9, ఫిబ్రవరి 2016, మంగళవారం

చెప్పాలె v చెప్పాలి

మొన్న ఏడవతేదీన శ్రీ ఆచార్య ఫణీంద్రగారు తమ సమగ్ర సంపూర్ణ విజయం టపాను "ఈ ఎన్నికల విజయంతో తెలంగాణ ఉద్యమ విజయం సమగ్రంగా సంపూర్ణమయిందని చెప్పాలె." అన్న వాక్యంతో‌ ముగించారు.

ఆపైన నిరంతరవ్యాఖ్యాప్రకటనాకుతూహలచిత్తు లొకరు "మీ టపా మొత్తం లో ఆ చెప్పాలె బాగుందండీ !" అని ప్రశంసించటమూ జరిగింది.

ఆ ప్రశంసకు సమాధానం చెబుతూ ఫణీంద్రగారు గమనార్హమైన కొన్నిమాటలు చెప్పారు. ఆయన అభిప్రాయాలు తప్పక ఆలోచనీయాలుగా కనిపించాయి. వాటిలోనుండి ఏవో‌ కొన్ని ప్రస్తావించి నా అభిప్రాయాలను వెల్లడించటం వలన ఆయన కాని పాఠకులు కాని అనవసరమైన అపోహలకు గురి అయ్యే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ఆయన వ్యాఖ్యను పూర్తిగా ముందు ఉదహరించిన పిదప నా అభిప్రాయాలను చెబుతాను.

వ్యవహార భాషలోని ఆధిపత్యం నుండి కొద్ది కొద్దిగా స్వాతంత్ర్య సాధనకై నేను చేస్తున్న ప్రయత్న ఫలం అది. ఇంకా కొన్ని సంస్కరించుకోవలసిన ఆవశ్యకత ఉంది.

“చెప్పవలె” అన్న గ్రాంథిక క్రియారూపానికి తెలంగాణ ప్రాంతీయులు ప్రయోగించే “చెప్పాలె” అన్న వ్యవహార రూపం దగ్గరగా ఉంది. “చెప్పాలి” అన్న so called ప్రామాణిక వ్యవహార భాష క్రియారూపానికి ఏ ప్రమాణమూ కనిపించదు. ఆ ప్రయోగంలోని “లి” అన్న అక్షరంలో ఇకారం ఎక్కడ నుండి వచ్చిందో ఆ పరమాత్మునికే తెలియాలె.

ఇన్నాళ్ళు … తప్పుడు ప్రయోగాలు ఒప్పులుగా చలామణియై , ఒప్పులు అవహేళనలకు గురి కావడం నిజంగా తెలుగు భాషకు పట్టిన దౌర్భాగ్యం!


వ్యవహార భాషలోని ఆధిపత్యం అన్న ప్రయోగాన్ని నేను తమ పైన వ్యవహార భాష చేస్తున్న ఆధిపత్యం అన్న అర్థంలో ఫణీంద్రగారు ప్రస్తావించారని భావిస్తున్నాను. వ్యవహారభాష అంటే వ్యవహారంలో ఉన్న భాష అనే కదా అర్థం? వ్యవహారంలో ఉండటం‌ అంటే సమకాలీనులైన ప్రజానీకం‌ తమ నిత్యవ్యవహారంలో ప్రయోగిస్తూ ఉండటం అని కదా? ఇక్కడ ప్రజలు అన్నప్పుడు సాహిత్యంతో అనుబంధం ఉన్న వారూ, అలాంటి అనుబంధం ఏమీ లేనివారూ కూడా ప్రస్తావనలో ఉంటున్నారు. ఎంత కవి యైనా మహాపండితుడైనా సరే తన నిత్యవ్యవహారంలో వాడే భాష ఆనాటి సాధారణవ్యవహార భాష మాత్రమే అవుతూ ఉంటుంది కాని తద్భిన్నంగా ఉండదు కదా. ఐతే సాహితీవేత్తలు అపశబ్దాలను తక్కువగా ఉఛ్ఛరించే సావుకాశం‌ మాత్రం తప్పక ఉంటుంది. ఐనా సరే వారు కూడా నిత్యవ్యవహారంలో నూటికినూరుశాతమూ వ్యాకరణబధ్దమైన భాషను వాడుక చేయట‌ం జరుగదు.  ఒక్క మహామహోపాధ్యాయ కొక్కొండ వేంకటరత్నం పంతులు గారు మాత్రం పచారీ షాపువాడితోనూ కూరగాయల వాడితోనూ చివరికి భార్యతోనూ‌ కూడా నిత్యం‌ మహాశుధ్ధమైన వ్యాకరణజుష్టమైన భాషనే వాడేవారని విన్నాను. ఎంతవరకూ‌ నిజమో తెలియదు.

అందుచేత వ్యవహార భాష మన మీద పెత్తనం చేస్తోంది అన్న ఆరోపణకు నాకు ఆట్టే సామంజస్యం కనబడటం‌ లేదు. ఈ దృక్కోణంలో సంస్కరించుకోవలసిన ఆవశ్యకత అంటే ఏమిటో బోధపడదు మరి.

ఐతే ఫణీంద్రగారి వ్యాఖ్యను ఫూర్తిగా తీసుకొని చూడాలి, వారి వ్యాఖ్యను మాత్రమే కాక వారి టపా స్ఫూర్తిని కూడా మనం పరిశీలించవలసి వచ్చినా రావచ్చును.

అ కోణంలో పరిశీలించితే, ఫణీంద్రగారు వ్యవహారభాష అన్నప్పుడు దాని అర్థం, సీమాంద్రనుండి దిగుమతి ఐనదీ, ముఖ్యంగా తెలంగాణాలోనికి దిగుమతి ఐపోయి విస్తరించి తెలంగాణా మాండలికం మీద ఆధిపత్యం కనబరుస్తున్నదీ ఐన సీమాంధ్రుల వ్యవహార భాష అని అర్థం చెప్పుకోవలసి వస్తున్నది.

ఇప్పుడు వారు తమ భాషను సంస్కరించుకోవటం అంటే సీమాంధ్ర వ్యవహార భాష వాడుక చేస్తున్న తమ అలవాటును వదుల్చుకోవటం. ఇలా వారి భావనను నేను అర్థం చేసుకున్నాను.

చెప్పవలెను అన్న ప్రయోగం‌ నుండి గ్రంథప్రయోగార్హమైన మరొక రూపంగా చెప్పవలె అన్నది ఉండటం‌ యధార్థం. ఇది తెలంగాణావారు వాడే చెప్పాలె అన్న వాడుకకు దగ్గరగా ఉండటమూ కాదనరాని వాస్తవమే.

ప్రస్తుతం వ్యవహారభాషలో చెప్పాలి అన్న రూపం ప్రచురంగా వినిపిస్తుంది. ఇది తప్పుడు ప్రయోగమనీ, చెప్పాలి అన్న రూపంలోని 'లి' ఉనికికి ప్రమాణమేమీ లేదనీ ఫణీంద్రగారి అభిప్రాయం. ఈ అభిప్రాయాన్ని ఆయన ,“చెప్పాలి” అన్న so called ప్రామాణిక వ్యవహార భాష క్రియారూపానికి ఏ ప్రమాణమూ కనిపించదు.  అని ఘాటుమాటలతోనే అన్నారు.

వ్యవహారభాష సీమాంధ్రులు తెచ్చి తెలంగాణామీద రుద్దారన్న అభిప్రాయంతో ఆయన సదరు సీమాంధ్రవ్యవహారభాషను  so called ప్రామాణిక వ్యవహార భాష అని ఈ‌సడించటాని అర్థంచేసుకోవచ్చును.

వ్యవహారభాష పేరుతో సీమాంధ్రభాష బహుళప్రచారం లోనికి రావటం కారణంగా అన్నిచోట్లా అనేక తప్పుడు మాటలు ప్రచారంలో ఉండటం వలన తెలుగుభాష భ్రష్టుపట్టిపోయిందని ఫణీంద్రగారు అభిప్రాయపడు తున్నట్లున్నారు. ఆయన అభిప్రాయం ఆయనది. దానిపైన నేను చర్చించటం లేదు.

నేను నా అభిప్రయాన్ని వారి వ్యాఖ్యలోని ఒక భాగానికి పరిమితం చేయా లనుకుంటున్నాను.  అది “చెప్పాలి” అన్న so called ప్రామాణిక వ్యవహార భాష క్రియారూపానికి ఏ ప్రమాణమూ కనిపించదు. ఆ ప్రయోగంలోని “లి” అన్న అక్షరంలో ఇకారం ఎక్కడ నుండి వచ్చిందో ఆ పరమాత్మునికే తెలియాలె అన్నది


తెలుగులో పల్లె అన్న పదం ఉంది. ఆ మాటకు అర్థం ఏమిటో ఎవరికీ వివరించనవసరం ఉండదు. నా చిన్నప్పుడు మేము గెద్దనాపల్లె అన్న ఊళ్ళో ఉండే వాళ్ళం. గతవారం రోజులుగా మారుమోగుతున్న ఊరు కిర్లంపూడికి రెండు మూడు కిలో మీటర్ల దూరంలో ఉంటుందీ గెద్దనాపల్లె. ఆవూరిని అందరూ గెద్దనాపల్లి అనే పిలచేవారే కాని ఎవరూ గెద్దనాపల్లె అని పిలవటం‌ వినలేదు. చదువరులారా, మీకు పల్లె అన్న మాటతో అంతమయ్యే పేరు గల ఊళ్ళు కొన్నైనా తెలిసే ఉంటాయని భావిస్తున్నాను. సాధారణవ్యవహారంలో ఎంతమంది ఆయా ఊళ్ళ పేర్లను సరిగా పల్లె అని వచ్చేలా పలుకుతున్నారో ఒక్కసారి ఆలోచించండి.

ఎంతో దూరం‌ ఎందుకు లెండి. హైదరాబాదు వాళ్ళకి నాంపల్లి గురించి వేరే చెప్పాలా? దాని అసలు శుధ్ధమైన గట్టిగా మాట్లాడితే తెలంగాణావారికే దాదాపు స్వంతమైన పలుకుబడిలో నాంపల్లె అనాలి కదా? ఎలా పిలుస్తున్నారు అందరూ? హైదరాబాదీలైనా నాంపల్లె అంటున్నారా?  నాంపల్లి అని ఒకటే కాదు, ఇంకా కొంపల్లి, బాచుపల్లి వగైరా పల్లితో ముగిసే ప్రాంతాలు మరికొన్ని ఉన్నాయి.

మల్లెపూల గురించి తెలియని వాళ్ళుండరేమో. అవును మరి వ్రాసేటప్పుడు మల్లె అనే వ్రాస్తాం. కాని వాడుకగా జనం పలుకుబడిలో ఉన్నది మల్లి అనే కదా. మల్లి అన్నమాటే మల్లె అన్న మాటకన్నా ఎక్కువ ప్రచారంలో ఉది కదా. మల్లీశ్వరిలో ఉన్నది మల్లి కాని మల్లె కాదేమో కదా.

గారెలు తెలుగువారికి యిష్టమైన పిండివంటల్లో ఒకటి. ఆలోచించండి. వాడుకలో గారె అంటున్నామా గారి అంటున్నామా?

పెట్టె, గిన్నె అన్నపదాలను మనం పెట్టి, గిన్ని అనే వ్యవహారంలో పలుకుతున్నాం. గేదె అన్న మాట తరచుగా గేది అని వినబడుతూఏ ఉంటుంది. ఇలా చాలా మాటలే ఎకారాంతమైనవి జనం నోటిలో‌పడి ఇకారాంతాలుగా వాడుకలో ఉన్నాయి.

చెప్పాలె అన్న మాటలో ఏ దోషమూ‌ లేదు.  అలాగే చెప్పాలి అనటంలో‌ కూడా ఏదోషమూ‌ లేదు. రెండురకాలుగానూ వ్యవహారం బాగానే ఉన్నది.

దయచేసి ఇప్పుడు చెప్పండి. వాడాలి, చెప్పాలి, వినాలి వంటి మాటలలో ఉన్న ఇకారాంత ప్రయోగం తెలుగును నిజంగానే భ్రష్టుపట్టిస్తోందా? లేదా ఈ విధమైన వాడుకలు సీమాంద్రవారి చలువ వలనే ప్రచారంలో హెచ్చుగా ఉన్నాయి కాబట్టే తెలుగుభాష భ్రష్టుపట్టిపోతోందా?

నిత్యవ్యవహారంలోని భాష కాబట్టే అది వ్యవహారభాషగా చెప్పబడుతోంది కదా. అలాంటప్పుడు ఒక సందర్భంలో మన తెలుగువారు వ్యవహారంలో ఎలావాడుతున్నారు అన్నది పరిశీలించితే సరిపోయేదానికి పరమాత్మునికి నివేదించుకోవలసినంత దారుణమైన దౌర్భాగ్యంగా భావించటం ఎలా సబబు?

ఈ వ్యాసం చివరన ఒక ముక్క చెప్పటం అవసరంగా అనిపిస్తోంది. విషయసంబదంధిగా ఫణీంద్రగారి అభిప్రాయాన్ని ఖండించటమే కాని వారిని చిన్నబుచ్చటం‌ నా ఉద్దేశం‌ కాదు. మామధ్య బహుకాలంగానే స్నేహసంబంధాలు చక్కగా ఉన్నాయి.



12 కామెంట్‌లు:

  1. శ్యామలీయం గారు!
    నమ:
    "పల్లె", "మల్లె" అన్న పదాలకు "పల్లియ", "మల్లియ" అన్న రూపాంతరాలు ఉండడం వలన ఇకారం వచ్చిందని గ్రహించవచ్చు. మరి "చెప్పవలెను", "చెప్పవలె" అన్న పదాలకు "చెప్పవలయు" అన్న రూపంతరం తప్ప, "చెప్పవలియు" లేక "చెప్పవలి" అన్న రూపాంతరాలు ఏవైనా ఉన్నాయా? - ఇకారం ఎట్లా వచ్చింది? - దయచేసి వివరించగలరు!
    వికృతమైన భాషే వ్యావహారికమైన భాష అని అందరూ ఎరిగిన విషయమే!
    అటువంటప్పుడు .. ఇన్నాళ్ళూ తెలంగాణ వ్యావహారిక భాష ఎందుకు అవహేళనలకు గురి అయ్యింది? ఉమ్మడి రాష్ట్రంలో ఎవరి ప్రాంతంలో వారి పద్ధతిలో మాటాడుకొంటారన్న ఔదార్యం ఎందుకు కొరవడింది?- వివరించగలరు.
    "చెప్పాలి" - "చెప్పాలె" వంటి ఎన్నో పదాలను గమనిస్తే, ఎక్కువ వికృతమైన భాష ఉమ్మడి రాష్ట్రంలో అందరి నెత్తి మీద "ప్రామాణిక భాషగా" ఎందుకు రుద్దబడింది? అది ఆధిపత్యం కాదా? - వివరించగలరు.
    ఎక్కువ వికృతమైన భాష మాటాడేవారు, తక్కువ వికృతమైన భాష మాటాడేవారిని వెక్కిరించి మానసికంగా గాయం చేయడం ( DG గారి లాగా) తెలుగు భాషకు అరవై ఏళ్ళకు పైగా పట్టిన దౌర్భాగ్యం కాదా? - వివరించగలరు.
    వాస్తవాలను ఎత్తి చూపిన ప్రతిసారీ - DG గారిలాంటి చాల మంది సీమాంధ్రులు (అందరూ కాదు) అవహేళనలు చేయడం మాకు కొత్తేమీ కాదు. అదివారి సహజ లక్షణం అనుకొని వదిలేస్తుంటాం. ఏటుకూరి బలరామమూర్తి గారి గ్రంథంలో, ఇంకా ఇటీవల ఏదో ఒక బ్లాగులో చదివిన గుర్తు. బహుశ: ఈ సహజ లక్షణమే వారిని విశ్వామిత్ర శాపానికి గురి చేసి ఉంటుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తెలంగాణా భాష అవహేళనకు ఎందుకు గురైనదీ అని అడుతుతున్నారు. అది చర్చనీయాంశం కాదే. తెలంగాణా భాష అందంగా ఉందనీ లేదనీ ఎవరి అభిప్రాయం మేఅరకు వారు అనుకోవచ్చును. ఐతే అలా సిధ్ధాంతీకరించ దలచుకుంటే అందరినీ ఒప్పించవలసి ఉంటుంది. తెలంగాణాయాస గురించి నాకు ఇక్కడికి దశాబ్దాల క్రిందట వలస వచ్చే వరకూ తెలియనే తెలియదు. కోనసీమలో నేటి యువతరానిదీ అదే పరిస్థితి. అందుచేత పనికట్టుకొని సీమాంద్రులు అవహేళన చేసారన్నది నేను నా అనుభవంతో నిర్థారించలేను. అసలు తెలుగువాడిగా ఉనికినే కొన్ని దశాబ్దాల క్రిందట కించిత్తు తక్కువస్థాయిగా పరిగణించే పరిస్థితి మన దేశంలో. ఎవరో సినిమాల వాళ్ళు కొన్ని సందర్భాలలో హాస్యానికి వాడారని ఉదహరించి సీమాంద్రులంతా అవమానం చేస్తున్నారనలేము. ఐనా ఈ చర్చ ప్రస్తుత సందర్భంలో అంత అవసరం కాదనుకుంటాను.

      మీ వ్యాఖ్యనుబట్టి చూస్తే మీరు సీమాంధ్రభాషను ఎక్కువగా చెడిన భాషగానూ, తెలంగాణాలోని తెలుగును తక్కువగా చెడిన భాషగాను భావిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తున్నది. అది విచారించవలసిన సంగతి. నాకైతే ఆ భావన ఆమోదయోగ్యం కాదు.

      ఇకపోతే విశ్వామిత్ర శాపం ఎందుకు ప్రస్తావనకు వచ్చిందా అని విస్తుపోతున్నాను. ఆయన శాపానికి ఆంధ్రులు గురికావటం అంటే యావదాంధ్రజనం అందులోనికి వస్తారు. అప్పటికి తెలంగాణా ఆంధ్రప్రాంతం కాకుండా విడిగా లేదు. మొన్నమొన్నటి వరకూ తెలంగాణావారే తమని తాము ఆంద్రులం అని పిలుచుకొనే వారన్న సంగతి మీకు తెలియనది కాదు. సహజలక్షణాలు తెలుగువారివి అందరివీ ఒకటే. రాజకీయ లక్షణాలు కాలానుగుణంగా వేరుగా ఉండవచ్చును. సహజంగా చెడ్దవాళ్ళము అంటే అటూ-ఇటూ అందరమూ చెడ్డవారమే, కాదంటే అందరమూ మంచివారమే!

      ముఖ్యవిషయానికి వస్తే నేను ఎకారాంత పదాలు తెలుగులో ఇకారాంతాలు కావటం పైన చాలానే ఉదాహరణలు ఇచ్చాను. మీరన్నట్లు మల్లియ నుండి మల్లి వచ్చిందని అనుకోవలసిన పని లేదు, మల్లి అన్న వ్యవహారరూపానికి గ్రంథరూపం మల్లియ కావచ్చును కద?

      తొలగించండి
    2. శ్యామలీయం గారు,

      మీరు గ్రాంధికంళొని ఎకారాంతాలు గ్రామ్యంలో ఇకారాలుగా మారిన సందర్భాలు చూపారు తప్ప తద్విరుద్ధంగా కాదు. గ్రాంధిక భాషలోని పల్లె, మల్లె గ్రామ్యంలో పల్లి, మల్లి అనే కాదు, రకరకాల ప్రాంతాల వారు అనేక రకాలుగా పలుక వచ్చును. కాని "పల్లె", "మల్లె" అన్న పదాలు సరి కాదు, "పల్లి", "మల్లి"... ఈ పదాలే కరెక్టు (మేం వాడుతున్నాం కాబట్టి) అని ఎవరైనా అంటే ఎలా వుంటుంది?

      అలాగే చెప్పాలె, చెప్పాలి అన్న పదాలు రెండూ వికృతాలే అయినప్పటికీ చెప్పాలె అన్నది గ్రాంధికంలోని "చెప్పవలె" కి దగ్గరగా వుందన్న విషయం మీరూ ఒప్పుకున్నారు. కాని ఇప్పటికీ "చెప్పాలె" అన్నది శిష్ట వ్యావహారానికి నోచుకోలేదన్నది గమనార్హమైన విషయం. బహుషా జిలేబీ గారికి కూడా ఆ పదం అందువల్లనే విచిత్రంగా తోచి ఎత్తి చూపారు.

      అక్కడ జరిగిన చర్చ కొన్ని పదాలు గ్రాంధికానికి దగ్గరగా ఉన్నప్పటికీ ఎందుకు తృణీకారానికి గురయ్యాయన్నదాని గురించి మాత్రమే. నాకు తెలిసి అక్కడ భ్రష్టు అన్న పదం ఎవరూ వాడలేదు. మీరు మాత్రమే ఇక్కడ రాశారు.

      ఇక్కడ మీరు చెప్పిన సామ్యం దానికి సరైన సమాధానంగా అనిపించడం లేదు. ఎందుకనగా "మల్లి" అని ఒక ప్రాంతం వారు అన్నా "మల్లె" అన్నది కూడా గ్రాంధికానికి నోచుకుంది తప్ప తిరస్కారానికి గురి కాలేదు. కాని "చెప్పాలి" అన్న పదంపై దానికన్నా దగ్గరితనం కలిగిన "చెప్పాలె" వీగిపోయిందన్న విషయం గుర్తించ గలరు. ఫనీంద్ర గారు అదే భావాన్ని వ్యక్తీకరించారు.

      తొలగించండి
    3. ( పూర్వానుభవాలను దృష్టిలో ఉంచుకొని మీ వ్యాఖ్యను ప్రచురించటానికి కొంత సంశయించిన మాట వాస్తవం. కాని విషయసంబంధమైన వ్యాఖ్యలను పరిహరించటం నా ఉద్దేశ్యం ఎన్నడూ కాదు కాబట్టి ప్రచురించటానికే మొగ్గుచూపాను. )

      వ్యవహారభాషలో ఉన్న పదకోశంలోని పదాలు సంప్రదాయ గ్రంథభాషలో ఒదగకపోయే సందర్భాలే హెచ్చు. సందర్భానుగుణంగా వాడుక చేయటం ఉచితం. ఒకటి ఒప్పనీ మరొకటి తప్పనీ అనటం సులభం కాదు - వాంఛనీయం కూడా కాదు.

      వ్యవహారభాషలో పదాలు ప్రాంతీయతను అనుసరించి మార్పులు చేర్పులతో ఉంటాయని శ్రీమూర్తి సూచించినది గమనించే ఉంటారు. కొన్ని పదాలకు ఎక్కువ ప్రాచుర్యం రావచ్చును, కొన్ని పరిమితమైన ప్రాంతాల్లో వాడుకలో ఉండవచ్చును. ఇందులో ఆధిపత్య ధోరణుల ప్రసక్తి అనవసరం అని నా అభిప్రాయం. సమాచారవ్యవస్థ నేడున్నంత విస్తృతంగా లోగడ లేదు కాబట్టి ప్రాంతీయపదజాలం వ్యాప్తి తక్కువగా ఉండేది. క్రమంగా విస్తరణ పెరగటం భాషకు మంచిదే. ఇందులో అభిమనాలూ దురభిమానాలూ మనకు వధ్దు, కాలం గడిచినకొద్దీ ప్రజలనోటిలో నిలిచేవి నిలుస్తాయి - అంతే. పోటీలూ వీగిపోవటాలూ వంటి భావనలవలన చెరుపే హెచ్చని భావిస్తున్నాను.

      నేను భ్రష్టు అన్నపదం వాడానని ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ఫణీంద్ర గారు వికృతం అన్నారు కదా? దౌర్భాగ్యం అన్ నపదమూ వాడారు కదా? సందద్భాన్నీ విషయాన్నీ మాత్రమే గణించి చర్చించుకోవాలి. అంతే. నాది ఏదో ఒక మాట పట్టుకొని మీరు దయచేసి చర్చను పెంచటానికి యత్నించవద్దు.

      తొలగించండి
  2. Sir, you have expressed your views in a balanced and logical manner. It is disappointing that Dr. Phaneendra sir who is a scholar is still in the divisive mindset.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరు ఫణీంద్రగారిది divisive mindset అంటున్నారు. అటువంటిదేమీ లేదనే అనుకుంటున్నాను. తమతమ ప్రాంతపు ఆచారభాషావ్యవహారాల పట్ల కొంత ఎక్కువ మక్కువ ఉండటం తప్పేమీ కాదు. వారు నేటి వ్యవహారభాష దుష్టపదభూయిష్టంగా ఉందని దానికంటే తెలంగాణా నుడికారంలోనే తెలుగు మరింత మధురంగా ఉందనీ అభిప్రాయపడు తున్నారు. వారి అభిప్రాయం వారిది. మీకైనా నాకైనా మరెవరికైనా సరే ఆయన అభిప్రాయాలతో విబేధం ఉన్నచోట్ల తప్పక అభ్యంతరం చెప్పవచ్చును. సలక్షణంగా చర్చించుకో వచ్చును. వ్యక్తిత్వం గురించీ మనస్తత్త్వాల గురించీ సూటి వ్యాఖ్యల వలన రవరవల రేగటం తప్ప రవంతైనా లాభం ఉండదు కదా.

      తొలగించండి
  3. GKK garu!

    Discussion should be done point wise properly, when a discussion is raised. Otherwise discussion should not be raised. I expressed my views in my post in my blog. Then this discussion was raised by one after the other. After starting the discussion, one can not leave the points and start talking about personalities. I think one who can not stand in the discussion, will start Personal Attacking. And it is wonder .. People like you don't find any fault with the arrogance and attitude of people like DG. Sir .. What has happened is History now. One can not hide the facts of History by just saying "Mindset".

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫణీంద్రగారూ, DG గారి వ్యాఖ్యను వారి అభిమతం మేరకే తొలగించటం జరిగింది.
      మీరు వ్రాసిన ఆ టపాపై వేరు చోట్ల చర్చ నడుస్తున్నదేమో నాకు తెలియదండి. ఒకవేళ నా దృష్టికి వచ్చి యున్నా కూడా విపులంగా చెప్పవలసి యున్న కారణంగా ఇలా నా అభిప్రాయాన్ని ఒక టపాగానే చెప్పవలసి యుండేది. మీరు గమనించారో లేదో తెలియదు. నేను బ్లాగుల్లో తిరుగుతున్నది లే దీమధ్యన. వ్యాఖ్యలను వ్రాయటమూ ఈ సంవత్సరారంభం నుండే మానుకున్నాను. మీకు వినమ్రంగా మరొకసారి విన్నవించవలసిన విషయంగా భావించి చెప్పేది ఒకటే, విషయానికి కట్టుబడే నా ఖండనావ్యాసం ఉన్నది కాని వ్యక్తిగతంగా మిమ్మల్ని విమర్శించలేదు. ఈ విషయంలో అందరినీ తమతమ వ్యాఖ్యలను హుందాగా వ్రాయమని అర్థిస్తున్నాను.

      తొలగించండి
  4. ప్రాంతీయ వ్యవహారిక భాష వివరాలలోకి వెళితే సీమాంధ్ర అనే పద ఔచిత్యం కుడా ప్రస్నార్ధకమే కదా !!!! వ్యావహారికం లో ఒకే పదాన్ని సీమ లో ఒక రకంగాను కోస్తాంధ్ర లో ఒకరకం గానూ పలికే మాటలు ఎన్నో ఎన్నెన్నో !!!!కోస్తాంధ్ర లో కూడా మళ్ళి కోనసీమ భాషా యాసా వేరు కాదా !!! అలాగే శ్రీకాకుళం ప్రాంతం !! ఇలా విశ్లేషిస్తే ఇటువంటి పదజాలాలు ప్రాంతానికి ఒకో రకంగా కనబతాయి !!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవును నిజమే. ఒకచోట చేతబడి అంటే దాన్నే మరొక చోట చిల్లంగి అంటున్నారు. మరొకచోట దానినే బాణామతి అంటున్నారు. ఇలా మాటలు వేరువేరుగా ఉండవచ్చును. ఒకే మాట పలికినా వేరువేరు ప్రాంతాలలో ఉండే యాస కారణంగా ఆ మాట విభిన్నంగా ధ్వనించవచ్చును.

      తొలగించండి
  5. శ్యామలీయం గారు!
    మీ మీద నా కెటువంటి ఆక్షేపణ లేదు. టపాలో నేను నా అభిప్రాయాలను తెలియజేసినట్లే, మీరు మీ అభిప్రాయాలను తెలియజేసారు.పరస్పాదరం మన మైత్రికి ఎటువంటి అడ్డంకి కల్పించదు. నేను తీవ్రంగా స్పందించింది DG గారి అవహేళనకరమైన వ్యాఖ్య వలన. మీరు ఆయన వ్యాఖ్యను తొలగించి ఆయనకు మాన సంరక్షణ చేసారు.ఇక ఈ చర్చ కొనసాగించడంలో ఔచిత్యం లేదు. స్వస్తి!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫణీంద్ర గారూ, మీతో ఏకీభవిస్తున్నాను. అభిప్రాయాలు పంచుకోవటం జరిగింది. ఇరువురకూ సంతోషమే. ఇంకా చర్చించవలసినది ఏమీ లేదన్న మీ మాట యదార్థం.

      ** పాఠకమిత్రులారా, చర్చ ఇంతటితో ముగిద్దాం. **

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.