2, ఏప్రిల్ 2024, మంగళవారం

వనజాక్ష నాగతి యేమయ్యా


వనజాక్ష నాగతి యేమయ్యా 

ఘనకృపాసాగర రామయ్యా


ధనలోభమున నేను పలుతప్పులను జేసి

    తిని రామ రామ నా గతియేమి

ధనమదంబున బంధువుల బిట్టుగా తిట్టి

    తిని రామ రామ నా గతియేమి

ధనహీనులను హీనముగ నెంచి వెడలించి

    తిని రామ రామ నా గతియేమి

కనకమే ముఖ్యమని ఘనముగా మది నమ్మి

    తిని రామ రామ నా గతియేమి


వనితపై ననురాగమున తప్పులను జేసి

    తిని రామ రామ నా గతియేమి

వనిత పనుపున జేయరాని పనులను జేసి

    తిని రామ రామ నా గతియేమి

వనితయు తనయులే సర్వస్వమని నమ్మి

    తిని రామ రామ నా గతియేమి

ధనములును వనితయును తనయులును చాలు నం

     టిని రామ రామ నా గతియేమి


పనికిమాలిన విద్యలను శ్రధ్ధగా నేర్చి

     తిని రామ రామ నా గతియేమి

పనికిమాలిన వాదముల ప్రీతిమై జొచ్చి

    తిని రామ రామ నా గతియేమి

పనికిమాలిన పదవులనం నిత్య మాశించి

    తిని రామ రామ నా గతియేమి

పనికిమాలిన వారి పాదంబులకు మ్రొక్కి

    తిని రామ రామ నా గతియేమి


ఆనయంబు నిహసుఖంబుల నెంచి వర్తించి

    తిని రామ రామ నా గతియేమి

ఘనులు భాగవతోత్తముల నిత్యమును తిట్టి

    తిని రామ రామ నా గతియేమి

కనులు కానని గర్వమున నిన్ను తలచ నై

    తిని రామ రామ నా గతియేమి

వినక నీసత్కథలు విపరీతబుధ్ధి నై

    తిని రామ రామ నా గతియేమి


వినుము నీదయలేక వెఱ్ఱినై వర్తించి

    తిని రామ రామ నా గతియేమి

ఘనమైన నీదయను నేడుగా బడసియుం

    టిని రామ రామ నా గతియేమి

వనజాక్ష ఈనాడు జ్ఞానంబు కలిగియుం

    టిని రామ రామ నా గతియేమి

అనఘ జ్ఞానాగ్నిసందగ్ధకర్ముండ నై

    తిని రామ రామ నా గతియేమి