15, జనవరి 2023, ఆదివారం

శ్రీరఘురామా నీశుభనామము

శ్రీరఘురామా నీశుభనామము జిహ్వకు రుచియని పలికెదనా భవ
తారకనామము దొరికెను నాకని తలచి మురియుచును పలికెదనా

పాపములను తొలగించు నామమును పట్టాభిరామా వదలనయా
తాపత్రయమును బాపు నామమును దాశరథీ నే వదలనయా

వనితగ రాతిని మార్చిన నామంబును నే నెన్నడు వదలనయా
మునిగా బోయను మార్చిన నామంబును నే నెన్నడు వదలనయా

కోతికి బ్రహ్మపదంబు నొసంగిన గొప్పనామమును వదలనయా
ప్రీతిగ శివుడు జపించుచు నుండెడి విష్ణునామమును వదలనయా

వదలను వదలను నామస్మరణము వదలను గాక వదలనయా
నిదురనైన నీ నామస్మరణము వదలను రామా వదలనయా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.