23, జనవరి 2021, శనివారం

బదులీయ కున్నావు

బదులీయ కున్నా వెంత బ్రతిమలాడినా యింక

ముదమున మమ్మేలుకోర మోహనాకార


చిన్నచిన్న తగవులు చిత్రమైన తగవులు

పన్ని మాతో వాదులాడి బడలినావులే

అన్నియు నుత్తుత్తి కోపాలన్నది మాకెరుకే

యెన్ని చూడ మిట్టివో యినకులేశ్వర


గడుసుమాట లాడేవు గడబిడ సేసేవు

విడువకనే మాకొంగు వీరరాఘవ

పెడమెగము పెట్టు నీ వేషాలు మాకెరుకే

పడకదిగి చిరునగవులు పంచవయ్యా


అప్రమేయ యికచాలు నలుకలు పంతాలు

క్షిప్రప్రసాద సీతాచిత్తవిహార

విప్రవరులు నిదురలేప విచ్చేసి నా రదే

సుప్రభాత వేళాయె చూడవయ్యా


2 కామెంట్‌లు:

  1. బదులీయవలసిందే ఈ కీర్తనకు ఆ శ్రీరామ చంద్రుడు
    అన్నట్టు..చాలా మురిపెంగా ఉంది కీర్తన.👌
    రాముల వారి బదులు నీకు అందుతుంది లే

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.