15, డిసెంబర్ 2021, బుధవారం

కథాసంవిధానం.


కథ అన్నాక దానిని నడిపేవిధానం కథ అంత ముఖ్యంగానూ ఉంటుంది. ఒక కథను అనేకులు విడివిడిగా ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా తమకు తోచినట్లు తాము వ్రాసారు అనుకోండి. అప్పుడు వార‌ందరూ అదే కథనే‌ చెప్పినా దానిని చెప్పే విధానం ఎవరిది వారికి ప్రత్యేకంగానే ఉంటుంది కదా. కథను నిర్మించే విధానాన్ని మనం సంవిధానం అందాం. ఈసంవిధానం ఎన్ని రకాలుగా ఉండవచ్చునూ‌ అన్నది నిజానికి మనం లెక్కించను కూడా వలనుపడదు.

ఒక ఉదాహరణను తీసుకుందాం. అందరికీ తెలిసిన ఒక కథ ఉన్నది. దానిపేరు రామాయణం. ఈ రామాయణకథకు మనకు ఆధారగ్రంథం వాల్మీకి మహర్షి సంస్కృతభాషలో రచించిన శ్రీమద్రామాయణం. ఈ రామాయణం లోని కథ కల్పితమా లేక చారిత్రకమా అన్నది ఈరోజున చర్చల్లో తేలే‌ అంశం‌ కాదు.

ఒక్క విషయం మాత్రం ముఖ్యంగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రామాయణం కల్పితకథ ఐనపక్షంలో ఆకథ గురించీ ఆకథలోని పాత్రల గురించీ వాల్మీకిమహర్షి చెప్పినదే‌ ప్రమాణం. ఆయన రామాయణాన్ని తప్పుపడుతూ మనం ఆపాత్రలనూ‌కథనూ మార్చి మన వెర్షన్ మాత్రమే సరైనదనో‌ మరింతమంచిదనో‌ మాట్లాడకూడదు. ఒకవేళ రామాయణకథ చారిత్రకం అనుకుంటే, ఆకథను మొదట గ్రంథస్థం చేసినవ్యక్తి వాల్మీకి మహర్షి. ఆకారణంగా కూడా ఆయన రామాయణాన్ని తప్పుపడుతూ మనం ఆపాత్రలనూ‌కథనూ మార్చి మన వెర్షన్ మాత్రమే సరైనదనో‌ మరింతమంచిదనో‌ మాట్లాడకూడదు. అలా రెండువిధాలుగానూ వాల్మీకి రామాయణాన్ని తప్పుపట్టటమో లేదా దానికి మనకు తోచిన మెఱుగులు దిద్దటమో అసమంజసం.

ఐనా సరే అనాదిగా కవులూ నేటి ఆధునికులూ కూడా రామకథను తమకు తోచిన రీతిలో‌ తాము చెబుతూనే‌ ఉన్నారు. ఈ‌చెప్పే‌వాళ్ళు రెండు రకాలు. ఒకరకంవారు సంస్కృతంలో ఉన్న శ్రీమద్వాల్మీకి రామాయణాన్ని దేశభాషల్లోని తెచ్చి మరింతమందికి అందుబాటులోనికి తేవాలని ఆశిస్తూ ఉంటారు. వీరుమరలా మూలాన్ని అనుసరించి ఉన్నదున్నట్లు వ్రాయాలనుకునే వారూ, తమప్రతిభను ప్రదర్శిస్తూ కొత్తకొత్త సంగతులు చేర్చి వ్రాద్దామనుకునే వారూగా రెండు రకాలుగా ఉన్నారు. రామాయణకథను మళ్ళా చెప్పటంలో వేరేవేరే‌ ఉద్దేశాలు మనసులో‌ ఉంచుకొని కథను తదనుగుణంగా చెబుతూ వాల్మీకాన్ని కావాలని అతిక్రమించి వ్రాసే వారు రెండవరకం - వీరిలో వాల్మీకాన్ని తిరస్కరించి వ్రాసే వారూ బహుళంగా కనిపిస్తున్నారు. ఇలా తిరస్కరించి దురుద్దేశంతో రామకథను వక్రీకరించే వారిని మినహాయిస్తే ఆకథ సకారణంగా సగౌరవంగా మరలా చెప్పేవారిని తప్పుపట్టుకోవలసిన పనిలేదు.

ఈ రామకథను పునఃపునః చెప్పిన వారిలో ఎవరి ప్రత్యేకత వారిదే కదా. ఇప్పటికీ రామాయణాన్ని కవులు మళ్ళామళ్ళా చెబుతున్నారూ అంటే‌ కథాసంవిధానం అన్నది అనంత విధాలుగా చెయ్యవచ్చును అనటానికి మనకు ప్రత్యేకంగా ఋజువులు అవసరం లేదు.

ఒక రామకథనో ఒక భారతకథనో మనం మనదైన ఆలోచనతో మనదైన శైలిలో వ్రాయాలంటే అందులో కొంత సౌలబ్యం ఉంది. ఆ సౌలభ్యానికి కొన్ని కారణాలున్నాయి.

  • కథ మొత్తం మనకు ఆమూలాగ్రం మనస్సుకు చాలా స్పష్టంగా విదితంగా ఉండటం. 
  • కథలోని పాత్రల పేర్లూ, స్వభావాలూ పాత్రల మధ్య సంబంధబాంధవ్యాలూ స్నేహవైరాల విషయంలో చాలా మొదటినుండే చాలా స్పష్టత ఉండటం. 
  • కథలోని ముఖ్యఘట్టాల నుండి చిన్నచిన్న సంఘటన వరకూ వాటి క్రమమూ ప్రాథాన్యత గురించి సంపూర్ణమైన అవగాహన ఉండటం. 
  • కథలో‌ ప్రస్తావనకు వచ్చే‌ ప్రదేశాలూ వస్తువుల వంటి వాటి అవసరమూ ప్రయోజనమూ గురించి బాగా తెలిసి ఉండటం.

కేవలకల్పనాకథలు కృత్రిమరత్నములు అన్నాడొక కవి. అద్యసత్కథలు వావిరిబట్టిన జాతిరత్నములు అని కూడా అన్నాడాయన. ఆయనకో నమస్కారం పెట్టి కల్పించి ఒక పెద్దకథను చెప్పటం ఒక కత్తిమీద సాము అన్నది విన్నవించక తప్పదు. మీరొక కథను కల్పించి వ్రాసే పక్షంలో పైన చెప్పిన ఏకారణాల వలన రామాయణాదులు సులభంగా కథితం చేయగలుగుతున్నారో ఆకారణాలు మీరు వ్రాయబోయే కొత్తకథకు కూడా అంత చక్కగానూ వర్తించాలి. అప్పుడే మీరు మంచి సంవిధానంతో మీకథను చెప్పగలరు.

అదంత సులభం‌ కాదు. మొత్తం అంతా వ్రాసేద్దామన్న అత్యాశ వదలుకొని ఒక ప్రణాళిక ప్రకారం వ్రాయటం చేయాలి. 

మొదటిదశ

  • క్రమంగా మీ కథను అభివృధ్ధి చేయాలి. అంటే ముందుగా మీరు వ్రాయదలచుకొన్న కథను సంక్షిప్తంగా వ్రాయాలి. కొద్ది పేజీల్లోనే‌ అది పూర్తి కావాలి. అది స్పష్టంగా చెప్పటం ఒకపట్టాన కుదరదని గుర్తుంచుకోండి. పెద్దకథ అని అనుకున్నప్పుడు అది తృప్తికరంగా క్లుప్తంగా వ్రాయటం కూడా ఒక సవాలే. ఒకటి కాదు పదిసార్లు చిత్తుప్రతిని వ్రాయవలసి రావచ్చును. 
  • ఇప్పుడు మీరు పూర్తి చేసిన సంక్షిప్తకథలో ఉపకథలు ఎక్కడెక్కడ వచ్చేదీ గుర్తించండి. ఉపకథలను విడివిడిగా అభివృధ్ధి చేయండి.  
  • ఇలా ఉపకథలకు కూడా ప్రధానకథకు చేసినట్లుగానే సంక్షిప్తప్రతులను చేయాలి. మరలా ఆఉపకథలలో కూడా రెండవస్థాయి ఉపకథలుంటే ఇలాగే అభివేధ్ధి చేయాలి. ఇలా ఎంతలోతుగా పోవవలసి వస్తుందీ అన్నది మీ‌కథను బట్టి ఉంటుంది. 
  • అట్టడుగు స్థాయి ఉపకథలను పూర్తి చేసిన తరువాత దాని పైస్థాయి ఉపకథను పూర్తి చేయగలుగుతారు. ఓపిక చాలా అవసరం. తొందరపడితే‌ మీరు త్వరగా గందరగోళంలో పడిపోయే‌ ప్రమాదం ఉంటుందని మరవవద్దు. ఇలా అడుగుస్థాయి నుండి పైస్థాయి దాకా ఒకసారి అభివృధ్ధి చేసిన తరువాత, మీ‌కథకు ఒక స్వరూపం అంటూ‌ వస్తుంది. 
  • అప్పుడే ఐపోలేదు. ఈ‌ప్రతిని సునిశితంగా పరిశీలించాలి. పాత్రల పేర్లూ స్వభావాలూ, సంబంధాలూ, ప్రదేశాలూ, కథలోని కాలగమనం వంటి వన్నీ బాగా అధ్యయనం చేయాలి. ఇది త్వరత్వరగా చేయకూడదు. ఇక్కడే ఎక్కువ జాగ్రత వహించాలి. అవసరం అనుకుంటే వీలు కుదిరితే మీకు సమర్ధులు అనిపించిన వారిని మీ‌చిత్రుప్రతిని విశ్లేషించేట్లు కోరాలు. ఈ విశ్లేషకులు కనీసం ఇద్దరు ముగ్గురు ఉండటం వలన చాలా లాభాలుంటాయి. 
  • వచ్చిన సూచనలూ సలహాలూ‌ దృష్టిలో పెట్టుకొని మీ‌చిత్తుప్రతిని సవరించాలి. ఇది మరలా విశ్లేషణకు వెళ్ళాలి. ఇదంతా మొదటి దశ.

రెండవదశ

  •  కథను సంవిధానం చేయటం అన్నది రెండవదశ. చిత్తు ప్రతిలో అంతా కథలూ ఉపకథలూ అన్న క్రమంలో ఉంది. కాని సంవిధానం అంటే కథలను ఒకదానిలో ఒకటి జాగ్రతగా సమ్మిశ్రితం చేయటం. మొదటి చిత్రుప్రతిలో ఒక ఉపకథ ఉందంటే అక్కడ అది మొత్తంగా ఉంది. కాని చెప్పే విధానం అది కాదు కదా, ఆ ఉపకథను ముక్కలుచేసి దాని ఆధారకథలో ఎక్కడ ఎంత చెప్పాలో ఎలా చెప్పాలో అలా కలుపుతూ పోవాలి. అట్టడుగు స్థాయి ఉపకథలనుండి పైస్థాయి దాకా ఇలా చేయటం అనుకున్నంత సులువు కాదు. ప్రయత్నబాహుళ్యం అవసరం పడవచ్చును. 
  • ఇలా సంవిధానం చేసిన గ్రంథాన్ని విశ్లేషణకు ఇవ్వాలి. చిత్తుప్రతికన్నా ఈగ్రంథం పూర్తిగా తేడాగా ఉంటుంది కదా కధలు ఒకదానిలో ఒకటి పడుగుపేకల్లా కలగలిసి. అది ఎంత చక్కగా చదివించేలా ఉందో విశ్లేషకుల అభిప్రాయం తరువాత స్పష్టత వస్తుంది. వచ్చే విమర్శల ఆధారంగా మార్పులు చేర్పులు చేయాలి. ఇలా రెండవదశ ముగుస్తుంది.

మూడవదశ

  • ఇప్పటికి ప్రథానకథనూ దానిలో అంతర్గతంగా ఉన్న ఉపకథలనూ ఒకపధ్ధతిలో పేర్చటం పూర్తయింది. కాని ఇదే‌ తుది గ్రంథం కాదు కదా. ఇప్పుడు మూడవదశ లోనికి ప్రవేశిద్దాం. ఇంతవరకూ ఏర్పడిన గ్రంథంలో సంభాషణల స్థానంలో సంభాషణాసారం మాత్రమే కనిపిస్తోంది. సంఘటనలకు క్లుప్తంగా మాత్రమే చెప్పటం జరిగింది. ఇవి విస్తరించాలి. 
  • సంభాషణలను పూర్తిగా విస్తరించి వ్రాయాలి - ఏ సంభాషణ ఎంత నిడివి ఉండాలీ అన్నది సందర్భం యొక్క ప్రాముఖ్యతను బట్టి ఉంటుంది. ఒక సంభాషణలో పాల్గొనే‌ పాత్రలను బట్టి ఉంటుంది. రెండు బండ గుర్తులు ఏమిటంటే అప్రధానసంఘటనల్లోనూ అప్రధానపాత్రలమధ్యనా సంభాషణ చిన్నదిగా ఉండాలి. ఏ సంభాషణా నిరుపయోగంగా ఉండకూడదు అన్నవి. ఇటువంటి బండగుర్తులే సంఘటనలను విస్తరించటంలోనూ‌ ఉపయోగిస్తాయి. ఇప్పుడు గ్రంథంలో అవసరమైన చోట్ల వర్ణనలను చేర్చాలి. వీటి వలన పాత్రల స్వభావాలకు పుష్టిచేకూర్చ వచ్చును. సందర్భానికి తగిన వస్తు, ప్రకృతి ఇత్యాదులను గురించిన అవవరమైన సమాచారాన్ని పొందుపరచ వచ్చును.
  • ఇలా విస్తరించి వ్రాసిన గ్రంథం మరలా బాగా విశ్లేషించబడాలి. ఎందుకంటే పాత్రల స్వరూపస్వభావాలను ఇప్పుడు మనం మన వాక్యాల్లో కాకుండా సంఘటనలూ సంభాషణలూ ఆధారంగా చదువరికి అందించుతున్నాం కాబట్టి.  పాత్రలస్వభావాలు వైరుధ్యరహింతంగా నిరూపించామా, సంఘటనల్లో దేశకాలాదులను సరిగా చూపుతున్నామా అన్నది చాలా నిశితంగా విమర్శించుకోవాలి.ఇలా మూడవదశ పూర్తి ఐన తరువాత మన గ్రంథం పూర్తి ఐనట్లే.  

నాలుగవదశ

  • ఇక చివరిది అయిన నాలుగవ దశ. ఈ‌దశలో కొద్దిమంది కాక ఎక్కువమంది గ్రంథాన్ని చదివి వారి వారి విమర్శలు చెబుతారు. ఎక్కువసంగతులు వెలుగులోనికి వస్తాయి. ఫలాని పాత్రకు మీరు పెట్టినపేరు బాగోలేదు అని ఒకరు చెప్పి తమతమ కారణాలను చూపించవచ్చును. ఫలాని ప్రదేశం అన్నారు అక్కడ మీరు చెప్పిన రకం పూలు పూయవు అని ఎవరన్నా ఎత్తి చూపవచ్చును. ఫలాని రెండు పాత్రలచిత్రణ అసహజంగా ఉంది. మార్చండి అని కొందరు సమర్ధనలు చూపవచ్చును. ఇలాంటివి ముందు దశల్లో రావు. అప్పటికి అంతా కథమీదనే దృష్టి కాబట్టి, కథను మాత్రమే చూపాము కాబట్టి. ఇప్పుడు గ్రంథవికాసం ఐన తరువాతనే ఇలాంటి విమర్శలు వస్తాయి. 
  • ఈ విమర్శలను పరిగణనలోనికి తీసుకొని గ్రంథాన్ని సంస్కరించండి. ఇప్పుడు మీ‌కొత్త పుస్తకం విడుదలకు సిధ్ధం.

 ఇంతవరకూ కథను ఎలాగు ఒక క్రమపథ్థతిలో నిర్మించాలో చూసాము.ఇప్పుడు కథలోని పాత్రలను చిత్రికపట్టటం ఎలాగో చూదాం.

కథలోని పాత్రలు ప్రధానపాత్రలు, అప్రధానపాత్రలు, ప్రాస్తావికపాత్రలు అని మూడు రకాలుగా ఉంటాయి. 

  • ప్రధానపాత్రలు:  కథ వీటిమీద ఆధారపడి నడుస్తుంది.
  • అప్రధానపాత్రలు, కథ వీటిమీద ఆధారపడి నడవదు. కాని కథను నడపటంలో తోడ్పడతాయి.
  • ప్రాస్తావికపాత్రలు: కొన్ని సంఘటనల్లో ఈ పాత్రలు కనిపిస్తాయి. అలా కొధ్ది సంఘటలల్లో పాల్గొనటం తప్ప వీటి వలన వేరే ప్రయోజనం ఉండదు.

రామాయణం తీసుకుంటే దశరథుడు, సీతారామలక్ష్మణులూ, రావణుడూ వంటి వారు ప్రధానపాత్రలు. మందోదరీ, గుహుడూ  వారు ప్రాస్తావిక పాత్రలు. సుమంత్రుడూ, వశిష్ఠుడు, జటాయువూ సంపా వంటి వంటి వారు అప్రధాన పాత్రలు. శత్రుఘ్నుడు కూడా ప్రాస్తావిక పాత్రగానే ఉన్నాడు. భారతంలో కృశ్ణుడు, పంచ పాండవులూ, దుర్యోధన, కర్ణ, ధృతరాష్ట్రవిదుర భీష్మద్రోణకృపాశ్వథ్థామాదులు ప్రథానపాత్రలు. మాద్రీ ద్రుపదపురోహితుడూ సంజయుడు వ్యాసుడు వంటి వారివి అప్రధానపాత్రలు. బోలెడు ప్రాస్తావికపాత్రలున్నాయి.

ఇలా మీకథలో పాత్రల పరిమితిని ముందు గుర్తించాలి. 

ఒక్కొక్క సారి ప్రాస్తావిక పాత్రలు కూడా ప్రభావశీలంగా ఉండవచ్చును. రామాయణంలో మందర ఒక ప్రాస్తావిక పాత్ర. కాని ఆపాత్ర గురించి అందరికీ‌ తెలుసు. కథలో ఒక బలమైన మలుపుకు అది కారణం ఐనది కాబట్టి. కాని వాల్మీకి సంయమనంతో ఉండి ఆ పాత్రను విస్తరించలేదు. మందరా పాపదర్శినీ అని చెప్పి ఊరుకున్నాడు. ఇలా ఏపాత్రను ఎంతమేర విస్తరించి వ్రాయాలో అన్న ఒక స్పష్టత ఉండాలి.

కథాగమనంలో తోడ్పడే‌ అప్రధానపాత్రలను కూడ తగినంత విస్తరించటంలో ఏమరుపాటు కూడదు. లేకపోతే ఆపాత్రలు తేలిపోవటమే‌ కాక కథాగమనంలో పునాదులు బలహీనంగా అనిపిస్తాయి. భారతంలో సైంధవుడి పాత్ర చిన్నదే. కాని తగినంత బలంగా తీర్చిదిద్దటం జరిగింది. 

సంభాషణల విషయం. ఇప్పటికే‌ ఈవిషయం క్లుప్తంగా చెప్పుకున్నాం. సంభాషణలల్లో  ఒక పాత్ర స్వభావం అన్నిటా ఒకేలా ఉండాలి. స్వభావం స్పష్టంగా చదువరులకు అందాలి. అనవసరమైన సంభాషణలు ఉండకూడదు. ఒక సంభాషణ కథను నడిపించటానికి కాని పాత్రలను స్ఫుటం చేయటానికి కాని మరేదైనా సంఘటననో‌ ఇతరవిషయాన్నో సూచించటానికి కాని ఎందుకో ఒకందుకు తప్పనిసరి కావాలి. కేవలం కాలక్షేపం సంభాషణలు గ్రంథాన్ని బలహీనపరుస్తాయి. అలాగే సంభాషణల్లో పాత్రలే‌ కనిపించాలి కాని రచయిత కనిపించకూడదు. అలాగే సంభాషణల్లో అనుచితమైన ప్రస్తావనలూ భాషా ఉండకూడదు.