9, జనవరి 2015, శుక్రవారం

తెలుగుభాషకు పడుతున్న దుర్గతిని గమనించండి.

మన తెలుగుభాష దుస్థితి ఎలా ఉందో తెలిపేందుకు ఉదాహరణగా నిలిచే సంఘటన ఒకటి నిన్న రాత్రి నాగార్జున నిర్వహిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు అనే షోలో తటస్థించింది.

నిన్నరాత్రి షోలో అభ్యర్థిగా పాల్గొన్న ఒకాయన పేరు లక్ష్మీనారాయణగారు.

ఆయన తెలుగులో డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు. అయన పరిశోధించిన అంశం కరీంనగర్ జిల్లాలో భజన సంప్రదాయాలు.

ఆయనకు వచ్చిన ప్రశ్నల్లో కొన్ని అయనను ఇబ్బంది పెట్టాయి. ఆ ఇబ్బందులేమిటో మీరే చదివి ఆనందించండి!

తెలుగు అక్షరాలలో  గ జ డ ద బ లను యేమని పిలుస్తారు?

మొదటగా లక్ష్మీనారాయణగారిని ఇబ్బంది పెట్టిన ప్రశ్న ఇది.  నిజానికి యీ ప్రశ్నకు యే పాఠశాలావిద్యార్థి ఐనా జవాబు చెప్పగలడు. కాని డాక్టర్ లక్ష్మీనారాయణ అనిపించుకున్న మహనుభావుడికి జవాబు తెలియలేదు. సూచించబడిన నాలుగు సమాధానలలో సరైనదీ తప్పక ఉంటుంది, ఉంది కూడా. కాని యీయన తికమక మకతిక పడిపోయి, చివరికి స్టూడియోలో ఉన్న ప్రేక్షకులను సూచించమని లైఫ్ లైన్ అడిగాడు. వారి చలువతో, గండం గడిచి చివరకు గజడదబ లను సరళములు అంటారు అని గ్రహించి అదే జవాబుగా ఇచ్చారు. నాగార్జున ఆశ్యర్యపోయి ఈయనకు ఎందుకు ఇబ్బంది వచ్చిందన్నట్లు అడిగితే, నాకు తెలుసును కాని ఎందుకో తికమకపడ్డానని చెప్పారు.

కొద్ది సేపటికి మరొకప్రశ్న వచ్చింది మరికొంచెం ఇబ్బంది పెట్టటానికి.

యుధిష్టిరుడికి అజ్ఞాతవాసంలో ఉన్నప్పటి పేరు యేమిటీ?

ఈ ప్రశ్నకు ఆలోచించి అలోచించి సరిగ్గానే అక్కడ ఉన్న ఆప్షన్ 'కంకుభట్టు' అన్నది ఎన్నుకున్నారు డాక్టర్ గారు.  ఆ 'కంకుభట్టు' అంటే అర్థం యేమిటంటే జూదం ఆడేవాడు కాబట్టి కంకుభట్టు అన్న పేరు అని చెప్పారు! అవునా? ఎక్కడా వినలేదు!

నిజానికి 'కంకుభట్టు' కాదు 'కంకభట్టు' అన్నది సరైన పదం. ఈ సంగతి డాక్టర్ లక్ష్మీనారాయణగారికి తెలియదు!  కంకము అన్నదానికి సంస్కృతంలో పద్మము అనే అర్థం ఉంది. భట్టు అన్నది సరే భట్టువంశీకుడన్నది సూచించే పదం అనుకుంటే అది ఒక ముని, పండితుడు అన్న అర్థాన్నిచ్చే పదం. నన్నయ భట్టారకుడు లేదా నన్నయ భట్టు అన్నదానిలో భట్టు పదం ఇటువంటిదే. అగ్నిభట్టారకుడనే మాటకూడా వాడుకలో ఉంది. కాబట్టి భట్టారక లేదా భట్ట శబ్దం శ్రేష్టతా వాచకం. కాబట్టి,  ఈ కంకభట్టు అనే పదం పండితశ్రేష్ఠుడు అన్న అర్థం ఇస్తుంది. ఈ మహానుభావుడికి ఇలాంటి విషయాలేమీ తెలిసినట్లు అనిపించదు.

మన డాక్టరేట్ యోగ్యతాసన్మానితుణ్ణి ఇబ్బంది పెట్టిన ముచ్చటైన మూడవపశ్న.

బుచ్చిబాబు అన్న కలంపేరుతో ప్రసిధ్ధుడైన రచయితగారి నిజమైన పేరు ఏమిటి?

దీనికి సమాధానంగా సూచించబడిన పేర్లు శివరాజు వెంకట సుబ్బారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి,  శ్రీరంగం శ్రీనివాసరావు, మరొకాయన-పేరు-గుర్తు-లేదు

మన డాక్టర్ లక్ష్మీనారాయణగారు బోర్లా పడిపోయారీ ప్రశ్నకు. దేవులపల్లి కృష్ణశాస్త్రి కాదు,  శ్రీరంగం శ్రీనివాసరావు కాదు, ఆ మరొకాయనా కాదు అనుకున్నాడు - అదీ అనుమానం గానే. కాని శివరాజువారు అవునా కాదా అన్నది తెలియలేదు. చివరకు ఆటను విడిచిపెట్టేశారు.

మీరు మిగతా ముగ్గురూ కాదనుకున్నారు కదా, బుచ్చిబాబుగారి ప్రసిథ్థమైన పుస్తకం 'చివరకు మిగిలేది' లాగా ఇక్కడా 'చివరకు మిగిలేది' శివరాజు వెంకట సుబ్బారావు అన్నదే సరైన సమాధానం అని నాగార్జున చమత్కరించాడు. మీరు తెలుగు సాహిత్యంమీద రీసెర్చి చేసారు కదా ఎందుకని ఇబ్బంది కలిగిందీ అని అడిగితే మన హీరోగారు చెప్పిన సమాధానాలు చూడండి.

శివరాజు వెంకట సుబ్బారావు గారి గురించి తెలియదు.
బుచ్చిబాబు అన్న పేరు ఎప్పుడూ వినలేదు.
'చివరకు మిగిలేది' అనే నవలపేరు ఎన్నడూ వినలేదు.

ఇదండీ, మన తెలుగుభాషలో, అందులోనూ సాహిత్యరంగంలో పరిశోధనచేసి డాక్టరేట్ పుచ్చుకున్న మహావీరుడు చూపిన ప్రజ్ఞ.

ఇలాంటి వారిని చూసి నవ్వాలా?
ఇలాంటి వారికి కూడా డాక్టరేట్ పట్టాలు ఎలా వచ్చేస్తున్నాయని ఆశ్యర్యపోవాలా?
ఇలాంటివారు తెలుగు లెక్ఛరర్లుగా విద్యార్థులకు జ్ఞానప్రదాతలుగా ఎలా వెలుగుతున్నారో అని ఆవేదనపడాలా?
మన తెలుగు భాషకు పడుతున్న దుర్గతిని చూసి ఏడవాలా?

మీరే చెప్పండి.

26 కామెంట్‌లు:


  1. శ్యామలీయం వారు పాత కాలం లో ఉన్నారు ! డాక్టరేట్లు 'రేట్ల' తో వస్తాయని ఈ కాలం లో తెలియకుండా ఉంటె ఎట్లా మరి !!

    ఇంతకీ బుచ్చి బాబు ఎవరండీ ??!!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బుచ్చిబాబు గురించి గూగుల్ సెర్చ్ చేయండి ప్రస్తుతానికి.

      తొలగించండి

  2. అబ్బే,

    గట్లా, నిఖార్సైన జవాబిస్తే సరి పోదండీ ! చివరకు ఏమీ మిగలదు !!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చేతినిండా పనియుండే నిండాపనివేళ కదా, దయలుంచండి. వీలు వెంబడి వివరాలు చూదాం.

      తొలగించండి
    2. అదన్నమాట శ్యామలీయం గారు. నేటి పండితులు, పంతుళ్లు ఎలా ఉంటున్నారో చూశారుగా! మరి గురుముఖంగా అంటే ఇలాంటి గురువుల ముఖంగా నేర్చుకుంటున్నారు కాబట్టే తెలుగు భాష పిల్లకాయలకు అలా అబ్బుతున్నది. అందుకే మీరు ఎప్పుడూ తప్పులు దిద్దాల్సి వస్తోంది. ఇంతక్రితం ఇదే షోలో నకుల సహదేవులలో సహదేవుడు పెద్దవాడని నాగార్జునే చెప్పారు.

      తొలగించండి
    3. అవును. ఈ‌విషయమూ లోగడ ప్రస్తావించినట్లున్నాను. నాగార్జునకు మాత్రం తెలుసునా బడాయి కాకపోతే. నిర్వాహకులు స్క్రీన్ మీద చూపించినదే మాట్లాడతాడు తన వాక్యాల్లో. అంతే,

      తొలగించండి
  3. మంచి టపా శ్యామలీయంగారు. ఘాటుగా ఉంది.

    రిప్లయితొలగించండి
  4. శ్యామలరావు గారూ, ఈ నాటి తెలుగు భాష గతి బాధాకరంలెండి.
    ఇక "కంకుభట్టు" పేరుకి మీరు ఇచ్చిన సవరణ గురించి - పురిపండా అప్పలస్వామి గారు వ్రాసిన వ్యావహారికాంధ్ర మహాభారతం లో కంకుభట్టు అనే పేరే చదివినట్లు గుర్తు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ విషయం కోంచెంలోతుగా పరిశీలించదగినదండీ. కంకశబ్దం ఉంది కాని సంస్కృతంలో కంకు శబ్దం ఉన్నట్లు లేదు. భాగవతం మూలంలోనూ‌ ఆభీర కంకా యవనాః కషాదయః అంటే ఉండనే ఉంది. ఎప్పుడు కంకు శబ్దంతో మరేమీ వినలేదు. ఈ కంకుభట్ట శబ్దం కంకభట్ట అనే అనుకుంటున్నాను. తిక్కనగారూ విరాటుడినోట ఏమిది కంక అని అనిపిస్తారు. ఐనా ఇంకా పరిశీలిస్తాను. జనం నోట కంకుభట్టు అన్న ప్రచారంగా ఉన్నది నిజమే. పురిపండా వారిని నేను చదువలేదు.

      తొలగించండి
    2. "కంక" యే సరైన పదం అనుకుంటానండీ.

      మూల శ్లోకం ఇదీ, గూగుల్ లో దొరికింది.

      युधिष्ठिरस्यासम अहं पुरा सखा; वैयाघ्रपद्यः पुनर अस्मि बराह्मणः
      अक्षान परवप्तुं कुशलॊ ऽसमि देविता; कङ्केति नाम्नास्मि विराट विश्रुतः

      "కంకేతి నామ్నాస్మి" అని చెపుతున్నాడు యుధిష్ఠిరుడు.

      తొలగించండి
    3. ధన్యవాదాలు శ్రీకాంత్ చారిగారూ,

      నా దగ్గర కవిత్రయభారతమూ లేదు, వ్యాసభారతమూ లేదు శోధన చేయటానికి. కంక శబ్దాన్ని తిక్కనగారు ప్రయోగించిన ఒకటిరెందుచోట్లు కచ్చితంగా గుర్తున్నాయంతే. .

      కాని 'కంకుభట్టు అన్నమాటకు జూదం ఆడేవాడు అని అర్థం' అని ఒక తెలుగు డాక్టరేట్ గారు చెప్పటమూ, దానికి ప్రతిస్పందనగా నాగార్జునగారు 'అవునులెండి ఆయనకు అంతకంటే యేమీ చేతనౌను' అని నవ్వటమూ నాకు తిక్కపుట్టించాయి.

      తొలగించండి
    4. కవిత్రయంలో చూసి చెబుతా, నా దగ్గరుంది.

      తొలగించండి
    5. కవిత్రయంలో కంకుడు అనే ఉందండి.

      తొలగించండి
    6. శ్యామలీయం గారు,

      మీకు తీరిక, ఓపిక వుంటే మొత్తం వ్యాస భారతాన్ని ఇక్కడ పరిశోధించ వచ్చు.

      తొలగించండి
    7. ఇంతకు ముండు ఇచ్చిన లింకు ఆంగ్లానువాదం అనుకుంటాను. సంస్కృత భారతం కొరకు క్రింది లింకు తెరవండి.
      http://www.sacred-texts.com/hin/mbs/mbs01001.htm

      తొలగించండి
    8. శర్మగారూ,

      అకారాంత పుంలింగమైన కంకః అనే శబ్దం తెలుగులోనికి దిగుమతి అయ్యేసరికి డుఙ్ ప్రత్యయం చేరి కంకుఁడు ఐపోతుందడీ. రామశబ్దమూ అలాంటిదే, అదీ అకారాంత పుంలింగమైనదే సంస్కృతంలోని రామః అనేది తెలుగులో రాముఁడు ఐపోయింది కదా. అలాగే‌ కంకః అల్లా కంకుఁడు ఐనదన్నమాట. ఈ అర్థానుస్వారాలు పూర్ణానుస్వారాలుగా కావలసినప్పుడు వాడుకోవచ్చు కాబట్టి రాముండు, కంకుండు అని కూడా అనవచ్చును. ఐతే తిక్కనగారు కంకుడు అని కాక అర్థానుస్వారంతో కంకుఁడు అనే అంటారు తప్పకుండా - అప్పటికింకా అరసున్నలను పాపం కవులూ ప్రజలూ చాదస్తంగా వాడుతూనే ఉండేవారు కాబట్టి.

      ఐతే తిక్కనగారు భట్టశబ్దం చేర్చి కంకభట్టు అని కాని కంకుభట్టు అని కాని అన్నారా అన్నది పరిశీలించవలసి ఉంతుంది.

      అజ్ఞాతవాసాంతంలో‌ పాండవులు నిజరూపాలలో తిన్నగా, విరటుని కన్నా ముందుగానే ఆయన సభలో ప్రవేశించి ఆసీనులై ఉంటారు. విరాటరాజుగారు వచ్చి భట్టుగారు తిన్నగా రాజవేషంలో తన సింహాసనంపైన ఠీవిగా కూర్చొని యున్నందుకు ఆగ్రహించి "ఏమిది కంక శంకదక్కి నా గద్దియపైన కూర్చుండితివి...." అని ప్రశ్నిస్తాడు. ఇది గమనార్హం. దీనివలన శబ్దరూపం కంక అని తేలటానికి. ఇంకా మరింత సందేహనివృతికోసం కొంచెం ఇతరసందర్భాలూ, కంకభట్ట లేదా కంకుభట్ట ప్రయోగాలూ అన్వేషించాలి మనం.

      తొలగించండి
    9. శ్రీకాంత్ చారిగారూ, మరొక రెండు ధన్యవాదాలు అందుకోండి, సంస్కృతభారతం లింకు ఇచ్చినందుకు.
      వృత్తిగతమైన ఒత్తిడి కారణంగా తీరిక దొరకటం కష్టంగా ఉంటోంది.
      వయోభారం కారణంగా ఓపికతగ్గిపోతోంది, ఉత్సాహం ఇంకా ఆట్టే తగ్గకపోయినా.

      తొలగించండి
    10. శ్రీకాంత్ చారిగారూ, వ్యాసభారతం వికీపీడియాలోనూ‌ ఉంది - తెలుగులిపిలోనే ఉంది.
      దాని లింక్:
      http://te.wikisource.org/wiki/వ్యాస_మహాభారతము

      తొలగించండి
    11. ఇది నేను చూడలేదండీ శ్యామలీయంగారూ. లింకు ఇచ్చినందుకు ధన్యవాదాలు.

      తొలగించండి
  5. సార్ సదరు తెలుగు డాక్టరు గారికి కొద్దో గొప్పో డబ్బులు ముట్టాయి! అలాంటి వారికి భారీ నష్ట పరిహారం విధిస్తే బాగుండేది. ఇలా జమ చేసిన డబ్బును తెలుగు విద్యకు ఖర్చు చేస్తే మన విద్యా వ్యవస్థ మెరుగు అవుతుంది.

    రిప్లయితొలగించండి
  6. నాకూ అదే అనుమానం వచ్చిందండి. తెనుగులోకి వచ్చేటప్పటికి కంక శబ్దం కంకుడు అయిపోయింది. ఇంకా పరిశీలిస్తాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అలా ఎవరు చేయగలరండీ?

      నాగార్జున తెలుగు ఘోరంగా ఉంటుంది. 'ఆడతాకి' (ఆడటానికి అన్నమాటకు వచ్చిన తిప్పలు) వగైరా వింత మాటలతో. తెలుగు ఉఛ్ఛారణ సరిగా లేని వాణ్ణి సెలిబ్రిటీని చేసినందుకు తెలుగువాళ్ళకి సామూహికజరిమనా విధిద్దామా?

      పోనీ ఈ‌షోకి యాంకరుగా తెలుగు సరిగా పలకని వాడిని ఎన్నుకున్నందుకు మా-ఛానెల్ వారికి జరిమానా వేదామా? (అన్నట్లు ఆ ఛానెన్ యాజమాన్యంలో‌ నాగార్జున ఉన్నాడని విన్నాను!)

      భారతీయసాంస్కృతిక విశేషాలపైన ప్రాథమికమైన అవగాహన కూడా లేనివాళ్ళకు వెఱ్ఱిమొఱ్ఱి ప్రశ్నలు వేసి డబ్బులు ఉత్తినే పంచుతున్నారని సదరు మా చానెల్ వారిపై కేసు వేదామా?

      కనీసం ఈ‌తెలుగు భాషమీదైనా సరైన అవగాహన లేని తెలుగు డాక్టరేట్ గారికి మీరన్నట్లు భారీ జరిమానా వడ్డిద్దామా?

      ఇవేవీ‌ కుదరవండీ.

      భారతీయసంస్కృతి యేమిటి గాడిదగుడ్డు అని మన మేథావులు వీరంగం వేస్తారు. తెలుగు తెలియకపోతే కొంపేం ములిగిపోతుందీ. 'తెలుగు తెలిసితీరాలీ తెలుగువాడన్నాక' అని మీరు రూలు పెట్టటం అప్రజాస్వామికమూ గట్రా అని మేథావులూ మీడియావాళ్ళూ, అనేకమంది పదహారణాల టెల్గూ వాళ్ళూ రోడ్డెక్కి నానాయాగీ చేస్తారు. తెలుగువాళ్ళై పుట్టటమే నేరమా? తెలుగునేర్చుకోవాలని ఫత్వాలు జారీచేయటానికీ జరిమానాలు వేయటానికీ ఎవరికీ అథికారం లేదని చివరికి న్యాయస్థానాలు తీర్పులు జారీచేస్తాయి. తెలుగువాళ్ళ వాక్స్వాతంత్ర్యం పరిరక్షించబడుతుంది. భారతీయత అంటూ‌ బ్రహ్మపదార్థం ఏదీ లేదని స్వస్తిశ్రీకోర్టువారు తీర్మానం చేస్తారు.

      అన్నట్లు 'కంకుభట్టు' అనే పేరుతో‌ శ్రీమాన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు మరొక అద్బుతమైన నవల వ్రాసి అ కంకుభట్టుగారు విరాటరాజుగారి భార్య సుధేష్ణాదేవిని సఖీ అని పిలిచేవారనీ, సైరంధ్రికి వాళ్ళ మీద అనుమానం మొదలవటం చేతనే వాళ్ళే కీచకుడిని రంగంలోనికి దించారనీ వ్రాస్తారు. అయనకు మరోసారి సాహిత్యాకాడమీ పురస్కారం వస్తుంది - ఈ సారి జ్ఞానపీఠం అవార్డు వచ్చి సన్మానాలు జరిగినా ఆశ్చర్యపోకండి. ఈ‌క్రొత్త కోణంలో విరాటపర్వాన్ని గురించి వ్రాసిన ఈ కంకుభట్టు నవలపైన రీసెర్చి చేసి ఒకరిద్దరు ప్రజ్ఞానిధులు డాక్టరేట్ పట్టాలు పుచ్చుకుంటారు కూడా.

      ఐనా తెలియక అడుగుతున్నాను. విద్యావ్యవస్థ నిజంగానే మెఱుగుపడిపోయి, ప్రజలకు తెలివితేటలు పెరిగిపోయి, విజ్ఞానవికాసాలు వాళ్ళ బుఱ్ఱల్లో జ్వాజ్వల్యమానం ఐపోతే, రాజకీయనాయుకులూ వాళ్ళపార్టీలూ మట్టికొట్టుకొని పోవలసి వస్తుంది కదా. అంత ప్రమాదం రానిస్తారా చెప్పండి?

      తొలగించండి
  7. భారతం మూలం శ్లోకం తెనుగులిపిలో, తెనుగు అర్ధంలో దొరుకుతుందా?

    రిప్లయితొలగించండి
  8. In Tamilnadu Tamil is compulsory, I heard, upto 10th class.
    Similarly SIMPLE TELUGU (One Paper) can be made compulsory upto 10th class
    in A.P. & Telangana, in non Telugu medium schools.
    ...........V.V.Satyanarayana Setty.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.