29, జనవరి 2021, శుక్రవారం

ఘుష్యతే యస్యనగరే

ఘుష్యతే యస్యనగరే
రంగయాత్రా దినేదినే
తమహం శిరసావందే
రాజానం కులశేఖరమ్‌


ఈ శ్లోకంలో యస్యనగరే అని కాక యత్రనగరే అనే మరొక పాఠం కూడా ఉంది.

భావం. 

ఏ కులశేఖరుని నగరంలో ప్రతిదినమూ రంగయాత్ర గురించిన చాటింపు విబబడుతూ ఉంటుందో, ఆ మహారాజు కులశేఖరునికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

వివరణ.
కులశేఖరుడు గొప్ప రాజు. అయన గొప్ప రామభక్తుడు. రామకథాశ్రవణంలో ఎంతగా నిమగ్నమైపోయే వాడంటే అది చెప్పనలవి కాదు. ఒకసారి ఖరదూషణాలు పద్నాలుగు వేలమంది రాక్షసులు రాముడి మీదకు దండెత్తి వచ్చారని పౌరాణికుడు రామాయణం చెబుతూ వినిపించగానే, అయ్యో రాముడు ఒక్కడే ఆ సైన్యాన్ని ఎదుర్కోవాలా, ఎంత కష్టం ఎంత కష్టం అని దిగ్గిన లేచి సైన్యసమేతంగా రాముడికి సహాయంగా వెళ్ళాలి అని గబగబా ఆజ్ఞలు జారీ చేసాడట. అప్పుడు పౌరాణికుడు అయ్యయ్యో అంత శ్రమ మీకవసరం లేదండీ వాళ్ళందర్నీ రాముడు మట్టుబెట్టాడు అని చెప్పి మొత్తం మీద శాంతింపజేసాడట. అలాగే రావణుడు సీతమ్మను ఎత్తుకొని లంకకు తీసుకొనిపోయాడని విని ఆవేశంతో‌ మళ్ళా సైన్యంతో బయలుదేరాడట. ఆయన ఆవేశం చల్లార్చరానిదిగా ఉంటే సీతాసహితుడై ప్రత్యక్షమై రామచంద్రుడే నాయనా ఆ రావణుణ్ణి చంపేశాను, ఇదిగో సీతమ్మ చూడు అని అనునయించాడట. అటువంటిది ఆయన శ్రవణభక్తి.

కులశేఖరుల వారికి రాముడి ఇలవేల్పు రంగనాథస్వామి అని తెలిసి మహా ఆనందం కలిగింది. ఆ రంగనాథుణ్ణి తానూ సేవించుకోవాలని అనిపించి వెంటనే ప్రజలందరికీ ఒక తెలిసేలా ఒక ప్రకటన చేసాడు. ఏమని? నేను మన దైవం శ్రీరాముల వారికే ఇలవేల్పు ఐన శ్రీరంగనాథుణ్ణి సేవించుకుందుకు బయలుదేరుతున్నాను.ప్రజలారా, ఆసక్తి ఉన్న వాళ్ళంతా నాతో రండహో అని.

అనుకున్నంత మాత్రాన ప్రయాణం సాధ్యపడాలి కదా. ఆరోజున ఎవరో‌ భాగవతోత్తములు రాజనగరానికి వచ్చారు. భాగవతుల్ని సేవించటం అన్నది భగవంతుణ్ణి సేవించటం వలే విధి కదా. వారికి స్వయంగా ఏర్పాట్లు చేయించి, వారిని సేవించటంతో ఆదినం గడచిపోయింది.

మరొకసారి, ఇలాగే రంగపురానికి ప్రయాణం‌ కడితే, అదేదో‌ పరీక్ష అన్నట్లు మళ్ళా మరెవరో భాగవతోత్తముల రాక.

ప్రతిసారీ ఇలాగే జరుగుతూ రంగయాత్రా ప్రకటనం దినదిన కృత్యమై పోయింది.

అందుచేత ఎవరో భక్తుడు కులశేఖరులను ఉద్దేశించి చెప్పిన శ్లోకమే ఈ
   ఘుష్యతే యస్యనగరే రంగయాత్రా దినేదినే
   తమహం శిరసావందే రాజానం కులశేఖరమ్‌
   
అన్నది.

భగవధ్బక్త సేవనం భగవత్సేవనం‌ కన్నా దొడ్డది అని చెప్పే తదారాథనాత్పరమ్‌ తదీయారాథనం  అన్న నానుడి ఒకటి ఉంది. దానినే ప్రప్తత్తి అంటారు. ముకుందమాలను పారాయణం చేసేవారు ముందుగా ఈ‌కులశేఖరుల ప్రపదననాన్ని తెలిపే ఈశ్లోకాన్ని పఠించటం ఒక ఆచారం అయ్యింది.

ఐతే ఈ‌శ్లోకం దక్షిణదేశ ప్రతుల్లో లేదు. ఉత్తరదేశం లోని ప్రతుల్లో కనిపిస్తున్నది.

అనువాదం.

      కం. దినదిన మెవ్వాని పురిన్
      వినబడు శ్రీరంగయాత్ర వేడుక టముకై
      ఘనుడా కులశేఖరునకు
      మనసా శిరసా యివియె నమస్కారంబుల్.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.