సుమశీ యస్వీర్ గారి బ్లాగులో ఈరోజున మాతృభాషను సేవించి మనగదయ్య అన్న సందర్భోచితమైన వ్యాసం చూసాను.
ఆయన ఒక పద్యం ముగింపులో 'దేవభాషాపుత్రి తెలుగుభాష' అన్నారు. అలా అనటం అంత సముచితం కాదేమోనని నా సందేహం. ఈ విషయం లో ఒక వ్యాఖ్య వ్రాద్దామని మొదలు పెడితే, ఇదిగో ఇలా ఒక టపాగా తయారై కూర్చుంది.
తెలుగునిండా సంస్కృతం మమేకం కావటానికి అప్పటి దేశకాలపరిస్థితులు కారణభూతం అయ్యాయి. అందుకు మనం సంతోషిస్తున్నాం. తెలుగు స్వయంప్రతిపత్తి కల భాష. ఇలా సంస్కృతమయం కావటం వలన ఎంత లాభం కలిగిందీ అని కొందరూ ఎంతోనష్టం జరిగిందని కొందరూ అంటూ ఉంటారు.
తెలుగు నిండా ఇప్పుడు ఇంగ్లీషు నిర్ధాక్షిణ్యంగా దూరిపోతోంది. ఒకప్పుడు, ఎంత నిర్ధాక్షిణ్యంగా అనండి ఎంత దయతో అనండి ఎలా సంస్కృతం మన తెలుగును ఆవరించుకుందో అచ్చం అలాగే. ఈ రోజున మన పలుకబడులన్నీ ఆంగ్లీకరించబడుతున్నాయి.
అన్నం అనటం బదులు హోటళ్ళవాళ్ళు రైస్ అంటారు చూసారూ. అది ఇప్పుడు అందరి ఇళ్ళల్లోనూ జోరుగా ఉంది. మంచినీళ్ళు అనటం బదులు పిల్లామేకా అంతా ఇంట్లో కూడా వాటర్ అనేస్తున్నారు అలవోకగా. పాఠశాల అన్న మాటనో లేదా బడి అన్న మాటనో మీరు విని ఎన్నాళ్ళైనదో తెలియదు - నేను ఈమధ్య ఎప్పుడూ వినలేదా మాటలు - అందరూ స్కూల్ అనటమేను.
ఇలా తెలుగు ఆంగ్లీకరణకు లోను కావటం తెలుగువాళ్ళకు పెద్దగా మనస్సుకు పట్టటం లేదనే చెప్పాలి. ఐతే నాబోటి ఛాందసులం బాధపడుతూ అందుకు తీవ్రంగా కలత చెందుతున్న మాట మాత్రం కఠిన వాస్తం. దానికి ఋజువు ఏమిటంటే ఈ మాటలు వ్రాస్తున్న సమయానికి కొద్ది నిముషాల ముందే నేను లోలకం బ్లాగులో వ్రాసిన ఒక వ్యాఖ్యయే. అది ఇలా ఉంది.
మిత్రులు వేమూరి వారూ, మీ సుదీర్ఘమైన ఈ టపాను చదివిన తరువాత కన్నీళ్ళు వచ్చాయి. ఏం చేస్తాం ప్రస్తుతం తెలుగు దశాదిశా ఏమీ బాగో లేవు. రేపోమాపో మరోసారి దేవుడు భూమ్మీదకు పంపేటప్పుడు, తెలుగువాడిగా పుట్టే అవకాశం గురించి ఆలోచిస్తే, ఇద్దామన్నా ఆయనకూ, అడుగుదామన్నా నాకూ, అది ఉండే అవకాశం ఉండదనే బెంగగా ఉంది. ఇకొంచెం కాలానికే తెలుగు అనే భాష ఉండేది అని వేరే భాషల్లో పుణ్యాత్ములు జాలిగా తలచుకొనే పరిస్తితి కదా. మీరు పోతన అంటున్నారు - ఈ కాలం పిల్లలకు అల్పుడెపుడూ పల్కు అంటూ వేమనపద్యం చెప్పినా ఒక్కముక్కా అర్థం కాదు! నా చిన్నతమ్ముడి కూతురు ఇంకా చిన్నపిల్ల - ఆమధ్య ఏనుగంటావేం ఎలిఫెంట్ అని చెప్పొచ్చు కదా అంది ఒక సందర్భంలో. ఇంకేం తెలుగు! ఇంక మనమే మన తెలుగును మర్చిపోకుండా వీలైనంతగా మననం చేసుకొని (మనలో మనమే మాట్లాడుకొని) సంతోషించాలి. కొబ్బరినీళ్ళు ఎవడిక్కావాలీ కోకాకోలా తప్ప, అమృతం ఎవడిక్కావాలి అరకప్పు కాఫీ తప్ప!
-తాడిగడప శ్యామలరావు.
చూసారు కదా నాకెంతగా ఈ ఆంగ్లీకరణం క్షోభను కలిగిస్తోందో. వేమూరి వారి వ్యాసం కూడా చదవండి మా బాధ మరింతగా అవగతం అవుతుంది.
విషయానికి వస్తే తెలుగును ఆంగ్లం విజృంభించి ఆక్రమించటం కనీసం మాబోటి గాళ్ళకు నచ్చటం లేదు.
అలాగే ఒకప్పుడు తెలుగులో సంస్కృతం ప్రవేశించి ఇంతింతై వటుడింతయై అన్నట్లుగా త్రివిక్రమావతారం ఎత్తి చివరకు తెలుగుకు సంస్కృతమే తల్లిభాష అనే నమ్మిక రూఢి అయింది. చివరికి అంతా జనని సంస్కృతంబు సకలభాషలకును అనటం మొదలెట్టారు.
శ్రీనాథమహాకవి నిర్మితిగా ప్రసిధ్ధిలోఉన్న క్రీడాభిరామంలో
జనని సంస్కృతంబు సకలభాషలకును
దేశభాషలందు తెలుగు లెస్స
జగతి తల్లికంటె సౌభాగ్యసంపద
మెచ్చు టాడుబిడ్డ మేలుకాదె
అని ఒక పద్యంఉంది. నిజానికి క్రీడాభిరామం వ్రాసింది వినుకొండ వల్లభ రాయడు. అది వేరే సంగతి.
ఈప్రద్యం విశేషప్రచారంలోనికి తెచ్చిన వ్యవహారం ఈ జనని సంస్కృతంబు సకలభాషలకును అన్నది.
అందరమూ తెలుగుకు సంస్కృతం మాతృభాష అని దాదాపు గుడ్డిగా నమ్మే పరిస్థితి.
ఏమో మరొక వందేళ్ళు పోతే ఆ జనని స్థానం నుండి సంస్కృతాన్ని గెంటివేసి ఆంగ్లభాష తిష్ఠవేస్తుంది. తస్మాత్ జాగ్రత.
తెలుగు కూడా పూర్తిస్థాయి భాషయే. దాని నెత్తిమీదకు మరొక భాషను - అదెంత గొప్పదైనా - అదెంత పరమపవిత్రదేవభాషయైనా సరే కూర్చో బెట్టటం అవసరం కాదు. అలా కూర్చోబెట్టి అదే తెలుగుకు తల్లి అనటం ఒప్పుకోను.
సంస్కృతంవలన తెలుగు పరిపుష్టం కావటం గురించి చర్చించటం లేదు. రేపు ఇంగ్లీషు పదాలవరద వలన తెలుగుకు అంతర్జాతీయస్థాయి వచ్చిందన్న ఉపన్యాసాలు భావితరాలు చేస్తాయేమో అన్నదీ ఆలోచించమంటున్నాను.
నాకు తెలుగుఛందస్సులు ఇష్టం అంటే ఒక ప్రముఖుడు నాతో అవంత బాగుండవండీ, సంస్కృతవృత్తాల్లో వ్రాస్తేనే తెలుగు కవిత్వంబాగుంటుంది' అన్నారు.
సంస్కృతంపొందిన స్థితినో ఇంగ్లీషుపొందబోతున్న స్థితినో ద్వేషించమని నేను చెప్పటం లేదు.
తెలుగు అనేది స్వయంగా ఒక భాష. అది మన అమ్మభాష. ఆసంగతిని మాత్రం మరవకండి ప్లీజ్ అంటున్నాను. అమ్మభాషను బ్రతికించి ఉంచుకుందుకు మీరు ఏమిచేయగలరో ఉడతా భక్తిగా అది చేయటాని ప్రయత్నించండని బ్రతిమాలుతున్నాను. నాకైతే ఆట్టే అశల్లేవనుకోండి. ఐనా అడగటంలో తప్పులేదు కదా.
xxxxxx
"నమస్తే మా ఇస్కూలు బాషా దివస్ కి ఒచ్చినందుకు. ఇప్పుడు ఓ పిల్లగాడు తెలుగులో మాటాడతానని సంబరం పడిపోతన్నాడు. రెండో వాడు పాట పాడతాడు. అదైనాక పలారం చేసి ఎలిపోదురుగాని. అరే, తెలుగులో మాటాడ్రా..."
రిప్లయితొలగించండి"బారద్దేశం నా జన్మ బూమి. ఈళ్లందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిత్తన్నాను. ..."
"గబ గబా చెప్పాల్రా నాయనా... కానీయ్, కానీయ్..."
"... న దేసం పట్లా పెజల పట్లా సేవా నిర్తి ఉంటాదనుకుంటన్నాను. ఈరి చేమమే న అబివ్రుద్దికి మూలకారణము. ఇదే నా ప్రతిగ్నా! వందే మాత్రం. వందే మాత్రం."
"ఒరే ఆ రెండో కుర్రాడేడిరా పాట పాడమను."
"బాస్ ఈజ్ బేక్… గెట్ రడీ ఫర్ డెడ్లీ డేన్స్… గెట్ రడీ
హొయ్…రత్తాలు రత్తాలు ఓసొసి రత్తాలు.. నిను చూస్తే నిలబడనంటాయ్ నా చొక్కా బొత్తాలు…. రత్తాలు రత్తాలు ఓసొసి రత్తాలు.. నిను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు
… అందం చందం చెంగుమంటూ రావే తిరగరాసేద్దాం చట్టాలు నేర్చుకుంటే నేర్పుతాలే కొత్త కొత్త చిట్కాలు..
.. రావే రావే రత్తాలు.. … నా రొమాన్స్ చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు…
… బాస్ ఈజ్ బేక్ గెట్ రడీ …..
యే…మై డియర్ బాస్ నువ్వు మాస్ ప్లస్ క్లాస్ నీ స్టైలు చూస్తే సింహమైనా నీతో దిగదా సెల్ఫీలు…
హే…..మిస్ యూనివర్స్ లాంటి నీ ఫీచర్సు చూస్తూ వుంటే రెచ్చిపొతాయ్ గుండెలోన గుర్రాలు…
నీ వాక్ చూస్తే ఓరయ్యో ఐ లూజ్ మై కంట్రోలు… నీ హీటు వుంటే చాలమ్మో… ఇక ఎందుకు పెట్రోలు…
నాకు నువ్వు నీకు నేను అప్పచెబుదాం పాఠాలు…
మాస్ డేన్స్ చేసేద్దాం రావే రావే…
హొయ్…రత్తాలు రత్తాలు ఓసొసి రత్తాలు.. నిను చూస్తే నిలబడనంటాయ్ నా చొక్కా బొత్తాలు…. రత్తాలు రత్తాలు ఓసొసి రత్తాలు.. నిను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు ….
రత్తాలు …. రత్తాలు …
బాస్ ఈజ్ బేక్ గెట్ రడీ , గెట్ రడీ ….."
"ఈ సబకి ఒచ్చినందుకు నమస్కారం. తెలుగిలా ఎలిగిపోతావుంటే ఎవడయ్యా తెలుగు బాలేదని అరిచేటోడు? దమ్ములుంటే రమ్మనండి ముందుకి.. వినదభీషన శంఖము దేవదత్తమే!"
మేరా భారత్ మహన్! భారత్ ఎలిగిపోతా వుంది!
నిర్ధాక్షిణ్యంగా OR నిర్దాక్షిణ్యంగా ???
రిప్లయితొలగించండిశ్యామలరావు గారు, సమయోచితమైన వ్యాసం. మీ నిర్వచనం ప్రకారం నేను కూడా భాష విషయంలో ఛాందసున్నే. తెలుగు పోతోందని ఉంటోందని అనేవాళ్ళు అన్నివేళలా ఉన్నారు. మీ పుణ్యామా అని మరి కొన్ని వ్యాసాలు చదివేను (రావు వేమూరి గారిది, సుమనశ్రీ గారిది). అన్ని ఉపయుక్తంగా ఉన్నవే, మరో కోణాన్ని ఆవిష్కరించేవే. బలవంతంగా దేన్నీ, ప్రత్యేకంగా భాషని మనం నిలుపుకోలేమని నా వరకు నేను నమ్మినది. భాష జీవాధార. ప్రవాహంలో అన్ని వచ్చి చేరుతాయి, కొన్ని కలిసి మిళితమయిపోతాయి, మరికొన్ని విడివడి కొట్టుకుపోతాయి. వాటిని స్వీకరించటమే మనకు మిగిలింది.
రిప్లయితొలగించండిగురువు గారూ (గతంలోలా మాస్టారూ అందామనుకున్నా కానీ అది తెలుగు కాదని గుర్తు వచ్చింది):
రిప్లయితొలగించండిసంస్కృతం తెలుగుతో సహా అనేక (అన్నీ కాకపోవొచ్చు) భారతీయ భాషలకు మాతృక అనే వాదన తెలుగుకు పూర్తి స్థాయి భాషగా గుర్తింపుకు అడ్డం కాదని నా అభిప్రాయం. ఒక భాష మరో భాష నుండి ఉద్భవం చెందవచ్చును కదా: ఈ విషయాన్నే తల్లి స్థానం అనటం "కూతురు భాష"ను చులకన చేసినట్టు భావించడం సబబు కాదేమో.
ప్రస్తుతం ప్రపంచంలో వాడుకలో భాషలన్నీ కొద్దో గొప్పో పరభాషా పాదాల జొరబడి వలన "కాలుష్యం" అయినవే. అరువు పదాల ప్రభావం వ్యాకరణం లాంటి వాటి మీదా పడ్డ సందర్భాలు కోకొల్లలు. ఉ. జర్మన్ భాషలో der floppen బదులు floppies అంటారు. అలాగే జాపానీ భాషలో "మాతృక" చైనీ పదాలకు ఒకటి, అచ్చ జాపానీ పదాలకు మరొకటి & ఇటీవలి అరువు పదాలకు ఇంకొకటి మొత్తం మూడు లిపులు ఉన్నాయి.
తెలుగులో అచ్చ తెనుగు కాక సంస్కృతం, తమిళం (లేదా మరో ద్రావిడ మూల భాష) & ఉరుదూ పదాలు రావడం భాష సొగసు పెరిగిందనే నా అంచనా. ఇప్పుడిప్పుడు పెరుగుతున్న ఆంగ్ల ప్రభావం కూడా కాలక్రమేణా "పరాయి స్వభావం" పోయి తెలుగులో "పూర్తి విలీనం" చెందుతుందని ఆశిద్దాం.
PS: తెలుగు గురించి పైని చెప్పినవి (కొద్దిపాటి తేడాలతో) ఇతర భారతీయ భాషలకు కూడా వరిస్తాయి.
తెలుగు భాష కడుకమ్మనైన భాష. మన భాష.
రిప్లయితొలగించండి