1, ఆగస్టు 2017, మంగళవారం

నను నేను తెలియుదాక

నను నేను తెలియుదాక నిను నేను తెలియలేను
నిను నేను తెలిసితినా నేనేలేను

వెనుక నేను లేనే లేనని విని యుంటి నీవలన
కనుక నేను కలిగిన దెపుడో కనుగొన వలయును
మునుముందు నేనేమై పోవుదునో యెఱుగనయా
నను నేను తెలియలేని మనుజవేష మెందుకయా

ఇదిగో యీ‌యాట నీవే మొదలు పెట్టినావు కాదా
మొదలు తుది లేని యాట వదిలేది లేదు కాదా
అదనుచూచి యాట కీలక మంతా పసిగట్టాలంటే
అది నన్ను నేను తెలియునంత దాక కుదరదయా

తగ్గని పంతాలవాడా నెగ్గిన పందాలవాడా
సిగ్గరివలె దాగ నేలా ముగ్గులోకి  నీవూ రారా
లగ్గుగ నను నేను తెలిసి యొగ్గెద నన్నే రారా
నెగ్గే నీలోన కలిసి నెగ్గువాడ నగుదును రామ


3 కామెంట్‌లు:

  1. అన్నీ తెలుసుకొంటిననుకొంటిని
    నిను తెలియగలననుకొంటిని
    తెలిసింది ఇసుమంతని
    తెలియనిది మిన్నులకావల ఎంతో వుందని
    ఈనాడే తెలిసినది - ఈ తెలివిడి తిరమయినది

    రిప్లయితొలగించండి
  2. తన ఉనికి యొక్క పరమ సత్యం కనుగొని, తానెవ్వరో తెలుసుకున్న జీవి, పరమాత్మను అంతర్ముఖుడై దర్శించగలడు.తానన్నది మిథ్య అని గ్రహించి, తర తమ భేదాలు విడిచి, సర్వాంతర్యామి అగు దేవదేవుని లో లీనమై అలుపెరుగని నిత్యానందం లో మునిగి తరించగలడు. చాలా బాగుంది కీర్తన.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.