28, ఏప్రిల్ 2024, ఆదివారం

దయచేసి నాదీనతను బాపరా


దయచేసి నాదీనతను బాపరా భవ

భయవారక రామ పతితపావన నామ


నీనామమాహాత్మ్య మేనెఱుగు నాటికే 

మేనునగల సత్వమే మాయమైనది

జానకీపతి నేడు పూని పునశ్చరణ

నేను చేయగలేని దైనది రాదేవ


పూని ప్రాయమునందు బుధ్ధిమంతుడ నగచు

నేను చదువగ నైతి నీదివ్యచరితము

జానకీపతి నేడు నేను చదువగ లేను

దీనుని మన్నించితే చాలు దేవ


ఏనాడు సమవర్తి యిటువచ్చునో యని

ఈనాడు భయమున దీనుడ నైయుంటి

నానాలుక నీదు నామ మిప్పుడు నేర్చె

దీనబాంధవ నీవె దిక్కయ్య దేవ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.