21, నవంబర్ 2014, శుక్రవారం

కొండలరావుగారి వ్యాసం - బ్లాగర్లకు వ్యాఖ్యాతలకు సలహాలు

పల్లె ప్రపంచం - ప్రజ లో నేనడిగిన "తెలుగు బ్లాగర్లకో విజ్ఞప్తి : కామెంటడం ఓ కళ - దానినెందుకు కలగా మిగులుస్తున్నారు?"  అన్న ప్రశ్నకు సమాధానంగానూ, శ్యామలీయం గారి బ్లాగులో "వ్యాఖ్యారంగ విమర్శనం - వ్యాసాలకు ఆహ్వానం!" అన్న పిలుపుకు వ్యాసంగానూ ఏదైనా వ్రాద్దామనుకుని మొదలెడితే ఇలా పెద్ద వ్యాసమయింది. ఎడిట్ చేసే ఓపికలేక యధాతధంగా పోస్టుగా పబ్లిష్ చేస్తున్నాను. ఓపికగా చదివిన వారు తమ అభిప్రాయాలు చెప్పగలరని విజ్ఞప్తి.

భూమి మీద 84 లక్షల జీవరాసులు నివసిస్తున్నాయని ఓ అంచనా ! ఇన్ని జీవరాసులలో మనిషి ప్రత్యేకత 'మనసు' . మనసుకు నిర్వచనం మనిషి యొక్క ఆలోచనావిధానం . మనిషిలో ఇతర అవయవాలు చేసినట్లుగానే మెదడు చేసే పని ఆలోచించడం. ఈఆలోచన అనేది మనిషికీ - ఇతర జీవులకు తేడాని తెలియజేస్తున్నది. .

మనిషి మాత్రమే పాత దానిని బేరీజు వేసుకుని కొత్తగా ఎలా అయితే తనకు బాగుంటుందో అని ఆలోచించి మరీ ప్రయత్నం చేస్తాడు. ఇది మనిషికి కావలసిన అన్ని రంగాలలో నిరంతరం జరిగే ప్రక్రియ. జంతువులు లేదా మిగతా జీవరాసులు అలా కాదు. సహజాతంగా తరతరాలుగా తమకున్న నాలెడ్జ్ మేరకు మాత్రమే అలాగే మారకుండా జీవిస్తున్నాయి.  కేవలం ఒక్క మనిషి మాత్రమే ఆలోచించి తను మారుతూ,  పరిస్తితులను మార్చుతూ ఉంటాడు.

ఇక్కడే మనిషికీ - మనిషికీ మధ్య కొంత ఘర్షణ జరుగుతుంది. ఈ ఘర్షణ కొన్ని విషయాలలో కొంత కాలం, ఇంకొన్ని విషయాలలో అనంతంగా జరిగినా భగవద్గీతలో చెప్పినట్లు ఎప్పటికప్పుడు పరివర్తనం చెందడమనేది లోకం పోకడగా ఉంటుంది. ఈ పరివర్తనకు కారణం మానసిక సంఘర్షణే - మనసే అనేది మనసున్న మనం చాలా సార్లు మరచిపోతుంటాం. మనుషులమధ్య మనసుల పోట్లాటా అందుకే జరుగుతుంటుంది.

మనిషికుండేవి 2 సంబంధాలు మాత్రమే : 1) ప్రక్రుతితోటి 2) మనిషితోటి . సహజంగా మనిషి సంఘజీవి. తమ అవసరాలకోసం మనుషులంతా కలసి ప్రకృతిని ఆధారం చేసుకుని సాంఘిక జీవనం సాగిస్తుంటారు. సంఘజీవనం కోసం ఎప్పటికప్పుడు కొన్ని నియమనిబంధనలు ఏర్పాటు చేసుకుంటారు. తాను ఏర్పరచుకున్న ఈ నియమాలతో పాటు, సృష్టి రహస్యాలయిన ప్రక్రుతిలో తన చుట్టూ జరిగే అనేక అంశాలను, తనకు ఆటంకంగా ఉన్నవాటిపై విజయం సాధించేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈ సందర్భంగా తన మెదడులో తొలిచే అనేక ఆలోచనలను తన తోనూ ఇతరులతోనూ చర్చిస్తూ పరిష్కారం కనుగొనేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంటాడు. ఇందులో భాగమే పరస్పర చర్చలు లేదా భావ ప్రకటన అని నా అభిప్రాయం.

మనిషి తను పుట్టి పెరిగిన పరిస్తితులమేరకు కొన్ని భావాలను అభిప్రాయాలను ఏర్పరచుకుంటాడు. ఈ సందర్భంగా కొన్ని అలవాట్లూ ఏర్పడతాయి. కానీ పైన చెప్పినట్లు లోకం ఎప్పుడూ మార్పుకు గురవుతుంటుంది. ఎవరాపినా ఆగదు. సమాజం ఎప్పటికప్పుడు ఉన్న స్తితినుండి ఉన్నత స్తితికి మారుతుంది. ఇది అనివార్యం- అవసరం కూడా.

ఒక్కోసారి ఉన్నతంగా కంటే దిగజారే పరిస్తితులూ కొందరు మనుషులు ప్రవర్తిస్తుంటారు. అది వారి స్వార్ధం. ఇంకొందరు చిన్నప్పటినుండి తామేర్పరచుకున్న భావాలు - ఆచార వ్యవహారాలు తొలగిపోతుంటేనో, తొలగించబడుతుంటేనో తట్టుకోలేరు. సమాజం చెడిపోతున్నదని, దిగజారి పోతున్నదని, కావాలని కొందరు దిగజారుస్తున్నారని వారి భయం. మరికొందరు సమాజంలో ఆచార వ్యవహారాలు ఆటంకంగా ఉన్నవి పాత చింతకాయ పచ్చడిలా తయారయ్యాయని చాదస్తమనీ వాదిస్తుంటారు. అది వారి అసహనం. ఇలా రకరకాలుగా వివిధ అంశాలపై అభిప్రాయాలున్నా అందరూ ఒకరిపై మరొకరు ఆధారపడుతూ కలసే జీవిస్తుంటారు.

ఇక్కడే ప్రధానమైన ఓ అంశమేమిటంటే, విడి విడిగా మనసులలో ఏర్పరచుకున్న భావాలు బయటకు వెలిబుచ్చినప్పుడే అదే భావాలున్నవారి మధ్య ఓ ఐక్యత ఏర్పడుతుంది. అది క్రమంగా ఓ శక్తిగా మారుతుంది. ఓ అంశంపట్ల మార్పుకు దోహదం చేస్తుంది. ఇక్కడే మళ్లీ భిన్న భావాలు భిన్న గ్రూపులుగా ఏర్పడతాయి. ఏ భావం రైటూ ఏ భావం తప్పు అనే విచక్షణ లేకపోతే మనుషుల మధ్య ఈగోలు పెరిగి అవి గ్రూపుల ఈగోలుగా మారి గొడవలవుతుంటాయి. ఎన్ని గొడవలయినా ఎవరెంత ఈగో పెంచుకున్నా కాలక్రమంలో ఆచరణలో అవసరమైన కంఫర్టబుల్ అంశాలే ఆచార వ్యవహారాలుగా నిత్యం వికసిస్తుంటాయి.

ఈగోలను పక్కనబెట్టి అంశాలవారీగా విచక్షణకు పదును బెడితే ఎప్పటికప్పుడు వ్యక్తి ఉన్నతంగా ఆలోచించడం సాధ్యమవుతుంది. ఈగోల మాటున, గ్రూపుల లేదా ఇజాల మాటున బందీ అయితే చైతన్యం వికసించదు. బయట అయినా బ్లాగులలో అయినా విచక్షణ అనేది మనిషి చైతన్యం మరియూ వ్యక్తిత్వం ఏర్పడడానికి కీలకమైనదని నా అభిప్రాయం. దీనికి ఏమిటి? ఎందుకు? ఎలా? అనే శాస్త్రీయ ధృక్పథం అలవరచుకోవడమొక్కటే పరిష్కారం. ఏ ఒక్కరికీ ఎప్పటికీ అన్ని విషయాలు తెలిసే అవకాశం లేదు కనుక అందరూ అందరికి గురువులే. అందరూ అందరికీ అవసరాన్ని బట్టి శిష్యులే అని నా నమ్మకం. నేర్పడానికీ - నేర్చుకోవడానికీ కూడా భావప్రకటన చాలా అవసరం. అది సరిగా ఉంటే సమాజానికి మేలు జరుగుతుంది. మనిషికీ మేలు జరుగుతుంది. ఎప్పటికప్పుడు భావ ప్రకటన అనే కళనును ఇంప్రూవ్ చేసుకోవడానికి కామెంట్లు ఉపయోగపడతాయి. తినగ తినగ వేము తియ్యగుండును అనగననగ రాగమతిశయిల్లుచునుండునన్నాడుగదా మన వేమన్న. అలాగే సాధనమున కామెంట్లు చక్కగా ఉంటాయి.

బ్లాగర్లకు చెప్పదలచుకున్నది:- మీరు చెప్పదలచుకున్న అంశాలను నిర్మొహమాటంగా చెప్పే అవకాశం బ్లాగులు కల్పిస్తున్నాయి. అయితే కొత్త బ్లాగర్లను ప్రోత్సహించడానికి మీరు ఓపిక చేయండి. ఓపిక అంటే బాగాలేని వాటిని, మీరు చెత్త అనుకునే వాటిని గురించి. మీ బిడ్డ తొలిసారిగా మాట్లాడినప్పుడు, కాగితంపై ఓ బొమ్మ తొలిసారి వేసినప్పుడు మీకెంత ఆనందం ఉంటుంది? ఆ బిడ్డకెంత ఆనందం ఉంటుంది. గుర్తుకు తెచ్చుకోండి. అలాగే కొత్త వారు వ్రాయడం ప్రారంభించినప్పుడు వారేది వ్రాసినా మీరు చిరాకు పడకండి. మీరే అన్ని తెలిసిన గొప్పవారిలా నెగెటివ్ గానో, సర్వజ్ఞులలానో ప్రవర్తించకండి. దయచేసి ఇలాంటి లక్షణాలున్నవారు ఓపిక చేయడమనే కళను ఇంప్రూవ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. వారి భావాలను స్వేచ్చగా ఆహ్వానించేలా ప్రోత్సహించండి. మీరూ వారినుండి నిరంతరం నేర్చుకోవడానికి ప్రయత్నించండి. కొత్త బ్లాగర్లు చిన్నపోస్టులు వ్రాస్తే వారిని అభినందించే చిన్న కామెంటయినా మనం వ్రాస్తే వారు చిన్నపోకుండా ఉంటారు. ఈ రోజే ఆ పని ప్రారంభించండి. అదే విధంగా మీరు వ్రాసినదానికి భిన్నాభిప్రాయం వస్తే ఆలోచించి మీరు నేర్చుకునేది ఉంటే నేర్చుకోండి. లేదా మీ అభిప్రాయం సూటిగా చెప్పేయండి. బాగున్నదానిని బాగున్నదన్నట్లే బాగాలేనిదానిని బాగాలేదనీ అనాలి. అలా ఎందుకంటున్నామో చెప్పేది బాగు చేయడానికి కావాలి గానీ బాధ పెట్టడానికి కాకూడదని మనవి.

వ్యక్తుల గత ఆలోచనలను బట్టి అంచనాతో కాకుండా ఎప్పటి భావాలను,విషయాలను అప్పుడే గమనిస్తూ కామెంట్ చేయడం మంచిది. ప్రవీణ్ తో చర్చించేటప్పుడు మార్క్సిస్టు అనో, శ్రీరాం గారితో చరంచేటప్పుడు బీ.జే.పీ వారనో , శ్యామలీయం గారు రామభక్తులనో, శ్రీకాంత్ చారితో అయితే తెలంగాణావాదనో చూడకూడదు. భావమేది అందులో మన అభిప్రాయమేమిటి? అనేలా మాత్రమే చూడాలి. అలాగే మనిషిని బట్టిగాక విషయాన్ని బట్టి కామెంట్ చేయడం అలవాటుగా మార్చుకుంటే అత్యధిక సమస్యలు తగ్గుతాయి. ఇది అసాధ్యమేమి కాదు కూడా.

మన అభిప్రాయం తప్పని తేలితే వెంటనే నేర్చుకోవడానికీ, మార్చుకోవడానికీ వెనుకాడకూడదు. అలాగే భావోద్వేగంలో వ్యక్తిగతంగా మాట జారితే వెంటనే వెనుకకు తీసుకోండి. పదే పదే దానిని సమర్ధించుకునే విపరీత పైత్యం మనపట్ల మరింత ఏహ్యభావం కలగడానికే ఉపయోగపడుతుంది. మనలోని అహంకారాన్ని - అజ్ఞానాన్ని బయటపెట్టడానికి పనికి వస్తుంది.

అవసరం లేని విషయాలలోనూ, మితిమీరి దూరి సలహాలు విశ్లేషణలు చేయకండి. ఏకంగా మనుషుల గురించో - బ్లాగుల గురించో, పోస్టుల గురించో పనిగట్టుకుని నెగిటివ్ ప్రచారాలు చేయకండి. పాజిటివ్ అయితే ఫర్వాలేదు. ఒకరిని ప్రోత్సహించినట్లవుతుంది కనుక. మీకు చికాకు అనిపిస్తే తప్పుకుని పోవచ్చు తప్ప, మీరు తప్పు చేసి మరీ ఎదుటివారి తప్పులను సరిచేయాల్సిన అవసరం లేదు. ఇది ఓ రకమైన పైత్యమే అని నా అభిప్రాయం!

పాలకులను, ప్రాంతాలనూ దృష్టిలో ఉంచుకుని ఓ వైపు నిలబడి ఎంతకైనా సాగదీస్తూ ఎబ్బెట్టుగా వాదించడం అభిమానం కంటే దురభిమానమే ఎక్కువగా కనిపిస్తుంది. మీకున్న నాలెడ్జ్ ని ఈ ప్రవర్తన మసకబారుస్తుందని నా అభిప్రాయం. అభిమానానికీ దురభిమానానికీ విమర్శకీ కువిమర్శకీ తేడాని గమనించి వాదించడం మంచిది.

మీకు ఆసక్తిగా ఉన్నవే ఇతరులకీ ఆసక్తిగా ఉండాలని కోరుకునే వాదనలు నవ్వు తెప్పిస్తుంటాయి. ఏది ఎవరికి ఇష్టంగా ఉండాలో అది వారి వ్యక్తిగతం. మీరు అందుకు కష్టంగా ఫీలవడం అంటే అసహనం ఎక్కువవుతున్నట్లే. లేదా స్వార్ధపరులైనా అయి ఉండాలి. ఎదుటివరిని గౌరవించడం తెలీనివారైనా అయి ఉండాలి. అన్ని భావాలను, అందరి భావాలను స్వీకరిచలేకపోయినా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఏవి ఎక్కువ బాగుంటాయో వాటికే ఆదరణ లభిస్తుంది. చిన్న గీతను చెరపకుండానే పెద్ద గీతను గీయడానికి మార్గాలను అన్వేషించండి.

అనవసరమైన, కించపరచే శాడిస్టు లక్షణాలను వెంటనే తగ్గించుకోండి. ఇది కొందరిలో ఎప్పుడూ, అందరిలో(?) అప్పుడప్పుడూ అసహనంతో జరిగినా వెంటనే మార్చుకోవాలి.  పొరపాటున నోరు జారితే వెంటనే క్షమాపణ చెప్పండి. ఒక్క అడుగు వెనుకకు వేస్తే రెండడుగులు ముందుకు పడతాయంటే తప్పక ఓ అడుగు ముందుకే వెళుతుందనేది విజయమేనని గుర్తించండి.

మన అభిప్రాయం సరయినదని మనం గట్టి ఆధారాలుతో నమ్మినప్పుడు లక్ష మంది వ్యతిరేకించినా జంకవద్దు. మనమెలా రైటో ఓపికగా వివరించే ప్రయత్నం చేయండి. మూకలుగా ఒక అభిప్రాయానికి వ్యతిరేకంగా కాకిగోల చేయకండి. మనం కాకులం కాదు దాడి చేయడానికి. మనసున్న మనుషులు కాకి గోల చేసినా ప్రయోజనం ఉండదు కంఠశోష - శాడిస్టిక్ పైత్యానందం తప్ప. ఇది ఓ రకంగా వికృత రేగింగ్ లాంటిదే. పదిమంది కలసి కాకిగోల చేస్తే ఒక మంచి అభిప్రాయం చెప్పే గొంతు నులిమివేయలేరు. అరచేతితో సూర్యకాంతినాపాలనుకోవడమెంత అజ్ఞానమో అహంకారంగా,అడ్డగోలుగా మంద బలంతో, మంది బలంతో వాదించడమూ అంతే అజ్ఞానం. భూమి గుండ్రంగా ఉన్నదన్న వారిని చంపేసినా భూమి గుండ్రంగానే ఉన్నదన్నదే నిజం కదా!

కామెంట్లను ఓ బ్లాగరుగా ఎలా నియంత్రించాలనేది ఎవరికివారే చేసుకునే అవకాశం ఉన్నట్లే దానికంటే ముందుగా కామెంట్ చేసేవారు స్వీయ నియంత్రణ పాటించడం మెరుగైన పద్ధతి. ఆ చైతన్యం తెలుగు బ్లాగర్లలో పెరగాల్సిన అవసరం ఉన్నది.

ఇక అగ్రిగేటర్లలో మాలిక విధానం బాగున్నది (నేను ఎక్కువగా మాలికను చూస్తుంటాను). అందులోనే విడిగా బ్లాగుల వారీగా కూడా కామెంట్లు చూసుకునే అవకాశం కల్పిస్తే మంచిది. ఆ విధంగా వారు ప్రయత్నిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నాను. చాలామందితో వాదించిన అనుభవంతో కొన్ని ఉదాహరణలిచ్చాను. ఏ ఒక్కరినీ ఇబ్బంది పెట్టేందుకు ఇది వ్రాయలేదని విజ్ఞప్తి.

వ్యాసకర్త పల్లా కొండలరావుగారు.
 
ఈ వ్యాసం గురించి మీ అభిప్రాయాలను s y a m a l i y a m  AT g m a i l  DOT c o m  కు మెయిల్ ద్వారా  పంపగలరు.  ఈ బ్లాగు టపా క్రింద నేరుగా అభిప్రాయాలు స్వీకరించబడవు.