24, డిసెంబర్ 2021, శుక్రవారం

తెలంగాణాలో ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం పరీక్ష వ్రాసిన విద్యార్ధు లందరూ పాస్!


తెలంగాణా ప్రభుత్వ విద్యాశాఖ వారు మంచి నిర్ణయం‌ ఒకటి ప్రకటించారు. ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం పరీక్ష వ్రాసిన విద్యార్ధు లందరూ పాస్ అని ప్రకటించారు. ఈ విషయం ఇప్పుడే పత్రికల్లో వచ్చింది.  ఈనాడులోనూ, అంధ్రజ్యోతిలోనూ, సాక్షిలోనూ చూసాను. ఇంకా అన్ని పేపర్లలోనూ వచ్చే ఉంటుంది.

దురదృష్టవశాత్తూ యీ నిర్ణయాన్ని చాలా ఆలస్యంగా ప్రకటించారు.

విద్యాశాఖ మంత్రిణి గారికి ఒక విన్నపం. అందర్నీ పాస్ చేసి మంచిపని చేసారమ్మా. కొందరు విద్యార్దినీవిద్యార్ధులు ఈఫలితాలకు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు పాపం. దయచేసి వాళ్ళందరికీ మీరంతా పాసయ్యారర్రా అని చెప్పేసి వెనక్కి తీసుకొని వచ్చి వాళ్ళవాళ్ళ అమ్మానాన్నలకు అప్పగించండి. మీకు చాలా పుణ్యం ఉంటుంది.

ఎన్ని పేపర్లు ఉండలీ‌ పరీక్షల్లో అన్న విషయం మీరు ముందుచూపుతో ఆలోచించారో లేదో‌ నాకు తెలియదు.
 
పాపం వాళ్ళ చదువులు కరోనాకాలం చదువులు ఐపోయాయే, కాస్త సులభంగా ఉండాలీ పేపర్లు అన్న మార్గదర్శక సూత్రం ఏమన్నా చేసారేమో ముందుచూపుతో అన్నది తెలియదు. ఒకవేళ అలాంటిది చేసి ఉంటే సగానికి పైన అభ్యర్దులు ఫెయిల్ అయ్యేవారు కారేమో కదా. ఒకవేళ మీరు తగినంత సులభం చేయలేదేమో మరి.

పోనీ ఏదో‌ లెక్కలు వేసి పరీక్షలు నిర్వహించారు సరే, వాటి పర్యవసానంగా ఫెయిల్ ఐన వాళ్ళే హెచ్చు పాసయిన వారి కంటే అని అధికారవర్గాలు ప్రభుత్వదృష్టికి తీసుకొని వెళ్ళాయేమో తెలియదు. ఒకవేళ వారు ఫలితాలను విడుదల చేయటానికి ముందుగా,  ఆపని చేసి ఉన్నపక్షంలో, ఈ విద్యార్దుల ఆత్మహత్యలు ఇన్ని ఉండేవి కావేమో అని అనుమానం.

పోనివ్వండమ్మా, ఐనదేదో ఐపోయింది.
 
మీరు ఫలితాలను సరిదిద్ది, అందరినీ పాస్ చేసారు. సంతోషం.

అందుచేత మీరు దయచేసి ఆచనిపోయిన విద్యార్ధినీవిద్యార్ధులనూ మళ్ళీ మనమధ్యకు తీసుకువచ్చి మీదిద్దుబాటును సమగ్రం చేసుకోండి.