ఇవేవో అప్పులో స్టెప్టులో అనుకోకండి. ఒకరకం సంస్కృతఛందస్సులు.
సంస్కృతఛందస్సులు ఇరవైఆరు రకాలు. ఒకటవ ఛందస్సుకు పాదానికి ఒకటే అక్షరం. ఇరవైయ్యారవ ఛందస్సుకు పాదానికి ఇరవైయ్యారు అక్షలాలు. కేవలం చదువరుల సౌకర్యం కోసం వాటి పట్టిక ఇస్తున్నాను.
- ఉక్త
- అత్యుక్త
- మధ్య
- ప్రతిష్ట
- సుప్రతిష్ట
- గాయత్రి
- ఉష్నిక్
- అనుష్టుప్
- బృహతి
- పంక్తి
- త్రిష్టప్
- జగతి
- అతిజగతి
- శక్వారి
- అతిశక్వారి
- అష్టి
- అత్యష్టి
- ధృతి
- అతిధృతి
- కృతి
- ప్రకృతి
- ఆకృతి
- వికృతి
- సంకృతి
- అతికృతి
- ఉత్కృతి
ఇరవైయ్యారు అక్షరాలకన్నా శ్లోకంలో పాదం ఇంక పొడుగు ఉండకూడదా అని మీకు సందేహం రావచ్చును. ఉండవచ్చును అని సమాధానం. ఐతే అటువంటి ఛందస్సులను ఉధ్ధురమాలలు అంటారు.
ఛందస్సులలో ఎనిమిదవది అనుష్టుప్పు. పాదానికి ఎనిమిది అక్షరాలు అన్నారు కాబట్టి 256 రకాల అనుష్టుప్పులు కుదురుతాయి. ఐతే ఇది నిర్దిష్ట స్ధానాల్లో గురులఘువులకు నియామకం జరిపి నిర్ణయించే అనుష్టుప్పు వృత్తాల అని లెక్క. మరి గురు లఘువులకు స్థాననియమం లేని పక్షంలో? అప్పుడు పాదాలన్నీ ఒకమూసలో ఉండనక్కరలేదు కాబట్టి 32 అక్షరాలు కలిపి ఏకంగా చూడాలి. అబ్బో అప్పుడు 65536 రకాలుగా అనుష్టుప్పులు ఉండవచ్చు.
ఇదంతా ఎందుకు చెప్పటం అంటే మనం అనుష్టుప్పులు అనే శ్లోకాలకు కచ్చితమైన గురులఘు క్రమం అక్కరలేదు కాబట్టి.
కేవలం పాదానికి ఎనిమిది అక్షరాలు చొప్పున నాలుగు పాదాలు ఒక శ్లోకం. అరుదుగా ఆరుపాదాల అనుష్టుప్పులు కనిపించి కొంచెం తికమక పెడతాయి.
పాదానికి అక్షరాలు ఎనిమిది మాత్రమే కాబట్టి పాదమధ్యంలో విరామస్థానం లేదు. అవసరం కాదు. పదికన్నా తక్కువ అక్షరాలు పాదానికి ఉంటే అలాంటి అవసరం లేదు. ఐతే పాదాంతంలో విరామంమాత్రం ఉండాలి. విరామం అంటే అటుపిమ్మట కొత్త మాట వేయాలి అని ఆర్ధం. విరామం మాట మధ్యలో ఉండదు.
సందర్భం కలిగింది కాబట్టి ఒకమాట. సంసృతఛందస్సులను తెలుగువారు దిగుమతి చేసుకున్నప్పుడు ఈవిరామాల నియమాలను మార్చారు. పాదాంతవిరామం ఎగరగొట్టారు. పాదమధ్యవిరామానికి యతిమైత్రిస్థానం అని కొత్త పేరుపెట్టి అక్కడ అక్షరసామ్యమే కాని పదవిరామం అవసరం కాదని అన్నారు.
ఇలా తెలుగులోనికీ మరికొన్ని దేశభాషల లోనికీ ఉత్పలమాల వంటి సంస్కృతఛందస్సులు వచ్చాయి.
ఫలానా స్థానాల్లొ గురువులూ ఫలానా స్థానాల్లో లఘువులూ అంటూ కచ్చితమైన నియమం ఉంటే అటువంటివి వృత్తాలు. ఉత్పలమాల శార్దూలం వంటివి అలా వృత్తాలు.
ప్రసిద్ధి చెందిన అనుష్టుప్పులు కచ్చితమైన వృత్తనియమాలను కలిగి లేవు. అదే కారణమో మరొకటో కాని అనుష్టుప్పులు దేశభాషల ఛందస్సులకు ప్రాకలేదు.
అనుష్టుప్పులు చిన్న ఛందస్సు. శ్లోకం మొత్తం 32 అక్షరాలే. తెలుగులో అనుష్టుప్పుల స్థానంలో కందపద్యాలు వ్యాపించాయి.
సంసృతకవిత్వంలో ముప్పాతికమువ్వీసం అంతా అనుష్టుప్పులే. తెలుగుసాహిత్యంలో సింహభాగం పద్యాలు కందపద్యాలే.
నిర్దిష్ట గురులఘుస్థానాలతో ఉండదు కాబట్టి అనుష్టుప్పులకు బొత్తిగా నియమాలు లేవు అనుకోవద్దు.
అనుష్టుప్పులలో అన్ని పాదాల్లోనూ 5వ అక్షరం లఘువై తీరాలి
అనుష్టుప్పులలో అన్ని పాదాల్లోనూ 6వ అక్షరం గురువై తీరాలి
అనుష్టుప్పులలో బేసిపాదాలలో 7వ అక్షరం గురువై తీరాలి.
అనుష్టుప్పులలో సరిపాదాలలో 7వ అక్షరం లఘువై తీరాలి.
అనుష్టుప్పులలో సరిపాదాలలో 8వ అక్షరం గురువై తీరాలి.
ఇవే నియమాలు.
స్థూలంగా అనుష్టుప్పులు ఇలా ఉంటాయి.
యిలాగ
X X X X I U U X X X X X I U I U
X X X X I U U X X X X X I U I U
ఐతే ప్రాచీనమైన కొన్ని అనుష్టుప్పులు ఈనియమాలను అతిక్రమించిన సందర్భాలు కనిపిస్తాయి. అనుష్టుప్పులు చాలా రకాలుగా ఉన్నాయి నిజానికి. వీటిగురించి వేరే వ్యాసంలో చెప్పుకుందాం. అపుడు మరింత స్పష్టంగా ఉంటుంది.
తెలుగులో కందపద్యానికి చాలానే నియమాలను గమనించవచ్చును. అబ్బో ఇన్ని నియమాలా ఐతే కందం వ్రాయటం కష్టం అనిపించవచ్చును. కాని కందం వ్రాయటం కవులకు బహుసులభం. ఎందుకంటే నడక అనేది బండి నడిపిస్తుంది కాబట్టి.
అలాగే అనుష్టుప్పులకు కూడా ఒక స్వంత నడక ఉంది. అది పట్టకొని చెప్పుకుంటూ పోతారు కవులు. నియమాలు కుదిరినంత మాత్రాన నడక కుదరకపోవచ్చును కాని నడక కుదిరినప్పుడు వాటంతట అవే నియమాలు పాటించబడతాయి. ప్రత్యేకంగా ప్రయాస అక్కరలేదు.
నడకకుంటుబటిన సందర్భాలలో చదువరులకే ఇక్కడేదో తేడాగా ఉందే అని తెలిసిపోతుంది. అలాగే అక్షరాల లెక్క తప్పిన పాదాలూ చదువరులకు సులువుగా దొరికిపోతాయి. చదివేవారు స్వయంగా కవులు కాకపోయినా అలా దొరికిపోవటం తథ్యం.
ఉదాహరణకు ఈవ్యాసానికి దారితీసిన చర్చలో ఉన్న వసుధైక కుటుంబకమ్ లేదా వసుధైక కుటుంబం అన్న ప్రయోగాలలో ఏది సరైనదీ అన్న ప్రశ్నను చూదాం. వసుధైక కుటుంబకమ్ అన్నది ఒక అనుష్టుప్పులో సరిపాదంగా చక్కగా ఒదుగుతుంది. కాని వసుధైక కుటుంబం అన్నప్పుడు పాదంలో 7 అక్షరాలే ఉన్నాయి. అనుష్టుప్పులో ఇమడదు - ఒక అక్షరం తక్కువౌతోంది కదా చివరన.
ఫాంట్ సైజ్ పెంచితే మీ సొమ్మేంపోయింది? కళ్ళకి కనపడక్కర్లా!
రిప్లయితొలగించండిప్రత్యేకంగా చిన్నఫాంట్ వాడలేదండీ. బ్లాగర్ వాడు నార్మల్ ఫాంట్ అన్నదే వాడాను. ఈమధ్యన పెద్దవారికి సౌకర్యంగా ఉంటుందని లార్జ్ ఫాంట్ వాడుతున్నాను. ఈటపాలో మరచిపోయాను. ఈటపాను నేను ఒక హాస్పిటల్ కారిడార్ నుండి ప్రచురించాను మొబైల్ మీద కష్ఠపడి టైప్ చేసి. ఈవ్యాఖ్య కూడా ఆలాగే వ్రాస్తున్నాను. దయచేసి నిష్టూరం వద్దు.
తొలగించండికనపడని బాధ మరేంకాదు! మళ్ళీ హాస్పిటల్ ? ఏమంత కంగారు, నెమ్మదిగా రాయచ్చుగా!
తొలగించండిసాయంత్రం ఇంటికి చేరాక ఓపికా తీరికా అనుమాన మండీ. లోపల పేషెంటుకు డయాలసిస్ బయట అటెండరుకు కొంచెం తీరిక కాబట్టి ఇలా వ్రాయటానికి పూనుకున్నాను.
తొలగించండిayyo
తొలగించండిఅదేమిటి, ఆ మధ్య మనం కలిసినప్పుడు డయాలిసిస్ ఆగిందని మీరన్నట్లు జ్ఞాపకమే 🤔? మళ్ళీ అవసరం పడిందా? అయ్యో 😒.
తొలగించండిమీరు చాలా జాగ్రత్త వహిస్తూ కంటికి రెప్పలా చూసుకుంటున్నారు 🙏🙏.
ఒకసారి డయాలసిస్ వెల్కమ్ చెప్పిందంటే అది యావజ్జీవకార్యక్రమమే నండీ. ESRD patients వారానికి మూడుసార్లు రోజు విడచి రోజూ చేయించుకోవలసిందే నండీ.
తొలగించండిదురదృష్టకరం 😒.
తొలగించండిమన చేతుల్లో ఏమీ లేదనుకోండి, మన ప్రయత్నం చెయ్యడం వరకే మన చేతుల్లో ఉన్నది, మీకు తెలియనిది కాదు 🙏.
కమ్మెచ్చులో పెట్టి లాగేస్తుంటే కందపద్యాలకేం లోటు సామీ! నడక బలె బలే !! ఇటుకలకట్టుబడి సరిపోతే చాలదా!
రిప్లయితొలగించండికళ్ళూ ముక్కూచెవులూ కరచరణాదులూ అన్నీ సరిగానే అమర్చినా కొలతల ప్రకారం మంచి బొమ్మగా మలచినా జీవకళ అనేది లేనిది దండుగ కదా! కట్టుబడి పద్యాలు లక్షణాలకు సరిపెట్టి గిలికినా లక్షణమైన పద్యాలు కాలేవండీ.
తొలగించండి