంతోషం. మంచి అభిప్రాయమే. నేను వర్తమానజీవినే. కాని మూలాలు మరిచినవాడిని కాను.
      సమకాలీన సమస్యలకూ సందర్భానుసారంగా స్పందిస్తూనే ఉన్నానని గమనించగలరు.
      పైగా ప్రస్తుత టపా మరొకటపాలోని అభిప్రాయాలపై నా స్పందన మాత్రమే కదా!

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.