26, జనవరి 2021, మంగళవారం

సీతారామా నీభక్తుడ

సీతారామా నీభక్తుడనే చేయందించవయా

ప్రీతిగ నీపదదాసుని బ్రోవగ బిరబిర రావయ్యా


కోపాలసులగు నరులమధ్య నే కూలబడితినయ్యా

పాపము వద్దు పుణ్యము వలదు పాహిపాహి రామా

ఏపగిదిని నన్నుధ్ధరింతువో యిక భారము నీదే

కృపాంబుధారలు కురిపించవయా నృపాలమణి రామా


గడబిడ పడకుము నేనున్నా నని కరుణగ పలుకవయా

పడిన కష్టములు చాలును సుఖములు బడసెద వనవయ్యా

గడచిన దానికి వగవకు నాకృప కలదని పలుకవయా

విడిపించితి నీ భవబంధములని వేడ్కను పలుకవయా


ఈకలిబాధల కోర్వగలేను నాకు నీవె దిక్కు

నీకన్యుల నేనెరుగను తండ్రీ నిన్నే నమ్మతిరా

ప్రాకటముగ నన్నుధ్ధరించవే భక్తవరద రామా

శ్రీకర శుభకర కరుణాకర హరి శ్రీవైకుంఠవిభో


4 కామెంట్‌లు:

  1. మీరు ఇంత వేడుకుంటారు కాబట్టే ఆ రాముల వారు మా అందరి కోసం కూడా వచ్చేస్తున్నాడు. మీబ్లాగు చూసిన పుణ్యమేమో మరి. శత కోటి వందనాలు మీకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాములవారు వచ్చేస్తున్నారా? ఎంత శుభవార్త! కానీ నేరుగా ఆంధ్రాకు కాని వచ్చేస్తున్నారా ఏమిటి? తన భద్రతకు తానే తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు కదా, అమెరికా అధ్యక్షుడి లాగా - అది చాలా ముఖ్యం. అమాయకంగా, నా గుళ్ళే కదా, నా భక్తులే కదా అనుకుంటే చిక్కుల్లోపడి విల్లెక్కుపెట్టవలసి వస్తుంది.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.