18, జనవరి 2023, బుధవారం

కులుకవే నానోటను గోవిందుని నామమా

కులుకవే నానోటను గోవిందుని నామమా

సలలితమగు నామమా చక్కని రామనామమా


పంచదార కన్న తీపి పంచే మంచి నామమా

మంచివారి కెల్లప్పుడు మదినుండే నామమా

కొంచెము బుధ్ధుల కెపుడు కొరుకుపడని నామమా

అంచితముగ సౌఖ్యతతుల నందించే నామమా


మించు కలిమాయలను మ్రింగివేయు నామమా

వంచనలకు చెడక కాపాడుచుండు నామమా

సంచితమును నాగామిని చక్కబరచు నామమా

మంచిమంచి బుధ్ధులిచ్చి మమ్ము బ్రోచు నామమా


కొంచెపఱచు లోకములలో గొప్పనిచ్చు నామమా

కుంచాలుగ సంపదలను కొలిచిపోయు నామమా

ముంచు శత్రుషట్కమును ద్రుంచునట్టి నామమా

ఎంచి మది స్మరించ మోక్ష మిచ్చునట్టి నామమా