15, మార్చి 2021, సోమవారం

రామనామం రామనామం

రామనామం రామనామం భూమిని నింగిని మ్రోగే నామం
రామనామం రామనామం  రక్తిని ముక్తిని కూర్చే నామం

విన్నకొద్దీ వినాలనే ఒక వేడుకపుట్టే రామనామం
అన్నకొద్దీ అనాలనే ఒక ఆతృతపుట్టే రామనామం
అన్నా విన్నా మనసుల్లో వెన్నెలనింపే రామనామం
చిన్నా పెద్దా అందరికీ చేరువ యైన రామనామం

అందరిచెవులను వేయాలని ఆశపుట్టే రామనామం
అందరి కూడి పాడాలని ఆశ పుట్టే రామనామం
అందరి కోరికలను తీర్చే అద్భుతమైన రామనామం
అందరి బ్రతుకులు పండించే అద్భుతమైన రామనామం

గాలిపట్టికి బ్రహ్మపదాన్నే కరుణించినదీ రామనామం
నేలను చక్కగ ధర్మపధాన్ని నిలబెట్టినదీ రామనామం
వేలమందికి కైవల్యాన్ని వితరణచేసెను రామనామం
కాలాతీతం రమణీయం కమనీయం మన రామనామం