17, జులై 2013, బుధవారం

కథ: పెళ్ళిచూపులు

"ఏమిటమ్మా నీ సోది" రవళి చిరాకు పడింది.

రోజూ లాగే ఉదయమే తయారై రవళి ఆఫీసుకు బయలుదేరే ముందు బ్రేక్‌ఫాస్ట్ చేస్తోంది.  ఆమె బ్రేక్‌ఫాస్ట్ అంటే కార్న్‌ఫ్లేక్స్ అండ్ టీ. అంతే.

ఈ లోగా తులసమ్మ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర మరో కుర్చీ‌లో కూర్చుని మొదలు పెట్టింది. "ఈ రోజు హాఫ్‌డే లీవ్ పెట్టి వచ్చేయి.  మధ్యాహ్నం రెండింటికే వాళ్ళు చూపులకు వస్తామన్నారు" అంది కూతురి ముఖంలోకి చూస్తూ. ఆమెకు కూతురితో యేం‌మాట్లాడాలన్నా కొంచెం బెరుకే.

ఈ రోజు మధ్యాహ్నం రెండున్నరకు ప్రాజెక్ట్ రివ్యూ మీటింగ్ ఉంది.  అసలే ప్రకాష్ లీడర్‌షిప్‌లో ఈ‌ ప్రాజెక్ట్ సరిగా నడవటం లేదని తనకి మంటగా ఉంది.  మొన్న క్లైంట్‌ను కన్విన్స్ చేసే సరికి తాతలు దిగొచ్చారు. ఈ రోజు రివ్యూలో కాస్త స్ట్రిక్ట్‌గా ఉండాలి అనుకుంటోందా? వాళ్ళెవరో పళ్ళికిలించుకుంటూ‌ వస్తారట. నాన్సెన్స్ అని రవళికి తిక్కరేగింది.
తల్లితో గొడవకు దిగేదే, కాని యింతలో నాన్నగారొచ్చారు.

మళ్ళీ ఈయన మొదలెడతారు అని విసుక్కుంది మనస్సులో.  కాని నాన్న అంటే భయం కాకపోయినా ఆయన ముందు రవళి యెక్కువగా మాట్లాడదు.  గొడవపడటం లాంటిది ఎప్పుడు అమ్మ తోనే.

వస్తూనే ఆయనకు తల్లీకూతుళ్ళ మూడ్ అర్థమైపోయింది.

"ఈ సంబంధం చూద్దాం‌ అనుకున్నాంగా. నిన్న సాయంత్రం వాళ్ళు ఫోన్ చేసారు. అబ్బాయిని తీసుకుని ఈవేళే వస్తున్నారట. మనం ఆదివారం అనుకున్నాం కాని ఆదివారం అబ్బాయికి వీలవటం లేదట. ఏం చేస్తాం బాగుండదు కదా అని సరే అన్నాను" అన్నారు రాఘవరావు గారు కూతురితో‌ నిదానంగా.

"నాన్నగారూ, ఇవేళ చాలా ముఖ్యం అయిన మీటింగుంది మరి" అంది రవళి తండ్రి ముఖంలోకి చూస్తూ.

"వీలు చేసుకో‌ అమ్మా,  పోనీ ఓ గంట వచ్చి వెళ్ళు మీ‌ అఫీసు దగ్గరేగా ఇక్కడికి" అని సలహా వచ్చింది.

"ఏం చోద్యమండీ.  అమ్మాయిని ముస్తాబు చెయ్యాలా? అలాగే జిడ్డుముఖంతో చూపిస్తారా?" అంది తల్లి కోపంగా.
తండ్రి మాట్లాడకుండా కూతురి ముఖంలోకి చూడసాగాడు.

"అలాగే నాన్నా, ఎలాగో మేనేజ్ చేస్తాను. కాని గంటే. మేకప్ గీకప్ ఏమీ వద్దు. ఎలా ఉన్న దాన్ని అలాగే చూడమనండి. "అన్నట్లు ఆ అబ్బాయి సెల్ నెంబరు తీసుకోమన్నాను కదా ఏంచేసారు డాడీ" అంది  రవళి.

"తీసుకున్నానమ్మా" అంటూ తండ్రి నంబరు ఇచ్చాడు.
"అలా ఫోన్‌లు చేస్తే బాగుండదే" అని తల్లి ప్రాధేయ పడింది. "అయినా ఈ వేళే చూడబోతూ ఫోన్ యెందుకే" అంది ఆశగా

*   *   *

మూడో సారి ట్రై చేయగా ఆదిత్య నంబరు కలిసింది. పరిచయాలయ్యాక రవళికి కలిగిన అభిప్రాయం మర్యాదగానే మాట్లాడుతున్నాడు ఫరవాలేదు అని. 

"రెండు గంటలకు మా యింటికి రావటం సంగతి సరే నండీ. మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీకి మీరు లంచ్‌కి రాగలిగితే మనం పరస్పరం చర్చించుకోవచ్చును. నాకు పెళ్ళిచూపుల పట్ల వ్యతిరేకత యేమీ లేదు కాని మీతో ఫ్రీగా మాట్లాడే అవకాశం ఉండదు. ఏదో పర్మిషన్ ఇచ్చి పదినిముషాలు మాట్లాడుకోండి లాంటివి నాకు గిట్టవు. ఇలా అంటున్నందుకు ఏమీ అనుకోకండి" అని రవళి ఆదిత్యతో‌ నిర్మొగమాటంగా చెప్పింది.

"నాకు ఆ టైమ్‌లో వేరే అప్పాయింట్‌మెంట్ ఉందనుకోండి అయినా మీ కన్నా ముఖ్యం అయింది కాదు, చెప్పండి ఎక్కడ కలుద్దాం.  బైదివే, మీ ఫ్రాంక్‌నెస్ నాకు నచ్చింది" అన్నాడు ఆదిత్య.

లంచ్‌మీట్‌లో రవళి దూకుడికి ఆదిత్య చాలా ఆశ్చర్య పడిపోయాడు. ఇంత చిన్న వయసులోనే ఆమె ఒక పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలో మంచి హోదాలో ఉందని తెలిసి మరో సారి ఆశ్చర్యపోయాడు.

ఆదివారం తన రిటర్న్ జర్నీకి దగ్గర అవటంతో పనుల వత్తిడి వల్ల తీరటం లేదని అందుకే ఈ రోజే చూపులకు రావలసి వస్తోందనీ అతడిచ్చిన సంజాయిషీ విని రవళి ఏమీ వ్యాఖ్యానించలేదు.

ఇద్దరూ ఒకరి అలవాట్లూ అభిరుచులూ ఉద్యోగబాధ్యతలూ వగైరా పరస్పరం విపులంగా చర్చించుకున్నారు.  అంతా బాగుంది అని ఆదిత్య అనుకుటూ ఉండగా రవళి ఒక బాంబు పేల్చింది.

"మీరేమీ అనుకోవద్దు. మీరూ మీ వాళ్ళు మాగురించి వాకబు చేసుకున్నాకే వస్తున్నారని స్పష్టమే.  కాని మీ వాళ్ళేం చెప్పినా మీ గురించి నేనూ వాకబు చేసుకున్నాక గాని ఒక నిర్ణయానికి రావటం కష్టం."

ఆదిత్యకు యేం‌ ఏం చెప్పాలో తోచలేదు.

"నా యెరుకలోనే ఎన్ఆరై సంబంధాలు చేసుకుని దెబ్బతిన్న అమ్మాయిలున్నారు." అందుకని అలా చెప్పవలసి వస్తోంది.

"మీకు ఇంకా వివరాలు యేమన్నా కావాలా? నా వరకైతే ఓకే" అన్నాడు ఆదిత్య.  ఇంత ముందు చూపూ కచ్చితంగా మాట్లాడగలిగే తెగువా ఉన్న అమ్మాయిని వదులుకోవటం అతడికి సుతరామూ ఇష్టం లేదు మరి.

తనకు ఏమేమి వివరాలు కావాలో ఆమె చెప్పినపుడు ఆదిత్య యేమీ ఆశ్చర్య పోలేదు.

*    *    *

సరిగ్గా పెళ్ళిచూపులు పావుగంటలో అనగా రవళి ఇంటికి వచ్చింది. తల్లి కంగారు చూసి చిరాకు పడింది యధావిధిగా.  తల్లి ఏర్పాట్ల హదావుడిలో ఉంది కాబట్టి తండ్రితో ఏకాంతం సులభంగానే చిక్కింది ఆమెకు.  కూతురి మాటలకు తండ్రి ఆశ్చర్య పోలేదు.

అయినా అడిగాడు. "అబ్బాయి ఏమన్నా అనుకున్నాడేమో గమనించావా? " అని

రవళి నవ్వింది సన్నగా.  "అదేం లేదు నాన్నా నేను గమనిస్తూనే ఉన్నాను."

పెళ్ళిచూఫులు జరిగి పెళ్ళివారు వెళ్ళబోయే ముందు అబ్బాయి రవళికి ఒక కవరు ఇచ్చాడు.  "ఏమిటే అది" అంది తులసమ్మ ఆశ్చర్యంగా.

"అబ్బాయి గురించి నేను భోగట్టా చేసుకోవటానికి వివరాలమ్మా" అంది రవళి.
తలసమ్మ బుగ్గలు నొక్కుకుంది.

*    *    *

కొడుకు మధ్యాహ్నం చేసిన నిర్వాకం గురించి సాయంత్రం పుత్రరత్నం నోటి వెంట విని ఆదిత్య తల్లిదండ్రులు నెవ్వెరబోయారు. ఎదిగిన కొడుకు, అమెరికాలో నాలుగేళ్ళుగా ఉంటున్న వాడితో ఈ విషయమై ఏం మాట్లాడాలో వాళ్ళకు అర్థం కాలేదు.

అమ్మానాన్నల దగ్గర ఏ విషయమూ దాచే అలవాటు లేని ఆదిత్య మాత్రం దృఢంగా అన్నాడు.  "ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది. ఆమెకూ‌ నచ్చితే నేను లక్కీ ఫెలోనే"

"నచ్చవలసింది నీకా ఆ అమ్మాయికా?" అంది వర్థనమ్మ ఒళ్ళు మండి.
దామోదరంగారు ఒక నవ్వు నవ్వి ఊరకున్నారు.

*    *    *

దామోదరం గారికి ఆ రాత్రి ఒక పట్టాన నిద్రపట్టలేదు.  కొడుకు చెప్పిన మాటలలో ఎంత నిజం ఉందీ?
తన పెళ్ళిరోజులు గుర్తుకు వచ్చాయి.  తన తండ్రి చండశాసనుడు.

"ఏమిటీ‌ నసుగుతున్నావూ? నాకా మాత్రం తెలియదా మంచి సంబధం అయిందీ‌ కాందీ?  అమ్మాయి లక్షణంగా ఉంటుంది.  మంచి సాంప్రదాయం‌ గల కుటుంబం.  ఇంకేం‌ కావాలోయ్?  నువ్వేడుస్తావని ఫోటో జాతకం తెప్పించాను.  జాతకం లక్షణంగా ఉంది - భేషుగ్గా నప్పుతుంది నీకు. నోర్మూసుకుని చేసుకో బాగుపడతావు" అని హుంకరించాడు.

తనవి ఆధునిక భావాలు. మంచి అమ్మాయిని చూసి ప్రేమించి కానీ‌ పెళ్ళి చేసుకునేది లేదని కాలేజీ రోజుల్లోనుండే ఘట్టిగా తీర్మానించేసుకున్నాడు.  ఉద్యోగం రావటం ఆలస్యం పెళ్ళి సంబంధాలు రావటం మొదలయ్యాయి.  చాలా వరకూ‌ తండ్రి చేసే స్తనశల్యపరీక్షల కారణంగా తనదాకా రాకుండానే సంబంధాలు గుమ్మం నుండే తిరిగిపోయాయి.

ఈ‌లోగా తానూ బాగా ఆలోచించుకుని ఓ‌ నలుగురు అమ్మాయిలని సెలక్ట్ చేసుకున్నాడు కాండిడేట్లుగా.  తీరా వీళ్లల్లో ఎవర్ని ప్రేమించాలో నిర్ణయించుకునే లోగానే ఈ‌ సంబంధం‌ ఆకాశం‌నుంచి అన్నట్లు ఉరుము లేని పిడుగులాగా ఊడి పడింది. తండ్రి సరాసరి డిక్లేర్ చేసేసాడు "ఈ సంబంధం నిశ్చయం చేస్తున్నానూ" అని.

తల్లికి తన గోడు చెప్పుకుని లాభం లేదని తెలుసు.  ఆవిడకు మొగుడంటే చచ్చే భయం.  ఎదురాడటం నచ్చజెప్పటం లాంటి భయంకరమైన పొరపాట్లు ఆవిడ యెన్నడూ చేయదు.  అయినా ఆశ చావక తల్లి దగ్గర కొంచెం రహస్యంగానే తన గోడు చెప్పుకున్నాడు.  తండ్రివి పాము చెవులు.  ఆ మాటలు ఆయనగారి చెవిని పడటమేమిటి అగ్గిరాముడై పోయాడు

"ఇంకా ఎప్పుడు పెళ్ళి చేసుకుంటాడే నీ సుపుత్రుడూ? ఇప్పటికే వెధవకి ఇరవై ఏడు వెళ్ళొచ్చాయి. లక్షణమైన కుటుంబం. లక్షణమైన అమ్మాయి, లక్షణమైన జాతకం చాలవా? వెధవన్నర వెధవకి ఇంకా ఏం‌ తక్కువౌతున్నాయీ లక్షణాలూ? " అని గర్జించాడు.

తనకి నోరు తడారి పోయింది.

"ఫోటో చూసి తగలడ్డావా లేదా? పిల్ల నీ‌ కంటికి ఎందుకు బాగా లేదూ " అని నిలదీసాడు.

అమ్మాయి ఓ‌ మోస్తరు అందకత్తె అన్న మాట నిజమే‌ కావచ్చు.  తన ముందు కొంచెం చిన్నపిల్లలా ఉంటుందేమో.  కాని తండ్రి ముందు నోరెత్తి అక్షంతలు వేయించుకునే ధైర్యం లేక నీళ్ళు నమిలాడు.

పెళ్ళి చూపులు చాలా చప్పగా జరిగాయి.  అమ్మాయి మౌనంగా కూర్చుంది.  పెద్దవాళ్ళే ప్రశ్నలు వేసారు అమ్మాయిని. తనూ విడిగా మాట్లాడిద్దామనుకున్నా తల్లి "చాల్లే, మీ‌ నాన్నగారికి ఇలాంటి వేషాలు నచ్చవు" అనేసింది.

తన పెళ్ళిచూపుల్లో అమ్మయిలాగా తానూ‌ ఒక బొమ్మలాగా కూర్చున్నాదంతే. అంతా పెద్దవాళ్ళే చూసుకున్నారు. నోర్మూసుకుని చూసి వచ్చాడు.  నోర్మూసుకుని తాళి కట్టి అమ్మాయిని ఇంటికి తెచ్చుకున్నాడు.
ఈ రోజున తామిద్దరం ఆదిత్య యిష్టానికే వదిలేస్తున్నాం!

*    *    *

వర్థనమ్మకు చాలా వింతగా అనిపించి కొడుకు గురించే ఆలోచిస్తోంది.  ఇంత నిక్కచ్చి అమ్మాయిని పెళ్ళాన్ని చేసుకుని వీడు వేగగలడా అని ఆందోళనతో ఆవిడకు ఒక పట్టాన నిద్రపట్టలేదు.

ఆ మాటకు వస్తే తాను మాత్రం నిక్కచ్చి కాదూ. "పెళ్ళిమీద ఏ అభిప్రాయమూ లేదు. డిగ్రీ పూర్తయ్యే దాకా పెళ్ళి మాట తలపెట్టకండి అని అమ్మానాన్నలతో‌ డైరెక్టుగా చెప్పేసింది.

"అవ్వ అవ్వ, ఏం‌ పిదప కాలమే తల్లీ" అని బామ్మ ఒకటే గోల చేసింది.
"ఏరా నా ఘటం వెళ్ళిపోయే లోగా దీని పెళ్ళి చేస్తావా లేదా" అని కొడుకు మీద యెగిరింది.
"అంతా నీ‌ పెంపకం మహిమ తల్లీ, బిడ్డల్ని బాగానే తయారు చేసావూ" అని కోడలి మీద నిప్పులు చెరిగింది.
"ఎంత సాంప్రదాయం ఉన్న కుటుంబం‌ మనదీ, చివరికి అంతా ఇలా అఘోరిస్తున్నారు" అని సణిగిసణిగి వదిలింది.

అమ్మా నాన్నా నచ్చజెప్పిన కొద్దీ తాను కొర్రెక్కి కూర్చుంది.

కాని తన పంతం నెగ్గలేదు. పెళ్ళివారిని మావయ్య స్వయంగా వెంటబెట్టుకుని వచ్చాడు. పెళ్ళికొడుకు బాబాయికి మావయ్యకీ‌ మా చెడ్డ స్నేహంట. తన జాతకమూ ఫోటోనూ‌ మావయ్యే స్వయంగా పెళ్ళికొడుకు తండ్రికి ఇచ్చి వచ్చాడట.  మావయ్యలు ఇలా కూడా కొంపలు ముంచుతారు కాబోలు.

చేసేది లేక ముఖానికి లేనినవ్వు పులుముకుని పెళ్ళిచూపులకు కూర్చుంది. అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చింది. పెళ్ళికొడుకు బాగానే ఉన్నాడు.  కాని తనతో ఒక్క ముక్కా మాట్లాడకుండా ముంగిలా కూర్చుని టిపిన్ చేసి చక్కాబోయాడు. తనతో యేమన్నా మాట్లాడతాడేమో నని ఆశపడితే ఆ ఊసే తేలేదు.  ఉసూరు మంది.  బోడి సంబంధం ఇది కాకపోతే మరొకటి అనుకుంది.

తనని ఒక్క ముక్కా అడక్కుండానే ఆ సంబంధమే నిశ్చయం చేసేసారు.  ఇదికూడా మావయ్య నిర్వాకమేనట. పీకల్లోతు కోపం వచ్చింది.

*    *    *

కూతురు చేసిన నిర్వాకం విన్న తులసమ్మగారికి అంతా వింతగా అని పించింది.  ఈ రోజుల్లో పిల్లలకి ఎంత తెగువా?  అమ్మాయిని చూస్తే ఎంత ఆశ్చర్యం - సరాసరి పెళ్ళికొడుకుని పెళ్ళిచూపులకు ముందే ఇంటర్వ్యూ చేసిపారేసింది!

తనకో డజను సంబంధాలు వచ్చాయి. ఎవరికీ‌ తను నచ్చలేదు. ఎవరికీ‌ జాతకం‌ నప్పట్లేదుట. భలే వంక అందరికీ.  నాన్న దగ్గర దండిగా డబ్బుంటే తన జాతకం మొదట వచ్చిన వాడితో‌ సహా అందరికీ దివ్యంగా నప్పేది మరి. అష్టకష్టాలు పడి చిన్నాన్న ఒక సంబంధం తెచ్చాడు.

వీళ్ళ కేమిటో తన జాతకం బహుచక్కగా నప్పిందట.  నప్పకేం జేస్తుందీ? రెండో పెళ్ళివాడికీ జాతకాల పట్టింపా మరి!

అమ్మ దగ్గర వాపోయింది "నాకీ రెండోపెళ్ళివాడు వద్దమ్మా, నాన్నకు చెప్పూ" అని. తల్లి కళ్ళొత్తుకుంది.  "ఏం చేస్తాం తల్లీ మనదృష్టం అంతే. ఇద్దరక్కల పెళ్ళీ అయ్యేసరికి మా చేతులు వట్టిపోయాయి.  మీ అన్న వెధవ యేదో ఉధ్ధరిస్తాడనుకుంటే వాడికి ఇప్పటికీ సరైన ఉద్యోగం సద్యోగం లేదు. అక్కడికీ‌ మీ‌ నాన్నగారు బాగా వాకబు చేసారు. మంచి సంబంధమే. నువ్వేం దిగులు పెట్టుకోకు" అని నచ్చజెప్పింది.

దేవుడికి ఎన్ని దణ్ణాలు పెట్టుకుందీ తాను, ఆ రెండో పెళ్ళి సంబంధం తప్పిపోవాలీ అనీ? అమ్మానాన్నా విచారించినా తనకు మాత్రం సంబంధం తప్పిపోగానే గంతులు వేయాలనిపించింది.

"ఇంకే చేస్తామండీ" అంది అమ్మ దిగాలుగా ఒక రోజున.  ఆ రోజునే తన అప్రయోజకత్వపు అన్నగారు ఒక సంబంధం తెచ్చాడు.

నూతులో దూకుదాం అనుకుంది తను ఆ దరిద్రపు సంబంధం వివరాల్ని విని. ఆ రెండో పెళ్ళివాడే చాలా బెటర్ అని విచారించింది.

ఆశ్చర్యంగా అ రెండో పెళ్ళి సంబంధం నిశ్చయమై పోయింది. నూతులో దూకవలసిన అగత్యం లేకపోయింది. 

*   *   *

రాఘవరావుకు రెండో పెళ్ళి చేసుకోవటం సుతరామూ ఇష్టం లేదు. నచ్చజెప్పీ నచ్చజెప్పీ లాభం లేక తల్లి బ్రహ్మాస్త్రం ప్రయోగించింది ఉరేసుకుంటానూ అని. చేసేదేమీ‌ లేక సరే నని తులసిని చూడటానికి వెళ్ళాడు.

ఆ అమ్మాయికి తనని చేసుకోవటం ఇష్టం కాదేమో.  అడిగిన వాటికి ముక్త సరిగా సమాధానాలు చెప్పింది.  తనకు వయసు మించిపోక పోయినా రెండో పెళ్ళి రెండో పెళ్ళే కదా. బాధపడుతున్నట్టుంది అనుకున్నాడు.

మెల్లగా తల్లిని ప్రసన్నం చేసుకుని మనసులో మాట చెప్పాడు.  "అమ్మా, తప్పకుండా పెళ్ళి చేసుకుంటాను.  కాని నాక్కొంచెం‌ గడువు ఇవ్వాలి నువ్వు. నువ్వన్నట్లు నాకేమీ వయసు మీరి పోలేదు కదా? నీ‌కెందుకు బెంగ" అని నచ్చజెప్పాడు.

తల్లికి నిజమే అనిపించింది. కొడుకు ఇంకా తాజాగానే ఉన్న పోయిన కోడలి జ్ఞాపకాలను మరువలేక పోతున్నాడని అర్థం చేసుకుంది. "అలాగే నాన్నా" అని సమాశ్వాసించింది. "ఆ అమ్మాయి కూడా చాలా ముభావంగా ఉంది.  పోనీలే వేరే సంబంధం చేసుకుందువు గానిలే అంది"

ఇదంతా రాఘవరావు జ్ఞాపకం చేసుకున్నాడు.

ఒకరోజు అనుకోకుండా తల్లికి తులసీ వాళ్ళమ్మగారు గుడిలో తారసపడ్డారు.  ఏం మాట్లాడుకున్నారో‌ ఏమో.

"తులసి చాలా మంచి పిల్ల నాయనా,  నువ్వు చేసుకుంటే బాగుంటుంది.  మళ్ళీ ఆలోచించు బాబూ" అంది ఆ రోజు రాత్రి భోజనాల దగ్గర.

రాఘవరావుకు ఏం చెప్పాలో తోచలేదు.  ఈ‌ మధ్య తులసి గురించి ఒకటి రెండు సార్లు ఆమె గుర్తుకు వచ్చి సానుభూతి కలిగింది. ఎందుకో తనకూ స్పష్టంగా తెలియదు.  అదే చెప్పాడు. "సరే నమ్మా, వాళ్ళకు కబురు పెట్టు" అన్నాడు.

ఈ‌ రోజు రాత్రి తనకూ‌ తులసికీ‌ జరిగిన పెళ్ళి చూపులు గుర్తుకు వచ్చాయి రాఘవరావుకు.  ఆ రోజుల్లో తల్లి పోరు పెట్టింది తనను మళ్ళీ పెళ్ళి చేసుకోమని.  ఈ రోజున ఎంతో‌ పోరుబెడితే‌ కాని రవళి పెళ్ళి చూపులకు ఒప్పుకోలేదు. దానికి కెరీర్ పిచ్చి.  తులసికేమో దీనికి యేళ్ళు మీద పడిపోతున్నాయని ఒకటే ఆదుర్దా.

*   *   *


ఉదయమే రవళి టిపిన్ చేస్తుండగా తులసమ్మ టీ తీసుకుని వచ్చింది కూతురికి.
"‌ఈ సంబంధం చేసుకోవే. అనవసరంగా వంకలు పెట్టకు. అబ్బాయి చక్కగా ఉన్నాడు" అంది నచ్చ జెప్పుతున్నట్లుగా.

"ఏ సంబంధం?" అంది రవళి యధాలాపంగా. ఆమె బుర్రనిండా నిన్న సాయంత్రం జరిగిన ప్రాజెక్ట్ మీట్ చర్చ గురించిన ఆలోచనలు. "లాభం లేదు. ప్రకాష్ ఈ‌ ప్రాజెక్టును సరిగా హేండిల్ చేయటం లేదు. దీనిని ఈశ్వర్‌కు అప్పగించాలి. ఈశ్వర్ అంత సుముఖంగా లేడు మరొక ప్రాజెక్ట్ కూడా తీసుకుందుకు. జిఎం గారితో కూర్చుని డిసైడ్ చెయ్యాలి." ఇలా సాగుతున్నాయి ఆమె ఆలోచనలు.  తల్లి వచ్చి డిష్టర్బ్ చేసింది.

తులసమ్మ తెల్లబోయింది. చదవేస్తే ఉన్న మతీ‌పోయిందట.  నిన్నే చూసి వెళ్ళారా? అప్పుడే ఎవరూ అంటా వేమిటే" అంది కోపంగా

"ఓ‌ అదా. సరేలే‌ అమ్మా, నిన్ననేగా ఆదిత్య వివరాలు ఇచ్చాడూ.  చూద్దాం నన్ను వెరిఫై చేసుకోనీ" అంది తాపీగా.

తల్లి మరో మాట అనే లోగా "వెళ్ళొస్తానమ్మా, బై"‌ అనేసి ఆఫీసుకు వెళ్ళిపోయింది.

6 కామెంట్‌లు:

 1. కాలం మారింది ..వారు వీరవుతారు అంటే ఇంతేనేమో నండీ! కథ బావుంది . ఇలాగే వ్రాస్తూ ఉండండి

  రిప్లయితొలగించండి
 2. వనజగారూ,
  ఏం చేస్తాం చెప్పండి!
  కొండ మహమ్మదు దగ్గరికి రాకపోతే‌ మహమ్మదే‌ కొండ దగ్గరకు పోవాలి కదా మరి?
  నా కేమో‌ కథలు రాయటం‌ అంటే భయం. నా వల్ల కాదేమో నని.
  అయినా ఓ‌ రాయి వేసి చూసాను.
  నా కథలూ చదువుతారని తెలిసి హాశ్చర్యానందాలు కలుగుతున్నాయి.
  పగటి వేషగాడన్నాక అన్ని వేషాలూ వేయకా, బ్లాగు రాసే వాళ్ళూ జనాకర్షణకోసం‌ రకరకాలుగా రాయకా తప్పదు.
  నా మొదటి కథకు మీదే బోణీ‌ స్పందన. కృతజ్ఞతలు.


  రిప్లయితొలగించండి
 3. చాలా చక్కగ రాసారు. ఈ కాలానికి దర్పణం పట్టెదిలా ఉంది. తొలి ప్రయత్నం బాగుంది. మీ అంత గొప్పగా ఆలొచించాలంటె మాటలు రావాయె.

  రిప్లయితొలగించండి
 4. మీ మొదటి కథ నాకు ఎంతో నచ్చింది. రవళి లా ఈ కాలం ఆడపిల్లలు అందరు ఉంటే జీవితంలో అఖర్లేని మెలోడ్రామాకి బై బై చెప్పొచ్చు. ఆడవాళ్ళు కాస్త అనవసరమైన ఇమోషనల్ డిపెండన్స్ తగ్గించుకుంటే , అటు మగవారికి , తమకి కూడా చాలా సుఖం.ఇలాంటి చక్కని కథలు రాస్తుండండి శ్యామలీయం గారు.

  రిప్లయితొలగించండి
 5. శ్యామలీయంగారు ఇలా కూడా వ్రాస్తారా! అని నాకూ ఆశ్చర్యానందం వేసింది. కాలానికి తగినట్లు మీరూ మంచి కాలనుగుణమైన కథని వ్రాశారు. మీ భాషా - భావం చక్కగా ఉన్నాయి. రవళి పాత్ర ద్వారా మహిళాలోకం లో అవసరమైన చైతన్యాన్ని చూపగలిగారు అతిశయోక్తులు లేకుండా. మరిన్ని కథలు వ్రాయాలని కోరుతూ అభినందనలు సర్.

  రిప్లయితొలగించండి
 6. Katha katha kaabatti chaala baagundi'

  kaane inkaa nijamgaa ammayi jeetham/katnam/andam meedane pellillu decide avuthunnayi

  ani cheppadaaniki baadhapaduthunnanu. swayamgaa anubhavisthunnanu. chaduvu, samskaram, telivi pedarikam lo vela tela pothayi.

  రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.