12, నవంబర్ 2014, బుధవారం

వ్యాఖ్యారంగ విలోకనం


మాలికలో వ్యాఖ్యారంగాలంకారణం చూస్తే తమాషాగా అనిపించింది. ఎందుకో చెబుతాను.

బ్లాగులకు వ్యాఖ్యల పంటలే పండగ..

ఎందుకలా అని ఎవరైనా అంటారా? అనరనే నా అభిప్రాయం.

ఒక టపాకు వచ్చే వ్యాఖ్య(ల) వలన కొన్ని విషయాలు తెలుస్తాయి.

ఇష్టపడి, కొండొకచో కష్టపడి వ్రాసి ప్రకటించిన టపా పాఠకజనామోదం పొందిందా? పొందలేదా? అన్న విషయం తప్పకుండా ముఖ్యమే.

ఒక టపాను ఎందరు చదివారూ అన్న విషయం బ్లాగుసర్వీసువారే లెక్కలు చెబుతారు .  ఐతే అది ఎందరు టపా పేజీని అలవాటుగానో పొరపాటుగానో, ఆసక్తితోనో ఎలా తెరిచారూ, కొసాకి తమ టపాను చదివి ఆనందించరా అన్నది ఈ లెక్కలవలన ఏమీ తెలియదు.

అందుచేత బాగుందనో బాగోలేదనో ఒక ముక్క ఎవరైనా సెలవిస్తే బ్లాగరు సంతోషించవలసిన విషయమే - కనీసం చదివి ఆ మాట అన్నారు కద అని.

ఐతే కొన్నికొన్ని సార్లు ఒక టపా క్రింద ఒక చిన్నదో పెద్దదో వ్యాఖ్యను ఉంచిన చదువరులు తమ అభిప్రాయానికి సదరు బ్లాగరు నుండి లేదా సహపాఠకులనుండి వచ్చే ప్రతిస్పందనలు కూడా తెలుసుకోవాలని భావిస్తారు.  ఎవరైనా తమ అభిప్రాయాలకు వివరణ అడిగినా , వాటిని ప్రశ్నించినా సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉందని భావిస్తారు కాబట్టి.

ఒకప్పుడు హారం అన్న అగ్రిగేటర్లో వ్యాఖ్యలనూ వాటికి వచ్చే స్పందనలూ ప్రతిస్పందనలనూ గమనించే అవకాశం ఉండేది.

ఇప్పుడు మాలికలో వ్యాఖ్యల సెక్షన్లో అలా చూసుకునే సదుపాయం కనబతుతోంది.

మాలిక వారు ఒక వ్యాఖ్యల కోసం ఒక పేజీ కేటాయిస్తున్నారన్నది ఆనందించవలసిన అంశమే.

కాని నేను ఒక ఇబ్బందిని గమనిస్తున్నాను.

ఒక బ్లాగులో సమస్యాపూరణాలు జరుగుతున్నాయి. మరొక బ్లాగులో సమస్యలపై రణాలే జరుగుతున్నాయి.

ఈ టపా వ్రాస్తున్న సమయానికి మాలికలో వ్యాఖ్యల సెక్క్షన్లో  వ్యాఖ్యల వివరాలు ఇలా ఉన్నాయి.

శంకరాభరణం బ్లాగు టపా(ల)కు వ్యాఖ్యల సంఖ్య  30 (36.1%)
ప్రజ బ్లాగు టపా(ల)కు వ్యాఖ్యల సంఖ్య 22 (26.5%)
ఇతర టపాలకు వ్యాఖ్యల సంఖ్య 31 (37.3%)
మొత్తం వ్యాఖ్యల సంఖ్య 83

అంటే ఈ పేజీలో  సింహభాగం విలువైన స్థలం ప్రజారణాలతో సమస్యాపూరణాలతో నిండిపోతోందన్నమాట!

ఇక్కడ మనం ఒక ముఖ్య విషయం గమనించాలి.  హెచ్చునిడివి గల వ్యాఖ్యలు పెరిగిన కొద్దీ ఈ పేజీలో మొత్తం వ్యాఖ్యల సంఖ్య తగ్గవచ్చును.

చాలా కాలం క్రిందట ఒక అజ్ఞాతగారు శంకరాభరణం బ్లాగులో హారంలో వ్యాఖ్యల సెక్షన్ అంతా మీ బ్లాగుకు వచ్చే కామెంట్లతోనే నిండిపోతోందని ఒక అక్షేపణపూర్వకమైన వ్యాఖ్య చేసారు.  అది శంకరాభరణం బ్లాగు అభిమానులకు ఇబ్బందిగా అనిపించింది.

ఇప్పుడు హారం లేదు. కాని క్రొత్తగా ప్రజ అని ఒక బ్లాగు వచ్చి చేరింది కామెంట్ల పంటలో శంకరాభరణానికి పోటీగా.

ఈ విషయంలో అటు శంకరాభరణం కాని ఇటు ప్రజ బ్లాగు కాని చేస్తున్న పొరపాటు ఏమీ లేదు.

కాని, వ్యాఖ్యాతలకు మాత్రం చిక్కులు పెరిగాయి.  మాటవరసకు ఒకానొక అప్పారావుగారు ఒక వ్యాఖ్య చేసిన కొంతసేపటికి అది మాలికలో కనిపించింది అనుకుందాం.  మరి కొంతసేపటికి మరెవరో సుబ్బారావుగారు దానిమీద ప్రతివ్యాఖ్య చేసారనీ అనుకుందాం. ఉద్యోగస్థులయ్యో  మరొక విధంగానే బిజీగా ఉండే అప్పారావుగారు ఆనక మాలికను తెరచి తన వ్యాఖ్యకు ప్రతిస్పందన ఏమన్నా ఉందా అని చూడాలనుకుంటే మాలికలో ఆయన వ్యాఖ్యా దానిపై సుబ్బారావుగారు ప్రతివ్యాఖ్యా కూడా  వ్యాఖ్యలపేజీనుండి జారిపోవటం వలన ఇబ్బంది కలుగుతుంది. ప్రస్తుతం అలా జారిపోయే అవకాశం ఎక్కువే,

అలా ఎందుకు ఆ అప్పారావుగారు నేరుగా తన వ్యాఖ్యదగ్గరకే వెళ్ళి ప్రతిస్పందన చూసుకోవచ్చు కదా అనవచ్చు మీరు.  కాని అప్పారావు గారు అనేక టపాల్లో తన వ్యాఖ్యలు ఉంచితే అవన్నీ గమనికలో ఉంచుకుందుకు గాను  తానే  వాటి లింకులు విడిగా దాచుకోకపోతే ఇబ్బంది అన్నమాట. ఆ కష్టం మాలికలో వ్యాఖ్యల సెక్షన్ వలన తప్పుతుంది. కాని కొన్ని బ్లాగులకు పరంపరగా వచ్చే కామెంట్లవలన ఆ సదుపాయం తరచుగా ఆవిరైపోతోంది.  అదీ సంగతి.

తెలుగు బ్లాగుటపాలకు వ్యాఖ్యలు తక్కువ అన్న సణుగుడు ఉండగా ఇప్పుడు వ్యాఖ్యలు ఎక్కువై ఇబ్బంది అంటారేం అనవచ్చును. అలాగే కొన్ని బ్లాగులకు హెచ్చు ఆదరణ వస్తే మీకు కుళ్ళు ఎందుకూ అనవచ్చును కూడా.

నా ఉద్దేశం వ్యాఖ్యలను ట్రాకింగ్ చేయటానికి మరింత సదుపాయం ఉండాలి అని మాత్రమే.

ఉన్న కాస్త పేజీలో కూడా సింహభాగం విలువైన స్థలం రణాలతో పూరణాలతో నిండిపోతోందన్నది వాస్తవం.   ఈ విషయంలో ఒక బ్లాగుకు వచ్చే వ్యాఖ్యలపైన మనకు నియంత్రణ ఉండదు కాని అగ్రిగేటర్లలో వ్యాఖ్యల ప్రదర్శన విషయంలో మరిన్ని సదుపాయాలు రావాలి అని చెప్పటమే నా ఉద్దేశం.

3 కామెంట్‌లు:

  1. వ్యాఖ్య అవసరమే కాని అది సందర్భాన్ని అవసరాన్ని మించి కన్నుపోయేటంత కాటుక పెట్టుకున్నటయిపోతోంది, ప్రజ బ్లాగులో. మిత్రులు కొండలరావు గారే దానికి తగిన ప్రతిక్రియ చెయ్యాలి.
    హారం లో లాగా చేస్తే చాలా బాగుంటుందని చాలా కాలం గా అనుకుంటున్నదే. ఆగ్రిగేటర్ల కష్టాలేంటో తెలీదు కదా...

    రిప్లయితొలగించండి
  2. ఈ విషయమై మాలికకు, బ్లాగిల్లు కు గత నెలలో మెయిల్ కూడా చేసాను . ప్రజా బ్లాగును వ్యాఖ్యల నుంచి తొలగించమని ! అయినా వారు చెయ్యలేదు . కనీసం ప్రజా బ్లాగు వారన్నా దాన్ని ఒక బ్లాగులా కాక ఫోరం టైపులో నిర్వహించుకుంటే బాగుంటుంది .

    రిప్లయితొలగించండి
  3. మాలిక లో ప్రజ బ్లాగు విషయమై నవీన్ పెద్దాడ గారు కూడా తన teluguestory అనే బ్లాగు లో 2014 సెప్టెంబర్ 23 న "రాజకీయ చర్చా బ్లాగులు ఎంతవరకు అవసరం?" అని ఓ పోస్ట్ వ్రాశారు.
    http://teluguestory.blogspot.com/2014/09/blog-post.html

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.