హరి యెచ్చట గల డందురు కొందరు
హరి యెచ్చట లేడందురు కొందరు
హరియే లేడని యందురు కొందరు
హరినే నమ్ముదు మందురు కొందరు
హరినే కొలిచెద మందురు కొందరు
హరి కరుణామయు డందురు కొందరు
హరి వరదాయకు డందురు కొందరు
హరియే దైవం బందురు కొందరు
హరియే బ్రహ్మం బందురు కొందరు
హరియే ప్రధముం డందురు కొందరు
హరియే తుది మొద లందురు కొందరు
హరియే యఖిలం బందురు కొందరు
హరి కన్యము లేదందురు కొందరు
హరి యజ్ణేశ్వరు డందురు కొందరు
హరి పరమేశ్వరు డందురు కొందరు
హరి లోకేశ్వరు డందురు కొందరు
హరి యోగీశ్వరు డందురు కొందరు
హరి వేదమయుం డందురు కొందరు
హరియే వేద్యుం డందురు కొందరు
హరియే కాలాత్మకు డందురు కొందరు
హరి మాయామయు డందురు కొందరు
హరి త్రిజగత్పతి యంందురు కొందరు
హరి జీవేశ్వరు డందురు కొందరు
హరి సర్వేశుం డందురు కొందరు
హరి యన్నిట గల డందురు కొందరు
హరి విశ్వాత్మకు డందురు కొందరు
హరియే విశ్వం బందురు కొందరు
హరి కడ చేరుదు రార్తులు కొందరు
హరిని గొలుతు రర్ధార్ధులు కొందరు
హరిని జేరు జిజ్ణాసులు కొందరు
హరి వారగు మోక్షార్దులు కొందరు
హరిపూజలు మేలందురు కొందరు
హరినామము చాలందురు కొందరు
హరి యందరి వా డందురు కొందరు
హరి మావాడని యందురు కొందరు
హరియే రాముం డందురు కొందరు
హరియే కృష్ణుం డందురు కొందరు
హరియే శివుడని యందురు కొందరు
హరిహరు లొకటే నందురు కొందరు
హరి హరి హరి యని యందురు కొందరు
హర హర హర హర యందురు కొందరు
హరి ధ్యానించును హరు నెల్లప్పుడు
హరుడును చేయును హరికై ధ్యానము
హరి హరులను ధ్యానించెడు వారికి
ఇరువురు నొకటను యెఱుక రహించును
హరి హరి యన్నను హర హర యన్నను
పరమపదమునే బడయుదు రందరు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.